Thursday, December 31, 2020

కొత్తవత్సర సీసం

 సీసం:


తెలగాణ యిలవేల్పు యెములాడ రాజన్న

కరుణాకటాక్షాల కాంతినింప


కొండగట్టుసిగన కొలువైన అంజన్న

బలముజనులకంత కలుగ జేయ


దక్షిణకాశిమా ధర్మపురపువేల్పు

మూడునామమ్ముల మోక్షమీయ


యాదాద్రి కొలువైన యాదగిరీశుడు

కోరివచ్చినవారి కోర్కెదీర్చ


దేవ దేవుళ్లు కలువైన ధీమతోడ

లింగత్రయపు నేల లీల జూప

ముక్కొటిజనము గాచుచు దిక్కునిల్చి

కొత్తవత్సరమున జిమ్మాలె క్రొమ్మెరుగులు


పచ్చిమట్ల రాజశేఖర్

Tuesday, December 29, 2020

కైతికాలు-1

 ఎరుపురంగు కురులల్లో

ఎగబాకెను ఒకసర్పము

మగువకురులు ముడుచుటలో

కనిపించెను కడుదర్పము

వారెవ్వా! వనితలు

ముడుచుటలో సిద్ధహస్తులు - 71

అరిగడ్డిని మోపుగట్ట

పసిడిపాము మెరిస్తుంది

ఏమరుపాటుగ జూడగ

గగుర్పాటు కలిగుతుంది

వారెవ్వా! పడతులు

మెరిసిమురిసె నాకురులు-72


ఎరుపురంగు కురులల్లో

ఎగబాకెను ఒకసర్పము

మగువకురులు ముడుచుటలో

కనిపించెను కడుదర్పము

వారెవ్వా! వనితలు

ముడుచుటలో సిద్ధహస్తులు 73


దున్నదెంత కృతజ్ఞతో

వెన్నుపైన మోస్తున్నది

మేతమేపె పిల్లడిపై

ప్రేమను కురిపిస్తున్నది

సాకుతున్న యజమానిపై

పసులకెంత విశ్వాసమో - 74


పసులవెంట తిరిగితిరిగి

అలిసెనేమో పసివాడు

సెలకలల్ల మేయుచున్న

గేదెపైన వాల్చినాడు

వారెవ్వా! ఏమిరాజసం

విశ్వమంతా గులాంగులాం - 75

ఒంటిపైన గుడ్డలేదు

ఒంటరైన బోసివోడు

ఏరాజ్యం లేకున్నా

మారాజుకు తీసిపోడు

చీకుచింతలేనోడా

పసులగాసె మొనగాడ - 76


ఆడిపాడె వయసులోన

ఆలమంద నెంబడించె

అలసిపోయి నడువలేక

గేదెనెక్కి పవ్వళించె

ఆటగోరు ఆబాలుడు

అసలుసిసలు గోపాలుడు - 77

పడతికురుల ముడినిచూడ

గడ్డిమోపు తలపించును

ఏమరుపాటుగ చూచిన

గగుర్పాటు కలిగించును

అందం పడతుల సొంతం

ముడులకేవి అనర్హం - 78


పుస్తకాల పఠనమ్ము

మస్తకాల విరియించు

బుద్ధిబలము వికసించి

బతుకుదెరువు కలిగించు

పుస్తకాల నేస్తము

వికసించును చిత్తము - 79


అక్షరమణులను పొదిగిన

అందమైన పత్రగుచ్చము

జ్ఞానవీవెనలు వీచే

వాడిపోని పూగుచ్చము

జయజయహో! పుస్తకము

అనంత జ్ఞాన కాసారము - 80

 

ఒంటిమీద గుడ్డలేదు

ఇంటివెనుక సేనలేదు

విప్పారిన ఆకళ్లలొ

ధైర్యానికి కొదువలేదు

వారెవ్వా! బాలకా

భావితరపు ఏలికా


బాలుడు స్తంభము నిలిపెను

స్తంభము బాలుని నిలిపెను

ఒడుపుగ నిలిచిన చిత్రము

అచ్చెరువు మదిన గొలిపెను

చిత్రము జూడ చిత్రము

మదిలొ ఏదో ఆత్రము -


భయముగుప్పిట నక్కిన

బాలుడి ధీనత చూడు 

సుడులుదిరిగె కన్నీళ్లు

వినిపించు వానిగోడు

అయ్యో! ఆధీనవదనం

పేదరికపు నిదర్శనం - 82


అనంతభరతావని మది

 దైవత్వం పులుముకుంది

పూలలోన దారంలా

ఆధ్యాత్మికత దాగుంది

మనోనేత్రం తెరిచిచూడు

దేవుడు నీముందు నిలుచు - 83


 పశువైన దాటించె

పసివాని నవతలికి

ఆపశువు నదిలించె

మేతమేసేతలికి

పరిస్థితుల బట్టి

పైనకిందవుట తథ్యం -84


ఆడిపాడి బాలుడు

అలసిపోయినవేళ

పశువుశిరపు పాన్పు

పవ్వళించె తానిల

జోజో! బాలకా

నిద్రచోటెరుగదు గదా - 85

 ఏటికవత లమ్మనాన్న

ఇవతలేపు చిన్నినాన్న

దరికిజేర తలపించగ

దాటించెను గదాదున్న

బజ్జోర కన్నా

నీకెందుకు బెంగ - 86

 అలుపులేక ఆలమంద

పాలించెను గోపాలుడు

ఆమందల నాపలేక

అలిసిపోయె నీబాలుడు

అరెరే చిన్నోడు చూడు

ఆవెన్నుని బోలిన రేడు - 87


ఆకలికేకలు వేయగ

ఏరవతల గేదెమేసె

అలసటతనువు నిండగ

ఏరుదాట గేదేమోసె

చూడ పశువేయైనను

చూపించె నమ్మతనము - 88


ఆకలేసి ఆపిల్లడు

అమ్మపాల కైవెదికెను

ఉట్టుతున్న చెట్టుజూసి

పాలదారె యనితలచెను

కాడు వీడమాయకుడు

వీడెంతో మాయకుడు - 89


ఉడుతసొంటి బుడుతడుతను

ఈతచెట్టు నెగబాకెను

పాలసొంటి చెట్టునీర

పొట్టనిండ తనుగ్రోలెను

ప్రకృతెంత గొప్పదో

పసియాకలి దీర్చెను -90


వేలెడంత పసిబాలుడు

వేలాడెను చెట్టువట్టి

కారేఅమృ తపుబొట్లను

తాగేసెను బుక్కవట్టి

ఆకలెంత చెడ్డదోగద

అకార్యాలు చేపించును - 91


పేదోనిగల్మల నిలిచి

ఓట్లడిగేటి మాయకులు

గద్దెనెక్కి గరీబోల్ల

గదమాయించె నాయకులు

ఓహో! మన నాయకులు

వికృతాంగ వినాయకులు


ఓహో మననాయకులు

మహామహా మాయకులు - 92

Monday, December 28, 2020

చలికాలపు తొలిపొద్దు

 లోకమంతా చీకటి దుప్పటిలో తలదాచుకొని

వేకువకై వేచిచూస్తుండగా

పక్షుల కువకువ సరాగాల నడుమ

పుఢమిపై పరుచుకున్న

తెలిమంచు ముత్యాలనేరుకుంటున్న

ఉదయభానుడి కరస్పర్శతో

ముకిలించుకున్న కుసుమాలు

ముదముతో విరిసిన తరుణం

చలినెగల్ల రగరగలో మెరిసే

చంద్రబింబాననల చేతివేళ్ల

ఐంద్రజాలిక రంగవల్లులతో

స్వాగతించే ఉదయమే ఊహాతీతం

Thursday, December 24, 2020

గిరిపుత్రులు - కైతికాలు


విపనిలో విహరించు

జీవరాశుల గుంపు

అడవిలో బతికేటి

ఆదివాసుల సొంపు

వారెవ్వా! కానకూనలు

మోసమెరుగని మోటుమనుషులు -66


అడవితల్లి ఒడితిరిగే

ఆటవికులాదివాసులు

అన్నెంపున్నె మెరుగని

అమాయకపు జీవులు

వారెవ్వా! ఆటవికులు

సంస్కృతికి వారసులు-67


ఆకలిదప్పులు తప్ప

ఆస్తిపాస్తులు లేవు

అనురాగమే తప్ప

అలమరలన్నవిలేవు

వారెవ్వా! అడవిబిడ్డలు

మెరిసే మోదుగుపూవులు-68


కాయలుపండ్లు తిని

కాలమెల్ల దీస్తరు

కమ్మని జుంటితేనె

పిండుకోని తెస్తరు

వారెవ్వా! గిరిజనులు

వనానికి జనానికి వారధులు-69


కాయలు పండ్లతోటి

కాలమెల్ల దీస్తరు

జుంటితేనెల రుచులు

జగతికి జూపిస్తరు

వారెవ్వా! గిరిజనులు

కల్తిలేని మనుషులు - 70

Tuesday, December 22, 2020

చురకలు

 

పచ్చనిపంటలు

మొలిపించిన నాగలి

ఊయలూగుతుంది నేడు

మోడుబారిన చెట్టుకు -1


పల్లెతనం 

డొల్లతన మయింది

పట్నపు హంగులు

పులుముకొంది - 2


పక్షులన్నీ

వలస వోయినయి

వట్టివోయిన

చెరువుల నిలువలేక-3


తాజ్ మహల్ 

తలదించుకుంది

గిజిగాడు అల్లిన

ఊయల మేడను జూసి -4


ఎడారి ఆకలికి

ఒయాసిస్సు బియ్యపుగింజ

పేదోడి ఆకలి దీర్చ

ప్రభుత్వ పథకాలు తీరు -5


పుస్తకం అలిగింది

తలుపు దెరువని బడుల జూసి

బడిమొకంజూడని

పిల్లల జూసి -6


మనసు పీకి

గడీయారపు కొయ్యకు 

తగిలించిండు మనిషి

గంటల నడుమ ఊగిసలాటే -7


చేపలు నీటికి

ఎదురీదుతున్నయి

ఆటవిడుపుకు గాదు

ఆకలి వేటకు - 8


బువ్వ

బురదయింది

ప్రకృతి

వికృతచేష్టలతో - 9


కృషీవలుడు

బయటపడకుండు

విత్తనకంపెనీ

వలనుండి- 10


అలసిన 

రైతు కదలలేకుండు

ధరణి 

పొత్తిళ్ల సేదదీరిండేమో -11


నాయకులు

జమచేస్తుండ్రు మనీ

ఓటరుకు

ఎరేయడానికనీ- 12


పెద్దమనిషి

ఏషం మార్చిండు

ఖద్దరేసి

గద్దెనెక్కిండు - 13


మనిషి

పరాధీనుడైండు

పైసల

మోహం వీడలేక -14


మనిషి

పరుగులువెడుతుండు

గడియారపు

ముళ్లుపొడుస్తుంటే -15


రోగం

భోగాన్ని మరిపించింది

మనిషిలోని

మనసు చిగురించింది -16




Friday, December 18, 2020

ఆశల పసలు

 

పుఢమిపై యేరుల తలపించే

మోముపై ముడతలు

ఇంద్రధనుసోలె వంగినయెన్నెముక

విశాలవిశ్వంలో అక్కడక్కడ 

మొలిచినిలిచిన పచ్చనిమొక్కలోలె

ఒంటిపై గుడ్డలు

మూడోకాలుంటే తప్ప 

నడువలేని ముసలితనం

అన్నింటిని మించి 

భావిపై భ్రమలేని పండుటాకు

అయినా

తానేదో చేయాలనుకుంటుంది

భావితరాలకు బతుకునీయాలనుకుంటుంది

తనురాలే ఆకే అయినా

తనఆశలు అంకురించేలా

ఆశయాల విత్తులు నాటాలనుకుంటుంది

నమ్ముకున్న ఎవుసం

అయినవాళ్లందరిని ఉరితీసినా

మట్టిని నమ్మి

పోగేసినవన్నీ పోగొట్టుకున్నా

బందబారిన గుండెతో

మొక్కవోని అశయంతో

చలించని ధృఢసంకల్పంతో

పచ్చని పైరుల పెంచి

సిరులరాశులు పంచేలా

అనుభవపు పుటలు తిరిగేసి

మళ్లీ

పొలం బాటవట్టింది

పాతవిత్తుల పాతరవెడుతుంది

నడుమంచి నాట్లేసి 

ఆకుపచ్చని ఆహార్యమద్ది

ధాన్యరాశుల దగదగలతో

అవనిని అన్నపూర్ణని నిరూపించనుంది


పచ్చిమట్ల రాజశేఖర్ 

గోపులాపూర్ 

జగిత్యాల

9676666353

rajaachimatla@gmail.com

Sunday, December 13, 2020

చిత్ర - కైతికాలు

 ప్రకృతి ప్రసాదగు

నవధాన్య రాశులు

శిల్పిచేయి జేరి

యొనగూరె చిత్రములు

వహువా! కళాహృదయం

మొలిపించె మోహినీరూపం - 56


సంటిబిడ్డ చేతవట్టి

సంబురంగ అడుగులేసె

అంబరాన తిరుగాడే

ఆచంద్రుని బుట్టలేసె

వారెవ్వా! పల్లెపడతి

నీవల్లె కుటుంబప్రగతి- 57


పల్లెపడతి నడకందం

పసికందుల తోడందం

నింగివిరిసె రవిబింబం

బుట్టజేర మిగులందం

విశ్రమించని కాలగమనం

శ్రమజీవుల బతుకుపయనం! - 58


వసుధలో మొలిచేటి

సుగంధ ద్రవ్యాలు

ఒడుపుగా పొదిగేను

సుందర రూపాలు

వారెవ్వా! కళాతపస్వి

నీవేలే చిరయశస్వి - 59

వెలిసినాయి పుడమిపైన

ఆధునికపు గుడులు

మనిషి మేథను దీర్చుతు

భవితగూర్చును బడులు

ముక్తినొసగు గుడులకన్న

విముక్తి నొసగు బడులెమిన్న - 59


యెదనిండ నీరున్న

పయనమా పదుయేరు

ప్రాణికోటి కిబంచి

పులకించు మిన్నేరు

ప్రకృతెంత గొప్పది

పరులకొరకే బతుకుతది - 60


లోకానికి వెలుగుపంచ

ఉదయించె అర్కబింబము

నిలువుటద్దపు యేటిలో

చూసిమురిసె తనబింబము

మోహమెంత మాయనో

మహామహుల నావహించు - 61


ప్రేమ తనువు నావహించ

అన్నుమిన్ను గానకుండు

ప్రేయసి చేయందించగ

స్వర్గమెతన చెంతనుండు

వారెవ్వా! ప్రేమికులు

ఊహలోక భావకులు! -62


గాలిబుడగ లేపినట్టు

యువకుని లేపిందినారి

ప్రేమగాలి సోకియువత

పడుతున్నదిల పెడదారి

వారెవ్వా! నారీమణి

నీప్రతిభకు సలాంమరి-63


అరిగడ్డిని మోపుగట్ట

పసిడిపాము మెరిస్తుంది

ఏమరుపాటుగ జూడగ

గగుర్పాటు కలుగుతుంది

వారెవ్వా! పడతులు

మెరిసిమురిసెనా కురులు-64


రాజశేఖర్

Tuesday, December 8, 2020

రైతులు - కైతికాలు

  మట్టిపొరల మనసుజూచి

గంగతల్లి నుబుకించెను

పుఢమిపురిట విత్తునాటి

అన్నపురాశి మొలిపించెను

వహువా! రైతన్నా

బ్రహ్మ మారుపు నీవన్నా - 1


ఎండనక వాననక 

సెల్కల్ల చెమటోడ్చి

పైరులన్నో బెంచి

పంటలను బండిన్చి

వారెవ్వా! కృషీవలుడు

దాచుకోని త్యాగశీలుడు - 2


నాగలికర్రు వంగింది

భూమిపొరలు చీల్చలేక

రైతునడ్డి విరిగింది

అప్పుకొండ మోయలేక

అయ్యయ్యో! హలదరుడు

వేలాడెను ఉరితాడుకు - 3

Saturday, December 5, 2020

గజల్

 ఆజాబిలి నింగిజారి యిలకు చేరెనేమో

తామరాకు ఆచంద్రుని గొడుగు పట్టెనేమో

తానునడిచినా పథమున వెన్నెలెంతొ పులుముకొంటు
భువిచీకటి తరిమికొట్ట వెలుగు తెచ్చెనేమో

యెదపుఢమిల దాగివున్న దివ్వెలన్ని వెలిగించగ
తనకన్నుల మెరుపుతీగె లరువు యిచ్చెనేమో

మోడుబారి ముడుచుకున్న మదిప్రకృతి మనసువిరియ
చిరుజల్లుల చంద్రికలను యిలకు దించెనేమో

ఆచల్లని చూపులలలు యెదగోడలు తడిపేలా
నులివెచ్చని సమీరాల వలపు  విచ్చెనేమో

Thursday, November 26, 2020

చీకటిరోజులు


అనంతవిశ్వాన్ని

చీకటిదుప్పటి పలుమార్లు కప్పేస్తున్నా

నిరంతరం నిట్టూరుస్తూ

దుర్భరమైన పయనంచేసి

ఆనందకర వెలుగురేఖలకై వేచిచూస్తున్నపుడు


అనువంత నీవు చీకటికో లెక్కా

నీవూ విశ్వంలో ఒకడివైతే 

నీకు భరించే ఓపికుంటే

వెనుకచ్చే వెలుగును చూడు

చీకటిరోజులకు చింతించకు!


కాలగమనంలో ప్రతిప్రాణి

సమస్యలసుడిగుండంలో చిక్కాల్సిందే

గిరికీలు కొట్టాల్సిందే

డక్కాలుముక్కీలు తినాల్సిందే


అంతమాత్రాన అలసట చెందితే

నీబతుకు నిరర్థకమే!

Wednesday, November 25, 2020

ముళ్ల బాట

 


మది నిండ మమతలు

యెదనిండ ప్రేమలు

హృది నిండ మానవతా

పరిమళాలు వెల్లివిరిసి

విశ్వనరుడై విలసిల్లిన

నాటి మనిషి నేడు కానరాడు!


పొద్దు వొడిసిననుండి పొద్దు గూకె దాక

నిరంతరం పోటీపడి గడిపే

ఉరుకులు పరుగుల జీవితం

కొండను దవ్వితే ఎలుక ఫలితం!


దుప్పటి తీసి దేవుని జూసే జనం

మూడు ముళ్లు ముచ్చటగ కదిలే

గోడగడియారం వంక గోసగ జూసి

ముళ్లతోటి కాళ్లు కదిపి మురుస్తుండు!


పొద్దు తోటి సద్దు చేయక కదులినా

పొట్ట కూటికొరకు పొరలని మనిషి

నేడు రాత్రనక పగలనక రాటోలె దిరిగినా

కోరికలు దీరక గోసపడుతుండు!


కాలంతోటి కాలుగలిపి

నిత్య చైతన్యముగ నిలువెల్ల శ్రమించి

ఆశ చావక అలసి సొలసి

హఠాత్తుగ  పెద్ద ముళ్లాగి పోతుంది

బతుకుబండి చతికిల బడుతుంది!


రాజశేఖర్ at 11:29 PM

Wednesday, November 11, 2020

దీపావళి - కైతికాలు

 కష్టాల చీకటి కడతేర్చి

సంతోషపు తారాజువ్వలు

దారిద్ర్యము రూపుమాపి

ధనమొనగూర్చు సిరులతొవ్వలు

వహ్వా! దీపాల వెలుగులు

చీకటిని చీల్చే చురకత్తులు - 1


తేజోవంత ప్రదీపికలు

నువ్వులనూనె దీపాలు

జిల్లెడువత్తుల జిలుగులు

జల్లించుజగతి పాపాలు

వెలుగునిచ్చు దీపం

సర్వపాప హరణం  - 2


ఇళ్లముంగిట వెలిగేటి

పగడపుముక్కు ప్రమిదలు

సూర్యున్ని సాగనంపే

మింటమెరిసే మిణుగురులు

వారెవ్వా తెలుగులోగిళ్లు

మెరుగుజిమ్మే దీపాలవెలుగులు - 3


పొద్దుపొడువక మునుపు

తలంటు స్నానాలు

పొద్దుగూకిన వేళ

గౌరిదేవి వ్రతాలు

వారెవ్వా! దీపావళి

నేలదిగిన తారావళి - 4


గంగస్నానాలు

గౌరమ్మ వ్రతములు

అలికిన ముంగిళ్లు

పరిచినా ముగ్గులు

పల్లెఒడిన పండుగ

మోదమొసగు మెండుగ - 5




Tuesday, November 10, 2020

చిత్ర కైతికాలు

 ఇంతచిన్న బుడ్డోడికి

ఎంతపెద్ద బాధ్యతనో

గుక్కపట్టి నాచెల్లిని

ఊకుంచేదెలాగనో

వారెవ్వా! ఓదేవుడా

నీలీలలు భళా భళా! -52


జానెడంత సొంతకడుపు

నింపుకోను దారిలేదు

చిట్టితల్లి చిన్నికడుపు

నింపుడెట్లొ తెలియలేదు

వారెవ్వా! ఆకలి

ఆమంటలు ఆరనివీ! -53


ఆకలితీర్చడమెగాదు

అరకదున్ను తుందిఅమ్మ

కూనలభారమేగాదు

ఇల్లునడుపు తుందిఅమ్మ

వారెవ్వా మాతృమూర్తి

నీకుసాటిలేరు జగతి - 54


చిటపటలు చిలిపిచేష్టలు

అలకలూ బుజ్జగింపులు

దినమంతా పడిగాపులు

మురిపించే మునిమాపులు

వారెవ్వా! ఆలుమగలు

అల్లుకుపోయె లతలతోపులు - 55

Sunday, November 8, 2020

చిత్ర పద్యమాలికలు

 నిగనిగలనుజిమ్ము నెమ్మోము నెరజాణ

ఆడునెమలిజూచి ఆదమరచి

అందమైనపింఛ మమరిచేతనుబూని

ముద్దులిడెనదరము మురిసిపోవ

Saturday, October 31, 2020

చిత్ర మధురవాణి

మధురవాణి
....................
1.ఇది నూతన సాహిత్య ప్రక్రియ
2.ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి
3.ప్రతి పాదంలో నాలుగు పదాలు ఉంటాయి
4.రెండు...నాలుగు పాదాల చివర అంత్యప్రాస ఉండును
5.నియమబద్దమైన వచన కవిత
ఉదాహరణకు
.....................
తల్లిని విడచి భార్యను చేరి
తల్లిని దూరం చేయుట తగదన్న
తల్లిని మించిన దైవం లేదని
పెద్దలు చెప్పిన మాట నిజమన్న
గమనిక
.............
1.నూట ఎనిమిది మధురవాణిలు వ్రాసిన కవికి**వాణిశ్రీ**పురస్కారం  లభిస్తుంది.
......................................................
తెలంగాణ తెలుగు కళా నిలయం,భైంసా
నిర్మల్ జిల్లా తెలంగాణ
అధ్యక్షులు.గంగుల చిన్నన్న..తెలుగు పండితులు
ప్రధాన కార్యదర్శి.కడారి దశరథ్..తెలుగు పండితులు
మధురవాణి రూపకర్త.జాధవ్ పుండలిక్ రావు పాటిల్
సమీక్షలు.డాక్టర్ వి.జలంధర్..ఆచార్యులు తెలంగాణ విశ్వవిద్యాలయం


 ఆసువోసి అల్లుకున్న గూడునీట మునిగింది

గూడులేని గువ్వతీరు అవ్వమనసు బెదిరింది

ఆపద్భాంధవునివోలె చెట్టుచేయి చాచింది 

దిగులుమరచి ఆయవ్వ చెట్టుసంక చేరింది - 1

అధునాతన వస్త్ర ధారణలో మెరసి పండుటాకు మోము సిగ్గు లొలికింది ముదిమి వయసుకేగాని మనసుకు కాదంటు ముసలవ్వ మదినిండ తెగ మురిసిపోయింది చిత్ర మధురవాణి అంకిత భావము అకుంఠిత ధీక్ష అమరం అలనాటి గురుశిష్య బంధములు నిశ్వార్థ త్యాగము నిండైన గౌరవం గురుశిష్య పరంపర నొసగేటి గురుకులములు ఆకలికి తాలలేక అణువణువు వెతికినా ఆయాసమె తప్ప ఆబాధ తీరలేదు దాహార్తిని తీర్చ చెలిమెవైపు తొంగిచూడ అలసిన యీదేహాన్ని అద్దమై చూపించెను

Monday, October 26, 2020

సుమాలు

 తబల

జోడువీడని సోదరులు తబల - సంగీత సమరమే సదా

పొదుపు

ఒడుపుగ పొదుపు నొంటవట్టించింది - చిల్లదాచిన చిన్ననాటి గల్లగుర్గి

మల్లెలు

మరుమల్లెల సౌరభాలు మనసు దోస్తున్నవి - వికర్షించు హృదయాల నాకర్షిస్తూ


Tuesday, October 20, 2020

బతుకమ్మపాట

 బంగరుపూలతోని తంగెళ్లు మురిసినయి

ముత్తెపుసరులుదాల్చి గునుగుపూలు మెరిసినయి

తలనిండ పూవులతో తంగెళ్లూ నిలిచినవీ
వెన్నెలంత పులుముకొనీ గునుగులన్ని మెరిసినవీ
ముత్తైదు పసుపు పులిమి బంతిపూలు మురిసినవీ
కుంకుమంత 
సింగిడితో చెలిమిజేసి రంగులన్నీ పులుముకొని
తీరుతీరుపూవులన్నీ   జాతరబైలెల్లినవీ
తెలంగాణ ముంగిళ్లలో బతుకమ్మై వెలిసినవీ
నుదుటిబొట్టు 

Sunday, October 18, 2020

బతుకమ్మ గోడు

 అడవిన తంగెళ్లు తలనిండపూలతో

సింగారించుకున్నా

ముత్యాలోలె జాలువారి 

గునుగుపూలు విస్తరించినా

రాచగుమ్ముళ్లు రాకుమారసొంటి 

గౌరమ్మను ఆకుపొత్తిళ్లలో ఊయలూపుతున్న

బీరపూపాదులు పసుపుపూతతో మెరిసిపోతున్న

చెరువంతా జోతులకాంతులోలె

తామరలు పరుచుకున్న

ఏఒక్కరూ పూలు దెంపలేకున్నరు

కరోనా పుణ్యమాయని

కాలుగడపదాటలేకున్నరు

సద్దులబతుకమ్మను మది నిలుపుకొని

యాడంత ఎదురుజూసిన జనం

గల్మముంగట కాచుకూసున్న 

మహమ్మారిని దాటి బతుకమ్మను పిలువ

భయపడుతున్నరు

ఈపీడను నిలదొక్కుకొని 

గౌరమ్మనాహ్వనించలేక

ముదితలంత మదనపడుతున్నరు


 గండుకోయిలలై గళమెత్తె పెద్దమనుషులు

మూతికట్టుతో ముడుచుకూసున్నరు

చప్పట్లతాళాలతో దరువేసే పడతులంత

గుమిగూడభయపడి లోగిల్లు వీడకున్నరు

వీధులన్నీ పూలవనాలై

పల్లెలన్నీ పూలబోనమెత్తే వేళ

గాలిసోకి గావరైన పల్లె

బతుకమ్మకు వాయినాలియ్య భయపడుతున్నది.


(కరోనా సోకిననాటి బతుకమ్మ)


Wednesday, September 23, 2020

బానకడుపులు - కైతికాలు

 కుస్తీలెన్నో  పడుతూ

కండలుపెంచిన వీరులు

కుస్తీలన్నవి మరచీ

బస్తలునింపిన భోగులు

వారెవ్వా! కండలరాయులు

కుంభకర్ణ సహోదరులు  -50



కడుపులకన్నా నయం

యెనుకటి ధాన్యపుకాగులు

మీకన్నను నయంనయం

వనమందలి గజరాజులు

వారెవ్వా! లంబోదరులు

కలియుగపు గణనాథులు- 51

Friday, September 18, 2020

మణిపూసలు

 [18/09, 1:48 pm] Rajashekar: చేయిలేనిదెవరికి చేయలేనిదెవ్వరు

విధియాడిన నాటకంలొ బలికానిదెవ్వరు

మనసులోని సంకల్పం ఉక్కుకన్న గట్టిదైతే

విధిరాతని గెలువకుండ వెనుదిరిగే దెవ్వరు - 1


చేయిలేకపోతెనేమి చేయలేనిదేమున్నది

పదములేకపోతెనేమి పథముసాగిపోతున్నది

భయమన్నది యెరుగకుండ పలుమార్లు యత్నిస్తే

మహివెలయుమనుషులకు సాధించలేని దేమున్నది-2

Thursday, September 17, 2020

మబ్బులు తొలగిన పొద్దు (సాయుధపోరాటవీరులు)


మువ్వన్నెలజెండతీరు మూడుభాషలప్రజలు మురిసియాడిననేల

కుడుమంటే పండుగని కులమతాలుమరిచి సంబురాలాడేనేల

అజ్ఞానానికి తోడు అమాయకత్వం కలగలిసి మానవత్వం పరిమళించిననేల తెలంగాణ!

నైజాముల పాలనలో నాజీల అరాచకాల్లో రజాకార్ల దోపిడిలో దొరలఏలుబడిలో చతికిలవడిన నేల 

ప్రభువర్గపు అమానవీయ అకృత్యాలతో తనువుపుండైన నేల

మతోన్మాదం వేవేలనాల్కల విషంగక్కిననేల తెలంగాణ!

దోచుకున్న రైతుల పంటలు దిగంబరంగ బతుకమ్మలాడిన మహిళలు

గోళ్లకింద వొడిసిన గుండుసూదులు చెవులకుగట్టిన బరువుల మోతలు

ముక్కువిండి వసూలుజేసే పన్నులు 

దౌర్జన్యాన్ని దాష్టీకాన్ని తప్పించుకొని ఉప్పొంగిన అలలు తెలంగాణపల్లెలు!

పల్లెల దశనూ దిశనూ మార్చి తెలంగాణను పునీతగావించ 

ఉద్యమించిన ఉద్యమకవలలు హింసాహింసలు!

సాయుధరైతాంగపోరాటం మోకుతాడులో పోగులైన

ప్రజలు ప్రజాస్వామికవాదులు కవులు రచయితలు కళాకారులు

అట్టడుగువర్గాలే గాదుఉన్నతవర్గాల ఉద్యమకారులు

ప్రజాశ్రేయస్సుకోరి పోరుజేసి 

ఉరకలెత్తె ఉడుకునెత్తురు పులిమి పోరుపతాకకు అరుణవర్ణపు అత్తరుపూసి

నైజాంపాలనకు చరమగీతం పాడి తెలంగాణ బంధనాలు తెంపి

స్వేచ్ఛావాయువులందించి శాంతినిపండించిన వీరులు

మోదుగుచెట్టుకు పూసిన అగ్గిపూవులు

అమరులై ఆకాశాన మొలిసిన చుక్కలు సాయుధపోరాట యోధులు

Friday, September 11, 2020

చిత్రవర్ణన- పద్యం

 నింగినివేలాడు నిండుజాబిలితాను

చుక్కలన్నిటినేరి చక్కగూర్చి

వాలుజడనుదిద్ది వలపులమరజేసి

సౌరభమ్మువిరిసి సౌరులొలుక

కారుచీకటిబట్టి కాటుకగాదాల్చి

కాంతులీ నగజూచె గన్ను దోయి

వాలుజడనుదాల్చి వలపుల మరజేసి

జరిగిపోవుచుతాను తిరిగి చూచె

చిరునగవులనొలకు చిగురాకు చెక్కిళ్లు

పాలపుంతనొసగు పళ్ల వరుస

దొండపండుతీరు దొరిసేటి పెదవుల

మధులొలుకగ పిలిచె వధువు తాను

Tuesday, September 8, 2020

ఇంద్రనీలపుగాది

ఉగాది పండుగ మణిపూసలు

శీర్షిక: ఇంద్రనీలపుగాది

తెలుగువారి పండుగ
తొలివెలుగుల పండుగ
చైత్రమాస నవవసంత
వెలుగులీను పండుగ - 18

మావిచిగురుల మేత
గండుకోయిల కూత
పరవశించిన ప్రకృతి
విరబూసె వేపపూత - 19

గండుకోయిల వాలింది
మావిచిగురు మాడింది
ఆకుపచ్చని ఉగాది
కారునలుపు పులిమింది - 20

 వికారికి జనవీడ్కోలు
చేదుకలలకు వీడ్కోలు
భావిపైని ఆశలతో
శార్వరికి జనతోడ్కోలు - 21

వికారి విరిసెను ధనుస్సులు
ధరకుజేరెను తమస్సులు
ఉర్విని చీకటినూడ్చ
ఉగాదితెచ్చె ఉషస్సులు -22

మావిచిగురులు తొడిగింది
కోయిల కమ్మగ పాడింది
అయినావనికి వెలుగురాక
కరోనచీకటి పులిమింది - 23

రాజశేఖర్ పచ్చిమట్ల
గోపులాపూర్
జగిత్యాల
9676666353

కాళోజీ - మణిపూసలు

 కాళోజీ కవితలూ

వ్యథాభరిత జీవితాలు

నిశీధివ్యాప్త నేలపైన

ఉదయించిన కిరణాలు- 28


మొద్దునిదుర వదిలించే

తిరోగమన పవనాలూ

ఉద్యమమే ఊపిరిగా

సాగించిన కవనాలూ! -29


యాసలోనె భాషలోనె

బతుకుందని చూపించెను

తెలుగుజనుల గోసనంత

తనగోసగ వినిపించెను!-30


వాడియైన మాటలతో

కవితా ఈటెలువిసిరెను

తెలంగాణ ప్రజలమదిల

ఉద్యమభీజమునాటెను! -31


నైజాముల గుండెల్లో



రైతు - కైతికాలు

 బండబారిన నేలలను

చెమటచుక్కల తడుపువాడు

బక్కటెద్దుల అరకతో

దుక్కిదున్నె సేద్యకాడు

వారెవ్వా! శ్రమజీవి

యెల్లలోకపు పుణ్యజీవి! - 45


అహర్నిశలు శ్రమిస్తూనె

మెతుకులెన్నొ మొలిపిస్తవు

కడుపునిండ కుడువకనే

పలారమని పంచిస్తవు

వారెవ్వా! హలధారి

తిండిగింజల సూత్రధారి-46


పగలురాత్రి పంటకాపు

నాగటెడ్లె నీకుతోడు

అలుపెరగని సేద్యకాడ

అన్నపూర్ణె నీకుజోడు

పుణ్యజీవి రైతన్నా

ధన్యజీవి రైతన్నా! -47



నారువోసి నీరువోసి

అనుదినమ్ము కాపుగాసె

పంటగోసి ఫలమునూర్చి

అన్నమురాశులుగవోసె

వారెవ్వా! కృషీవలా

నీత్యాగనిరతి భళాభళా! - 48


ఉడుతనెమలి ఒకరికొకరు

ఆప్యాయత కనబరిచెను

జాతివైర ములనుమాని

స్నేహకొలను విహరించెను

వారెవ్వా! చెలిమిజూడు

క్రొంజివురులు తొడిగెనేడు! - 49

Sunday, September 6, 2020

గురువులు(పద్యాలు)


1.

అవనిగ్ర మ్మెడునట్టి అంధకారము బాప

         అవతరిం చిరిగుర్వు లవని యందు

శుద్ధ ఫలకముతో శోభిల్లు శిశువుల

         కోనమాలను నేర్పు నోర్మితోడ

సద్భాష్య ములతోడ సందేహముల్ మాన్పి

         జ్ఞానసుధలొసంగు ఘనులు గురులు

విద్యతోడను మంచి విలువల నందించి

        వినయశీలిగ మార్చు విజ్ఞ విభులు


  తాను విత్తు తరులు తన్ను మించి బెరిగి

   పక్వ ఫలములీయ పరవశించు

మంచి మనసు మిగుల మహిమాన్వితగురువు

   లందరి కొనరింతు  వందనములు


2.

పాంచభౌ తికమయ్యి పరిణమిం చెడుతన్వు

       పరిమళ మ్ములబుల్ము బ్రహ్మ గురువు

కోపమిం చుకలేక కూనలం దరకును

       ఓనమా లనునేర్పు ఓర్మి గురువు

దిక్కుతో చనియట్టి ధీనయా నములోన

(బాల్యమం దేదీర్చి భావిబ తుకుగూర్చి)

       దారిజూ పెడుమార్గ దర్శి గురువు

అంతరం గములోని యనుమాన ములుబాపి

       జ్ఞానదీప్తులబంచు ఘనుడు గురువు


అవని బులిమి (నంటి)యున్న అంధకా రముబాప

(భాస్క రుడుయి కర బాస మొసగి)

భాస్క రసము డయ్యి భాస మొసగి

అహమె రుగక యించు కలరారు గురువర్యు

పాదపద్మములకు 

లంద రకును జేతు వందనములు


3.

మట్టి బొమ్మ వంటి మనిషి మస్తిస్కాన

అక్షరాల నాటు హాలి కుండు

అవని జనుల నిండు అంధకారముదీర్చ(అజ్ఞాన మునుబాప)

దివ్వెల వెలిగించు దివిటి గురువు


4.

తనపర మ్మెంచక తనలోని సత్వమ్ము

 ఛాత్రకో టికిబంచు చాగ జీవి

తారత మ్యములేక తనదైన విద్యను

  దాచుకొ నకనిచ్చు ధన్యజీవి

సాహిత్యాం బుధిలోన సాంతమ్ము తామున్గి

  మంచిము త్యములను బంచి యొసగు

లోకపో కడలోని లోగుట్టు తానెర్గి

  మసలురీ తిమనల కొసగు తాను


తల్లి దండ్రు లొసగు తనువున ణువణువు

విద్య గంధ మద్ది విమల పరిచి

మంచి విలువ లొసగి మనిషిగా మలచేటి

గురువు మించి నట్టి సురలు గలరె?


5.

తల్లిక న్నమిగుల తపనజెం దుతుతాను

మనలమ నుషులుగ మలుచు కొరకు

తండ్రక న్నమిగుల తహతహ బడుగాక

బాధ్యత నుతెలిప పాటు పడును

బందుజ నముకన్న పరితపిం చుమిగుల

అభ్యుయ మ్ముకొరకు ఆర్తి జెందు

దేవుళ్ల మించిన దైవమే తానయ్యి

అతిశయ మ్మొసగేటి వరములొసగు


సకల మొసగు మనకు స్వార్థమిం చుకలేక

తనదు సర్వ విద్య దార వోయు

అపర భాగ్య మిచ్చు దాతమా త్రమెగాదు

బ్రతుకు దీర్చి నట్టి బ్రహ్మ తాను


6.

మట్టి బొమ్మ వంటి మనిషి మస్తిస్కాన

అక్షరాల నాటు హాలి కుండు

అవని జనుల నిండు అంధకారముదీర్చ

దివ్వెల వెలిగించు దివిటి గురువు

Saturday, September 5, 2020

పేదలపెన్నిది (కాళోజీ)


సాఫీగా సాగుతున్న

సాహితీ నావను కుదుపుకుదిపి

ప్రజాపక్షాన నిలిపి

ఉద్యమానికి ఊపిరిలూదిన చైతన్యమతడు

వరుగులైన గడ్డిపరకల్లాంటి

బడుగుబలహీన వర్గాల

యెదలోతుల పాతిన భయాన్నికడిగి

తన మాటలతో ధైర్యపుటానికునందించి

కత్తులే కాదు కలాలూ

యుద్దం చేయగలవని  ఛాటిన ధీరుడతడు!

ఆకలితీర్చని అన్నపు రాశులనూ

అవనిమీది అవకతవకలనూ

చూసి చెమ్మగిల్లిన నయనద్వయమతడు!

నిరంకుశ నిజాం హింసాయాగంలపడిన 

సర్పాలై సర్వనాశమౌతున్న

ప్రజలకన్నీళ్లు తుడిచే ఆపన్నహస్తమతడూ!

స్వార్థమించుకలేని సన్యాసి

పదవులకూ పైసలకూ లొంగని విరాగి

సాటిమనుషుల పాపాలుకడిగే జీవనది

బీటిలువారిన పేదలబతుకుల 

నతికించజూచిన గుండెతడి

ఉద్యమమే ఊపిరిగా బతికిన పోరుబడి

అమ్మభాషకూతమిచ్చిన పలుకుబడి

ప్రజలవ్యథనంతా ప్రకటించే కంఠధ్వని అతడూ!

వెైరుధ్యాలు, వైవిధ్యాలు లేని

తెలంగాణ స్వాప్నికుడతడూ!

దౌర్జన్యాలనూ, దోపిడీలను

నిరసించి నినదించిన ఆక్రోశమతడూ!

అవినీతియామినీతెరల 

తుంచదూచిన వైభాతికభానుడతడూ!

తెలంగాణీయుల గొడవను తనగొడవగా

తెలంగాణ ప్రజలనే తనబలగ సమూలంగా

సాటిమనుషుల సవాళ్లను

తననెత్తిన మోసిన ప్రజలమనిషి అతడూ!

అతనుపేర్చిన సిరాచుక్కలు

ప్రజామేథస్సును మథించే యోచనాగుళికలు!

అతని అలోచనల జాలువారిన కవితాపంక్తులు

కలపుఫిరంగి పాళినుంచి వెలువడిన సిరాగుళ్లు!



దృశ్యకవిత 1


ఏకాగితం చూసిన గాందితాత నవ్వుతున్న చిత్రమే

గాని అందుకునే ప్రయత్నంజేసే మనిషి ముఖంలో నవ్వులేదు


ఏకాగితానికైనా ఉన్నోడే గావాలె

లేనోడి ఛాయనైనా భరించలేదు

కరెన్సీ కాగితం ధనవంతుల చేతుల్లో విలాసంగా కాలుతుంది గాని

మురిపెంగ దాచుకొనే పేదోని ప్రేమను పొందలేదు


శ్రీమంతుల ఇనప్పెట్టెల ముక్కవట్టాలనే ఆశ తప్ప

పేదవాని అంగిజేబులుండే చెమట వాసనక్కర్లేదు


ఐశ్వర్యవంతుల అహార్యంపై మోజుపెంచుకున్న పైసా

పేదవాని మంగులంపెంక మొకం

మసిగుడ్డలను సహించలేకున్నది


పచ్చిమట్ల రాజశేఖర్ 

9676666353

Wednesday, September 2, 2020

శీర్షిక: అమూల్య వార్ధక్యం

పేరు: పచ్చిమట్ల రాజశేఖర్
ఊరు: గోపులాపూర్
జిల్లా: జగిత్యాల
9676666353

శీర్షిక: అమూల్య వార్ధక్యం

కాలంతో కాలుకదిపి
సామాజిక స్పృహనెరిగి
శైశవబాల్యాది క్రీడల
జీవన్నాటకాన్ని రక్తికట్టించి  సమర్ధత
యవ్వనవార్ధక్యాది జ్ఞాపకాలు 
పోగుజేసుకున్న అపురూపదశ వార్ధక్యం!
తేనెలో ముంచిదాచిన మగ్గినమామిళ్లు ముసలోల్లు!

గతం తాలూకు ఆటుపోటులు
వర్తమానపు ఎదురీతలు
అనుభవపాఠాల నధ్యయనం చేసి
గతుకుల బాటలో కుంపుకుదింపు నెరుగక
సునాయాసంగ కాలమెల్లదీయు
ఉపాయాలెన్నో గ్రంథస్తంచేసిన 
నడిచేపుస్తకం వార్ధక్యం!
అసలుకన్న వడ్డీముద్దన్న నానుడికి నిర్వచనమై
నీతికథలు ఇంపైనపద్యాలు 
పొడుపుకథలు పొందికైనసూక్తులు
మానవజీవితాంబుధి లోతుల్లో వెదికితెచ్చిన
మేలిమిముత్యాల వెలుగులద్ది
భావిపౌరులకు సౌరులద్దే 
మంచిగంధపు కల్పతరులు వయోధికులు!
పాతతరం మనుషులేగాని
పాతవస్తువులుకాదు
పాతసంస్కృతి వారసులు
కొత్తసంస్కృతి వారధులు 
ఆపాతమధురానుభూత 
ఫలభారయుత తరువులు వయోధికులు!
కష్టాలకెదురీది నిగర్వంగా నిలచి
గతంభూమికగా భావినిపసిగట్టే యోచనతో
కార్యదక్షతా కుశలురై
అనుభవాల భారంతో వంగిన
ఇంద్రధనుసులు వయోధికులు!

సుకుమార కుసుమకోమల
పల్లవారుణ పసిడివన్నెల పసిబిడ్డను
ప్రపంచానికి పరిచయంజేసి
అంచెలంచెల నీయెదుగుదలకు ఆలంభనై
అందని నీశిఖరోన్నతికి గర్విస్తూ
ఆకాశమందే నీగమనానికి అడ్డుతగలక 
విరబూసిన రంగుపూల చెట్టుకు
మూలం తామని ఈసృష్టికి తెల్వనీయక
నిత్యనూతనమై చిగురించే జవసత్వాలనందించ
మట్టిలో కూరుకుపోయిన వేళ్లు వయోధికులు!

తుమ్మెదలు అనురాగోపేతమగు ఆలింగనమున
పూవుకందకుండా పుప్పొడి గొనిపోయినట్టు
తోటమాలి చిలికిన పన్నీటపురుడువోసిన తరుల
శాఖను నొప్పించకుండా పూలుగోసినట్టు
కొమ్మవిరుగకుండ పళ్లుతెంపినట్టు
అనుభవాలనందిపుచ్చుకోవాలే 
నీళ్లువోసి నీడనుపొందాలే గాని
మనకురెక్కలు మొలిపించడంలో 
రెక్కలుడిగిన పక్షులను 
కుక్కిమంచంల కూలదోసి
గూటికి కుక్క కావలుంచి
స్వేచ్ఛాపతంగమై దూదిపింజల 
తెలిమేఘాలు దాటి తేలిపోయి
నింగిన విహరించినంత చుక్కలే చుట్టాలనుకోకు
నీఉనికికి ఆధారమైన 
వృద్ధుల అనుభవాలు నేసిన దారం తెగిననాడు
అథఃపాతాళానికి పడిపోగలవని యెరుగు!

చిత్ర కైతికాలు

 హరిహృదయం ఉప్పొంగుచు

వేణుగాన మెలువరించె

ఆగానము వీనుసోకి

రాధికమది మురిసిపోయె

పిలనగ్రోవి పిలవాడ

లోకమ్ములనేలువాడ! - 39


ఆలమందలన్నింటిని

వంశముతో వశముగొనెను

పదునారువేలపడచుల

గానముతో గట్టివేసె

వారెవ్వా! సూత్రధారి

జగత్తంత నీదెదారి! - 40


వేణుగానమాలపించు

మురళీధరు దరకుజేరె

నెమలీకను చేతబూని

కవ్వంచను రాధజూచె

అనురాగరంజితము

రాధకృష్ణుల సరసము - 41

Tuesday, September 1, 2020

గజల్

 అక్షరాలు పేర్చనిదే పదములెలా ప్రభవించును

భావాలను కూర్చనిదే కవితలెలా ప్రభవించును


పదేపదే మదిలోతున సంఘర్షణ జరగనిదే

సమస్యలను యెదుర్కునే యుక్తులెలా ప్రభవించును


అనునిత్యం లోలోపల ఆలాపన చేయనిదే

సమ్మోహన మొనరించెడు గాత్రమెలా ప్రభవించును


ఒంటినిండ దెబ్బలెన్నొ ఓర్పుతోడ సైచనిదే

చూపరులను ముగ్ధుజేయు శిల్పమెలా ప్రభవించును


ఒకరినొకరు తలచుకుంటు మనసుగతిని యెరుగనిదే

కలకాలం నిలిచియుండె ప్రేమయెలా ప్రభవించును

చిత్ర కైతికాలు

 [01/09, 10:42 am] Rajashekar: కొబ్బరియాకుల అల్లిక

యెముకలగూడుగ అమరెను

ప్రకృతిన వింతలు పులిమెను

ముదుసలి రూపము వెలిసెను

కొబ్బరిచెట్టుకు మొలిచెను

వంగిన మానవ దేహము - 1 (42)

చింపిరి చింపిరి ఈకలు

కొబ్బరి శిరసున ఆకులు

నేర్పున మనుషులు తీర్చెను

కొబ్బరిమట్టలొ యెముకలు

జయహో! మానవలోకం

నైపుణ్యానికి సలాం! - 2(43)


 కొబ్బరాకుల అల్లికలొ

విరిసినట్టి కళాకృతి

ముదుసలిరూపులో ఒదిగి

మైమరిపించె మనస్థితి

వారెవ్వా! కళాతపస్వి

నీకళతో చిరయశస్వి ! - 3(44)

Monday, August 31, 2020

బాపురమణ (మణిపూసలు)

 అందమైన బాపుబొమ్మ

ముగ్ధమైన ముద్దుగుమ్మ

లోకమెల్ల మదిదోచిన

కొలువుదీరె పూలకొమ్మ - 24


చిన్నచిన్న గీతలలో

పెనుభావము లొలికించెను

మహానుభావులెందరినొ

మనముందర నిలిపించెను - 25


హాస్యమొలుకు రేఖలతో

వ్యంగ్యమైన రూపులెన్నొ

అలతిఅలతి గీతలలో

మంటరేపు చురకలెన్నొ - 26


ఒకటిరెండు చిత్రాలతో

కథలుకథలు వర్ణించెను

పెద్దపెద్ద మనుషులనూ

తనకుంచెతొ నిర్మించెను - 27


Saturday, August 29, 2020

కైతికాలు

1.
కలంముక్కు జాల్వారె
అక్షరాల అల్లికలు
పదాలయెదలోతుల్లో
నిగూఢార్థ పేటికలు
వరెవ్వా కైతికాలు
కవివరులకు ఐచ్చికాలు!

2.
పూలనిచ్చు మొక్కలు
పళ్లనిచ్చు తరువులు
ఛాయనిచ్చు తరువులు
తనువునిచ్చు తరువులు
వారెవ్వా తరువులు
త్యాగానికి గురువులు

3.
పుడమిపైన పుట్టినట్టి
పచ్చనైన పలుమొక్కలు
భూతాపము చల్లార్చుతు
పులకించును పలుమొక్కలు
వారెవ్వా మొక్కలు
భూమాతకు చొక్కలు

4.
గమ్యానికి భయపడి
గమనమెప్పు డాపకు
దూరానికి భయపడి
తెడ్డేయడ మాపకు
భళిరా నీధైర్యానికి
విజయం బానిసకాదా


గాడుదుల మోతలు
గంగిరెద్దు లాటలు
చిలుకల పలుకులు
సిరిగల్ల సదువులు
వారెవ్వా విద్యార్థులు
భావిభారత పౌరులు! - 5

 గాడుదుల మోతలు
గంగిరెద్దు లాటలు
చిలుకల పలుకులకు
స్వేచ్ఛ లేని సదువులు
వారెవ్వా విద్యార్థులు
వెతల మోస్తుబతుకులు - 6

 మెతుకు రూపకర్తలు
జగతి జీవదాతలు
అహర్నిశలు శ్రమించినా
అప్పులపాలాయె బతుకు
వారెవ్వా రైతులు
గంజిమెతుకుల వ్యథలు - 7

తెలుపురంగు దుస్తులు
నలుపురంగు మనసులు
ప్రజాసేవకులని మరిచి
పలుకుబడిని జూపుడు
వారెవ్వా నాయకులు
మేకవన్నె పెద్దపులులు - 8

 ధనవంతుల జేరలేరు
దరిద్రుల దరికి రారు
ఆశ చిక్క వలెనంచు
అనాదిగ ఆశువోసుడు
వారెవ్వా సామాన్యులు
ఎండమావి బతుకులు - 9

ధనవంతుల జేరలేరు
దరిద్రుల దరికి రారు
ఆశ చిక్క వలెనంచు
అనాదిగ ఆశువోసుడు
మధ్యతరగతి మనుషులు
ఎండమావి బతుకులు - 10

 గౌడకుల తిలకుండు
శైవభక్తి తత్పరుండు
ప్రజారక్షణె ధ్యేయంగ
ప్రభవించిన వీరుడు
సర్దారు (సర్వాయి) పాపన్న
గౌడకులంల నువు తోపన్న .11


అఖిలావని రక్షకుడై
అజ్ఙాతమె నివాసమై
పాలక దుశ్చర్యలు గని
విరుచుకుపడె పిరంగియై
వారెవ్వా పాపన్న
ప్రజాసేవకుడు నీవన్న .12


తురుష్కుల నెదురించి
ముసల్మాన్ల మట్టుబెట్టి
దొరల ఆగడాలు బాపి
గోల్కొండలొ ధ్వజమెత్తి
నాయకుడై నడిపించిన
పోరుబిడ్డ పాపన్న .13

బంధుజనుల పాలనకై
పరసేనల కెదురునిలిచె
మృత్యువునే జడిపించగ
అపరకాళియై నిలిచె
మడమతిప్పని యోధుడవన్న
మరువనెమరువం నిను పాపన్న . 14

సకలజనుల దండుగట్టి
నవాబుల మెడలువంచె
కురుబక్షకు చిక్కకుండ
తనకుతాను మరణించె
వారెవ్వా పాపన్న
స్వాభిమాని నీవన్న .15

 మడమ తిప్పని యోధుడు     
  (కైతికాలు)  
గౌడకుల తిలకుండు
శైవభక్తి తత్పరుండు
ప్రజారక్షణె ధ్యేయంగ
ప్రభవించిన వీరుడు
సర్దారు (సర్వాయి) పాపన్న
గౌడకులంల నువు తోపన్న .- 16


అఖిలావని రక్షకుడై
అజ్ఙాతమె నివాసమై
పాలక దుశ్చర్యలు గని
విరుచుకుపడె పిరంగియై
వారెవ్వా పాపన్న
ప్రజాసేవకుడు నీవన్న .-17



బంధుజనుల పాలనకై
పరసేనల కెదురునిలిచె
మృత్యువునే జడిపించగ
అపరకాళియై నిలిచె
మడమతిప్పని యోధుడవన్న
మరువనెమరువం నిను పాపన్న . - 18
       రాజశేఖర్ పచ్చిమట్ల
      గోపుల పూర్
     జగిత్యాల జిల్లా
    9676666353

Friday, August 28, 2020

తెలుగు భాష - కైతికాలు

 పుణ్యనదుల పులకింత

పాలనురుగు నాతెలుగు

సెలయేరుల పరవళ్ల

హోరుపరుగు నాతెలుగు

మాటాడినచాలు

మాధుర్యము జాలువారు - 19

తెలుగుభాష పలికిచూడు

జుంటితేనె జాలువారు

మాతృభాష మాటలాడు

మకరందపు యేరువారు

మరువకుండ మాటాడు

మధువులొలుకు మాతృభాష - 20

అందమైన అక్షరాలు

యాభయారు తెలుగు భాష

ప్రతిపలుకూ ప్రత్యేకత

మమతలొలుకు తెలుగుభాష

పరిపూర్ణపు నాతెలుగు

సౌరులొలుకు విరులసొరగు - 21

కురిసిన మేఘపు మేనున

విరిసిన హరివిల్లు వింత

పరిచిన చీకటి నింగిన

మెరిసి మురిసె పాలపుంత

ప్రదీప్తుల పరవళ్లొలుకు

వెలుగుజిలుగు నాతెలుగు - 22

నింగినుండి తొంగిచూచు

వెన్నెలదొర వెలుగుముక్క

మబ్బునుండి జాలువారు

స్వచ్ఛమైన నీటిచుక్క

పాత్రబట్టి రూపముండు

వ్యక్తిబట్టి వ్యవహారము - 23





Thursday, August 27, 2020

స్వర్గానికి నిచ్చెన


నీఊహల్లో మొలకెత్తిన బంగరుభవితనకు

మెట్టుమెట్టుగ యోచన గూర్చి

ఆశయసాధనకు అడుగులు పేర్చు

అంచలంచలుగ అందలమెక్కి

భావితరాలకు బాటలు వేయి

స్వర్గానికి నిచ్చెనవేసి

బాటసారులకు బాసటనిలువు!


దరిచేరిన లక్ష్యం


మనోపలకంపై గీసుకున్న అందమైన భవితకొరకు

ఒక్కోమెట్టు ఒడుపుగ పైకెక్కు

ఏమరుపాటుతో వేసే అడుగు

పడేయగలదు నిన్ను పాతాళానికి

లక్ష్యంపై గురివుంచి లాక్షణికంగ ప్రయత్నించు

బంగరుమయమైన ఊహలజీవితంలో విహరించు విహంగమై!


 

Wednesday, August 26, 2020

అమ్మ ( పద్యాలు)

 అమ్మజన్మనిచ్చు ఆహార్యమునుబెంచు

గోరుముద్దలిడుతు గోముజేయు

సాకుతుండుమనల సాపర్యములుజేసి

అమ్మకన్నమనకు ఆప్తులెవరు - 1

సాకుతుండు మనల సన్నుతిన్ బాడుచూ

అమ్మయన్నచాలు అనురాగమునుబంచు

ఆకలైనవేళ అన్నమెట్టు

అలసియున్నవేళ మలయమారుతమౌను

తల్లిమించినట్టి దైవమేది - 2

అమ్మయనిన చాలు నాపదలు దూరమౌ

అమ్మయనిన మనసు హాయిగొల్పు

అమ్మయనిన కల్ప తరువుసమము

అమ్మయనిన కలుగు సకల శుభము - 3

Tuesday, August 25, 2020

చిత్ర మధురవాణి

 సాంకేతికత అల్లుకున్న సాలెగూడు లోకంలో

వానకాలపు సదువులే భవితను శాసించేవేళా

అట్టడుగువర్గం అందనిద్రాక్షల చదువుకోసం

ఏకలవ్యులై అక్షరాలు వెతుకుతున్నారిలా - 1


పసిరైతు

పాలబుగ్గల మిసిమి పసివాని బుద్దికి

తలొగ్గినడిచాయి బసవన్నలు రెండు

వసివాడని రెక్కల చెమటలొ తడిసి

పుఢమిమొలిచాయి పజ్జొన్నలు మెండు - 2


పసివాడు పనోడు ఐనందుకు సంతోషించనా?

సదువుమాని సాగు చేస్తున్నందుకు బాధపడనా?

వెన్నంటిన కడుపులెన్ని ఆకలితో అలమటించినా

అన్నపూర్ణ నాదేశమని చాటుతు ఆనందపడనా - 3


Sunday, August 23, 2020

కైతికాలు - సంకపాప

 మెరిసే కురులను తీర్చి

మొక్కజొన్న కులికిందీ

విరిసే జడలుగ పేర్చి

అందం హొయ లొలికిందీ

వారెవ్వా! యీసిత్రం

మక్కగింజ మాయాచిత్రం - 24


ఏడాకులతో యెదిగిన

మొక్కజొన్న మొగ్గదొడిగె

పాలకంకుల పాపలను

సంకనెత్తి సిగ్గులొలికె

వారెవ్వా! సంకపాప

అందమైన కురులజాణ - 25


 మెరిసే కురులను తీర్చి

మొక్కజొన్న కులికిందీ

విరిసే జడలుగ పేర్చి

అందం హొయ లొలికిందీ

వారెవ్వా! యీసిత్రం

మక్కగింజ మాయాచిత్రం - 26


ఏడాకులతో యెదిగిన

మొక్కజొన్న మొగ్గదొడిగె

పాలకంకుల పాపలను

సంకనెత్తి సిగ్గులొలికె

వారెవ్వా! సంకపాప

అందమైన కురులజాణ - 27

 ప్రకృతిలోని ఆసృజన

మొక్కజొన్న మొలిపించె

మనిషిలోని ఈసృజన

కురులసిరులు తలపించె

జయహో! మానవా

నీమేథకు నమస్సులిగో 28

: మొక్కజొన్న చేనులోన

ఒక్కకన్య అగుపించెను

దరిచేరగ జాణలోని

అసలురంగు కనిపించెను

వారెవ్వా! మక్కచేను

అప్సరసలు వెలిచేను - 29

Wednesday, August 19, 2020

కరోనా (ఆ.వె )

 ప్రగతి పథముపేర ఆచారములుమాని

మెలుగు చుండు జనుల మెడలు వంచి

కరొన రోగమొచ్చి కనువిప్పు కలిగించి

పూర్వ పద్దతులకు పూతవెట్టె

Tuesday, August 18, 2020

మణిపూసలు

 

నింగి నేల (మణిపూసలు )



చిటపట చినుకులు కురిసెను
సెలుకల మొలకలు మెలిసెను
సంభ్రమాశ్చర్యము రైతు
మనమున సింగిడి విరిసెను -1

మిన్ను  మెరిసి కురిసెను
మన్ను మురిసి తడిసెను
పుడమిన పయదారతొ
పచ్చదనము విరిసెను - 2

సినుకుసినుకు కలిసెను
అలుగు దుంకి పారెను
ఉరుకులతొ పరుగులతొ
సెర్లు కుంట నిండెను - 3

యేరులన్ని పారెను
వాగులన్ని బొరలెను
జలసిరులతొ సిత్రముగ
చెరువులన్ని నిండెను - 4

వరణుడు కరుణించెను
పుడమి కడుపు వండెను
ఉబికె క్షీర దారతొ
సేనుసెలక పండెను - 5

         పచ్చిమట్ల రాజశేఖర్

నాన్నస్మృతి



నాన్నా నీజ్ఞాపకాలు కళ్లు తడుపుతున్నాయి
నాన్నా నీగతస్మృతులు ఒళ్లు తడుముతున్నాయి

కోడికూతకన్నముందు నిద్రలేచి  సవరించె
పసులపాక లోనిపసులు జాడనడుగుతున్నయి

నిరంతరం తాటివనమె నీయిల్లై నిలిచినావు
బొరియలల్ల చిలుకలన్ని నీరాకను జూస్తున్నయి

ఆరేణుకగుడిలోపల అణువణువూ శుచిచేస్తివి
నీవులేక గుడితలుపులు తెరుచుకోనంటున్నయి

 ప్రతివారిని పలుకరించి పాయిరంగ మాటలాడు
ఆప్యాయత కొరకుమంచి మనసులెదుకుతున్నయి

నీవులేని యింటనేడు వెలుతురులే కున్నదీ
అమ్మనుదురు బోసివోయి చీకట్లు ముసురుతున్నయి

నీవులేని ప్రతీరోజు కళదొలగినరాజస్సే
చందమామ మనలోగిలి పదముమోపనంటున్నయి

కోపం (కందం)

కోపము మనుజుల కనిశము
తాపము గలిగించు టెదాని తత్త్వం బగుదా
నోపువ హించియుం డునెడల
దీపము వలెత్రో వజూపి తీర్చును బాధల్

Monday, August 17, 2020

బహుముఖ వజ్రం - పాములపర్తి

ఆరడుగుల దేహధార్ఢ్యము

ఆచ్ఛాదనపు పంచెకట్టు

సాధారణ లాల్చీలో ఇమిడిన

అసాధారణ రూపం!

ధీరత్వం సాకారమైన

ఆజానుబాహుడి అసలు నిర్వచనం!

బహుభాషా నేర్పుతో

వాణీవిలసిత ముఖవర్చస్సు

గర్వమించుక గానరాని

లక్ష్మీవిలసిత లలాట పలకము

స్నిగ్ధగంభీర ప్రసన్నమూర్తి మన పాములపర్తి!


కన్నవారిని చేకొన్నవారిని 

యశచ్ఛంద్రికల నలంకరించి

వంశప్రతిష్టను వెండికొండ

నడినెత్తిన నిలిపిన వంశోద్ధారకుడు!


కుంటుతున్న ఆర్థికవ్యవస్థకు

కట్టుగట్టి పట్టాలెక్కించి

పరుగులద్దిన అపర ఛాణక్యుడు

చుట్టలిరిగిన బండికి సారధియై

పడిపోకుండ ప్రభుతను నడిపిన

లౌక్యమెరిగిన లౌకికవాది

ఆపద్ధర్మంగా ప్రధానమంత్రిత్వం చేకొన్నా

ఆదర్శవంతంగా నలరించిన ధీశాలి!

దేశభవిష్యత్తును తీర్చుటలో

క్రియాశీల రాజకీయ కౌశలంజూపిన దార్శనికుడు!


సామాన్యపౌరునిగా శాసనసభ్యునిగా 

మంత్రి కేంద్రమంత్రి ప్రధానమంత్రిగా

పదవేదైనా ప్రతిభతో మెరుగులద్దిన మహామనీషి!


మాతృభాషాభిమానిగ మసలుతూనే

పలుభాషాపాండిత్య మార్జించిన బహుభాషావేత్త!

నిండుయవ్వనంలో నిజాం ఆజ్ఞలను దిక్కరించి

హైదరాబాద్ విముక్తిగోరి

వందేమాతరగేయమాలపించిన మాతృదేశాభిమాని!


బూర్గుల బుద్ధికుశలతానీడలో

 పండిన మేథస్సుతో

న్యాయవాదపటిమతో

భూస్వామ్య వర్గాల నెదురించి

భూసంస్కరణలు చేసిన సమసమాజస్థాపకుడు!


అవిరళంగా రాజకీయబాధ్యతలు మోస్తూనే

సాహిత్య పఠనాభిలాష

రచనావ్యాసంగాల పట్ల ఆసక్తివీడని సవ్యసాచి!


అబలాజీవితం లోపలిమనిషిని

సహస్రఫణముల సాక్షాత్కరించిన సాహితీవేత్త!

ఆర్థికసంస్కరణలతో అబ్బురపరిచిన ఆర్థికవేత్త!

పలురంగాల్లో ప్రతిభజూపిన

బహుముఖ ప్రజ్ఞాశాలి!

పలుకోణాల్లో ప్రకాశించిన

దక్షిణాది కోహినూరు పాములపర్తి నరసింహం!

సేకరించినది

 చక్కనైనరూపు సౌశీల్యగరిమను

మాటకారితనము మంచినేర్పు

ఎన్నియున్ననేమి యీరామ చిలుకకు

గండుపిల్లిముందు దండుగయ్యె

జగన్నాథ పండితుడు

గజల్

 నామనసే పూదోటై పరిమళించె నీరాకతొ

నాబతుకే సెలయేరై పరవళించె నీరాకతొ


కల్పనవో కలరూపమొ కావ్యమందు కన్యకవో

కలలన్నీ మధురమయ్యి పరవశించె నీరాకతొ


సురకన్యవొ వరవీణవొ దరహాసపు దొరసానివొ

నామదితెర చందురుడై ఊరడించె  నీరాకతొ


కొమ్మతనువు  లేగొమ్మవొ బాపుచేతి చిత్రాంగివో

యెదముంగిలి బొమ్మకొలువు తారసించె నీరాకతొ


వాకమువో వాగునువో నింగిజారు సెలయేరువొ

ఆనందము సాకరమయి పల్లవించె నీరాకతొ

Sunday, August 16, 2020

బతుకుపయనం

 పుట్టినూరిడిచి పొట్టచేతవట్టుకొని

పాతగుడ్డల ముల్లె పైలంగనెత్తినెత్తుకొని

ఖాళీచేతుల బుగులుబాప

చేయిసంచి తలిగేసుకొని

కనిపించిన దారివెంట 

కనిపించని తీరాలకు సాగే

గమ్యమెరుగని బాటసారులు!

అంతస్తులెరుగక నకనకలాడే ఆకలికి

కడుపులో పేగులు

ఎడతెరిపిలేకుండా

చేస్తున్న సంగీతవిభావరి నాప

పిడికెడు మెతుకులకై

వెతుకులాడే ఊరపిచుక బతుకులు!


బతుకుబాటలొ దాకిన దెబ్బలకు

నొక్కులువోయిన గంజులు

కాకిబలగపు ఆకలిదీర్చలేని

అడుగంటిన గంజినీళ్లు

అలిసినతనువు నడుమాల్సుకుంటే

కునుకురాని కుక్కిమంచం

అయినా రాత్రంతా దోమలతో

మూసినకనులతో ముష్టియుద్ధంజేసి

కొనఊపిరితో సత్తువంత కూడగట్టుకొని

ఉదయాన్నే కైకిలి వెదుకుతూ

చౌరస్తాల్ల ఎదురుచూసే కూలీతనం!

ఆకలిదీర్చే దారిలేక

చేద్దామంటే పనుల్లేక

రోడ్లపక్క తలదాచుకోలేక

పసికందుల వసివాడ్చలేక

సంపాదించిందేమిలేక

బాధ్యతల బరువులు మోస్తూ

కష్టాలవడగండ్లకు నెత్తిబొప్పిగట్టినా

గమ్యంజేర్చే దారిగానరాకున్నా

పుట్టినూరు కన్నతల్లి గుర్తొచ్చి

పల్లెపొలిమేరకు పయనం సాగించే పాదచారులు!

మొలిచినరెక్కలతో దిక్కులకెగిరిపోయినా

ఆనందతీరాల నందలేక

ఉడిగిన రెక్కలతో వెనుదిరిగిననాడు

ఛీకొట్టి చీధరించక

అందరినీ ఆదరించే పెద్దదిక్కు పల్లెటూరు!

సంపదలు పట్నపుదారులు జూపుతే

సంబంధాలు పల్లెదారులు తెరిచి

మానవత మంగళారతులు పడుతుంది!

ఆప్యాయతతో ఆదరిస్తుంది!

మనిషిని మనిషిగ గౌరవిస్తుంది!


Wednesday, August 12, 2020

మనసున్న మానులు


చెట్టును కట్టెలా చూడకు నేస్తం!

చెట్టునూ మానని 

మనసులేనిదని యెంచకు నేస్తం!

చెట్టు ఫలమిచ్చి  కల్పవృక్షమై కనవడుతది

చెట్టు పూలనిచ్చి తత్వబోధిని తలపిస్తది

ఆకులపళ్లెమై అలరారినపుడు

అన్నపూర్ణైతది

నీడనిచ్చి సేదదీర్చినపుడు

 కన్నతల్లైతది

చేతికర్రై ఊతమిచ్చిననాడు

నాన్నై నడిపిస్తది

పశుపక్షుల కాశ్రయమిచ్చినవేళ

తల్లిఒడిని తలపిస్తది!

ప్రాణవాయువునిచ్చి

ప్రాణికోటిని పరిరక్షించువేళ 

అమృతమై అలరారుతది!

చెట్టుతనం కట్టెతనమై

అచేతనమగు కట్టెను కాలుస్తున్నపుడు

మోక్షమిచ్చే మార్గమైతది!

అయినా 

నువుగొడ్డలితో నరుకుతుంటే

ఆనందంగ నేలకొరుగుతది!

త్యాగానికి నిలువెత్తు నిదర్శనమై

మంచితనానికి 

మనసున్న తనానికి

తరువే గురువై తారసపడుతది!

Sunday, August 2, 2020

నాన్నస్మృతి( గజల్ )


నాన్నా నీజ్ఞాపకాలు కళ్లు తడుపుతున్నాయి
నాన్నా నీగతస్మృతులు మదిని తోడుతున్నాయి

కోడికూతకన్నముందు నిద్రలేచి  సవరించె
పసులపాక లోనిపసులు జాడనడుగుతున్నయి

నిరంతరం తాటివనమె నీయిల్లై నిలిచినావు
బొరియలల్ల చిలుకలన్ని నీరాకను జూస్తున్నయి

ఆరేణుకగుడిలోపల అణువణువూ శుచిచేస్తివి
నీవులేక గుడితలుపులు తెరుచుకోనంటున్నయి

 ప్రతివారిని పలుకరించి పాయిరంగ మాటలాడు
ఆప్యాయత కొరకుమంచి మనసులెదుకుతున్నయి

నీవులేని యింటనేడు వెలుతురులే కున్నదీ
అమ్మనుదురు బోసివోయి చీకట్లు ముసురుతున్నయి

నీవులేని ప్రతీరోజు కళదొలగినరాజస్సే
చందమామ మనలోగిలి పదముమోపనంటున్నయి

వైభవ భారతం - రాజశ్రీలు


తలపైన హిమన్నగము
పాదాల హిందుసముద్రము
ఎడుమనరేబియ సముద్రం
కుడిని బంగాళాఖాతం - 1


భరతుడు పాలించిన భూమి
పాడిపంటల పవిత్రభూమి
బంగరుపంటల సేద్యసీమ
సకలసంపదల భాగ్యసీమ - 2

గంగాయమున పవిత్రనదులు
కృష్ణకావేరిసింధుగోదారి నదులు
పరవళ్లు తొక్కిన జీవనదులు
పరవశించిన పల్లెసీమలు - 3

మనములనిండా విచిత్ర చిత్తులు
మనుషులలోనా విభిన్నవృత్తులు
వృత్తేదైనా ప్రేమిస్తుంటాం
భారతీయతకై జీవిస్తుంటాం - 4

భూగోళఖగోళ మర్మముల
శోధించిఛేదించిన నేల
అన్నివిద్యలకాలవాలమైనది 
సకల శాస్త్రముల నెలవైనది - 5

సకలసృష్టిలో సర్వాత్మనుజూసి
పరులసేవలో పరమాత్మనుజూసి
ప్రకృతినమితం ప్రేమించిన నేల
పంచభూతాల పూజించిన నేల - 6

 
తాత్వికచింతనలో తారాడి
భగవద్సాధనలో తేలాడి
ఋషిమునిగణము నడయాడిన నేల
పరమపదం పారాడిన నేల- 7

సర్వవిద్యాదురంధరులు
సకలశాస్త్ర పారంగతులు
పుట్టిపెరిగిన పుణ్యభూమి
తత్వవేత్తల ధన్యభూమి - 8

తపోవిద్యలో తలామునకలై
కైవల్యం కరతలామలకమై
యోగవిద్య నందించి నేల
జగతికివిద్యలు నేర్పిన నేల - 9

సకలసంకృతుల కాటపట్టు 
సంప్రదాయముల కాయువుపట్టు
ప్రాణికోటికంత పవిత్రభూమి
మానవతావిలువల మహితభూమి - 10


Saturday, August 1, 2020

తెలంగాణ అస్తిత్వం కాళోజీ (కైతికాలు)


నిజాం నెదురించిండు
దొరలమెడలువంచిండు
అణగారిన వారినంత
అనకొండలు జేసిండు
వారెవ్వా తెలుగోడు
ప్రజలమనిషి కాళోజీ - 30

భాషతోనె బతుకన్నడు
యాసలోనె భవితన్నడు
భాషయాస మరచిపోతె
బతుకుదెరువు లేదన్నడు
వారెవ్వా కాళోజీ
తెలంగాణ హీరోజీ - 31

ఉద్యమంలో ముందుంటడు
అన్యాయాన్నె దురిస్తడు
ప్రజలబాధ లన్నింటిని
తనబాధగ భావిస్తడు
వారెవ్వా కాళోజీ
సామాన్యుల హీరోజీ -32

అన్నదమ్ముడెవడులేడు
న్యాయాన్యాయాల తాన
తప్పుచేస్తె యెవడినైన
నిలదీస్తా ఉన్నతాన
వారెవ్వా కాళోజీ
నిజంగానే ప్రజలమనిషి - 33

ప్రజాగోడు ప్రకటించగ
కలమెత్తిన  కవియోధుడు
ప్రజలుద్యమ నాయకుడై
గళమెత్తిన మహధీరుడు
వారెవ్వా కళన్నా
తెలుగు ప్రజల పెద్దన్నా - 34

బడిపలుకుల భాషగాదు
మనపిల్లలు చదువవలెను
పలుకుబడుల భాషలోనె
ప్రజలంతా చదువలెను
వారెవ్వా కాళోజీ
తెలంగాణ వెలుగోయి - 35

ప్రజలగొడవను ప్రశ్నించ
పాళినిసవరించినాడు
బడుగుజీవి బాధలకై
గొంతును సవరించినాడు 
వారెవ్వా కాళోజీ
కలము దూసిన శివాజీ! - 36

కలములోని సిరానంత
అక్షరమాలలుగమలచె
గళమెత్తి గర్జించి
లక్షమెదళ్లు గదిలించె
వారెవ్వా ! కాళోజీ
పడలేదెన్నడు రాజీ! - 37

పలుకుభాష రాయుభాష
రెంటినడుమ భేదమేల?
పలికేటిది రాయుటకూ
మనుషులంత జంకనేల
బడిపలుకులు కాదుభాష
పలుకుబడియె అసలుభాష - 38

Friday, July 24, 2020

తెలంగాణ వెలుగురేఖ (దాశరథి)


నిజాంనిరంకుశత్వాన్ని నిలదీసి
అణగారిన ప్రజలపక్షాన నిలిచి
అగ్నిదారలు కురిపించిన త్రినేత్రుడు!

నవాబుల ఆజ్ఞలపై
ఖాసీంఅకృత్యాలపై
ఎక్కుపెట్టిన శరం దాశరథి!

అణచిన ప్రతిసారీ 
అలజడులు సృష్టించే 
ప్రభంజనమై పైకెగిసిన పెనుఉప్పెన!

తనపద్యదారలు ప్రవహించిన
ప్రతీచోట నిప్పురాజేసిన ప్రభాకరుడు!

రాజదురహంకారం రాతికోటల్లో బంధించినా
చలించని సంకల్పంతో బొగ్గుటులితో
గోడలనిండా పద్యఫిరంగులు
పేర్చిన  ఉద్యమశిల్పి!

చావుకెదురునిలిచి
వెరపన్నది కొనగోటికైన తాకకుండా
పదునైన కవితాధారల
నిజాంరాజుల బూజుదులిపిన
కవితాదురంధర ధైర్యశాలి!

నల్లనిచీకట్లు పులిమిన తెలంగాణమున
కరవాలహలముతో చీల్చి
అక్షరవిత్తులు నాటిన సేధ్యకాడు!

తెలగాణమ్మున వేళ్లూనిన
రాక్షసరాజరిక వటవృక్షమ్మును
కూకటివేళ్లతో పెకిలించిన గిరిధారి!

తాడితపీడిత ప్రజాగళం
తెలుగు ఉర్దూభాషలే నేత్రయుగళం

అమాయకప్రజల నాసాంతం దోచిన
రజాకార్ల కోరలు పీకిన అసురసంహారి
వెట్టిచాకిరితో శ్రమనుదోచిన
దొరల ఆగాడాలకు అడ్డుకట్టలేసిన మురారి

తడిసిన దున్నపోతై
మొత్తంగా మొద్దుబారిన తెలంగాణను
రుద్రవీణారవమున 
జాగృతపరిచిన వైతాళికభానుడు!

అజ్ఞానపుచీకట్లనుచీల్చి
తెలంగాణ వెలుగుల్ని
తేటతెల్లంచేసిన తెలంగాణవైతాళికుడు దాశరథి!

దొరల ఏలుబడిల
నిజాం పాలనల
ధనమానప్రాణాలకు దాపులేక
మైలవడిన తెలంగాణల
కవితాహోమమొనరించి
అగ్నిధారల ముంచి
పునీతగావించిన పుణ్యపురుషుడు దాశరథి!

(దాశరథి స్మరణాంకిత కవితాపుష్పం)

రాజశేఖర్ పచ్చిమట్ల

Tuesday, June 16, 2020

సంఘర్షణ(గజల్)

వానచినుకు కురిసేందుకు మేఘమెంత కరగాలో
మొలక చిగురువేసేందుకు విత్తుయెంత నలగాలో

ఆనింగిని కమ్మేసిన చీకట్లను తరిమేందుకు
ఆకసాన అద్దినట్టి తారలెంత మెరవాలో

పసిపాపల ముసినవ్వులు మనముంగిట మెరియుటకు
తల్లితనువు అణువణువూ బాధనెంత భరించాలో

జగతిలోని సంఘటనలు కవిమదిలో నలిపోయి
కవితలుగా వెలయుటకూ వేదనెంత భరించాలో

(పుఢమితనువు పచ్చదనము)/
పచ్చదనపు ప్రకృతినీ కవిశేఖరు గాంచుటకు
మెత్తనైన మట్టిపొరల గాయమెంత కలగాలో

త్యాగశీలురు

తనువు చిద్రమై
వర్షిస్తున్న రుదిరదారల
నిలువెల్లా తడిసిన
నిర్భీతితో నిలకడగ కొట్టుకునేగుండె
ఒడలు సడలి పట్టుదప్పుతున్న
మరణం కళ్లముందు నిలిచిన
చివరిక్షణం కూడ
సత్తువంతా కూడదీసుకొని
చివరిఊపిరితో
'జైహింద్ ' అని పలికేధైర్యంతో
చివరి నెత్తుటిబొట్టునుసైతం
దేశరక్షణకు దారవోసే దేశభక్తుడు జవాన్

(చైనా - భారత్ ఎదురుకాల్పుల ఘటనలో మరణించిన వీరులకు జోహార్లు)

Monday, June 15, 2020

గతించని జ్ఞాపకాల ముల్లె

వత్సరాలు గతించిపోతున్నయి
ఏడుగుర్రాల రథమెక్కిన సూర్యుడు
ఎడతెరిపిలేకుండ తిరుగుతనే ఉన్నడు
ప్రకృతి పాతనుయెదలోతులో దాచుకొని
కొంగొత్త అందాలొలుకుతుంది

అయినా
నీ జ్ఞాపకాలు మమ్ముల్నొదిలడంలేదు
సిరంచకోట గుట్టల నడుమ
పచ్చనిపందిరిని మోస్తున్న తాడిచెట్లల్ల
పొందికగ పొందిచ్చి కట్టిన
తాటికమ్మల మండువ
చిలుకొయ్యకు తలిగేసిన మోకుముత్తాదు
యేళ్ల పొడువూత నువు గొట్టిన నెర్సుబండ
శరీరం వక్కలైన నీటిని మోస్తూ కత్తిమైలదీసే మొర్రిబింకి
నీకత్తులకు పదునువెట్టిన
తీడుగొల
మేఘాలనురుగులు నిండిన కుండలను
భుజంమోసిన కావడిబద్ద
అన్ని దిగులువడుతున్నయి
మమ్ముల్నెందుకు ముడుతలేరని!
నిండా శోకంల మునిగినయి
మాగౌడు గనవడ్తలేడని!
వనంల అడుగువెడ్తెజాలు
దినమంత ఎప్పుడు పిలిచినా
పలికే నీ ఆత్మీయపలుకులు
నన్ను స్పర్శిస్తు దోబూచులాడుతున్నయి
నీఅడుగుల గుర్తులు
కన్నీటి చెలిమలై
పాలిపోయిన నాప్రతిబింబాన్ని చూపుతున్నయి!
నీకునీడనిచ్చిన
మండువలో మర్రిచెట్టు నిలువునిత్తారం పడ్డది
జువ్విచెట్టు తన్నుతాను మార్చుకొని నాజూకయింది
భూబకాసురుల పారదెబ్బలకు
గడ్డంత గలిసిపోయి పొలమైంది
మండువ గూలి మొండెమైంది
మోకుముత్తాదు చీకిపోయింది
నీవు గలియదిరిగిన తాళ్లని
తలనరికిన సిపాయిలైనయి!

నీవులేక కళదప్పిన మనయిల్లోలె
మండువంత వెలవెలబోయింది!
నీవులేక ఆకులుపరుచుంది
యెల్లమ్మగుడినిండ!
నీ మడితానాలులేక
దేవతామూర్తులన్ని
మైలవట్టి గానరావట్టినయి!

ఊటచెలిమలైన కన్నీరెంత బారిన
తుడుచలేక పోతుంది
మనసులో పాతుకున్న నీబొమ్మను!
ఎంతమంది మావెంటున్నా
మమ్మల్ని వదలడంలేదు నీవులేని లోటు!

ఏ ఉడుతలకు చెట్లెక్క నేర్పుతున్నవో
ఏచిలుకలు తీయని పలకరింపు నేర్పుతున్నవో
ఏబాటసారులకు గుడిసెలేత్తున్నవో
ఏ తేనెటీగలకు కల్లంపుతున్నవో
ప్రకృతిలో లీనమైన నువు
సాల్లెన్ని గడిచినా
మరువలేకపోతున్నం నాన నిన్ను!
నీ తలపులు వీడి
మనలేకపోతున్న నాన!

(పదేండ్ల కింద దివికేగిన నాన్న యాదిలో)

Sunday, June 14, 2020

పోరుబిడ్డ పాపన్న (సీసాలు)

1.
గౌడకు లముబుట్టి| తాడిచెట్టునుగీసి
గీతకార్మికులకు ఊతమిచ్చె

సామాజికాంశాల| చర్చించి చెలిమొప్ప
సబ్బండవర్ణాల| సంఘటించె

ప్రజలరక్షణకోరి| ప్రభువులకెదురేగి
ఊరిజనులగూర్చి| పోరుజేసె

ఓరుగల్లునబుట్టి| పోరుబాటనుబట్టి
ప్రజలందు భయమును| బారద్రోలె

బానిసత్వము జూడంగ| బాధపడెను
వెట్టిచాకిరినిదలంచి| వ్యధ జెందె
జాతి జనులకు జూపించ ప్రగతి బాట
జన్మ భూమిని విడిపించ జంగు సాగె

2.
 శైశవమ్ముమొదలు| శైవభక్తిచెలగి
కాటమయ్యనుగొల్చి| కల్లుగీసె

పన్నువసూలుకై| పల్లెకేతెంచిన
దొరలభంటులనెల్ల| తరిమిగొట్టె

పట్వారులపలుకు|బడినిదుంచి
కరణాలకెదురెల్లి| కాలుదువ్వె

సబ్బండ వర్ణాల|సంఘటితమొనర్చి
ధర్మయుద్ధముజేయ| దారిజూపె

పల్లెలన్ దోచెరాకాసు| లెల్లదరిమి
ఊరు బాగుకొరకు|ఉద్యమించె
సకల వృత్తి జనుల సాపాటు కలిగించ
ముక్తినొసగ తాను| ముందునడిచె

వరుణస్తవం (సీసం)

వరుణ సీసం
1.
అభ్రమా మామీద అలకెందు కోనీకు
కరుణించి కురువవా వరుణ దేవ!
నీరాక కైమేము రేబవల్ వేచేము
కరుణించి కురువవా వరుణదేవ!
మాదుత ప్పిదములు మనమునం దలపక
కరుణించి కురువవా వరుణదేవ!
ఆశలా విరులయ్యి అడుగంటు వేలాయె
కరుణించి కురవవా వరుణదేవ!


అలమ టించె నవని యాకలి కేకలై
దప్పి దీర్చ నైన దరకు రావె
నింగి నుంచి మమ్ము తొంగిచూ చెదవేల
కరుణించి కురవవా వరుణదేవ!

2.

మొరవిని కరుణించు వరుణదేవ!

ప్రకృతి సొగసు (చిత్రకవిత)



పులిపిట్టలమాటు దాగిన ఆకాశం
ఆడపిల్లై అవతరించింది
మబ్బులదాగిన అమాయకత్వం
అందగత్తె రూపుదాల్చింది
జీవజాతిని నయనాలుగ
కొమ్మరెమ్మలు కొసపెదాలుగ
ఊహించని మోహనాంగి ఉద్బవించింది
ప్రకృతి అందమైన బొమ్మను ప్రసవించింది!

Friday, June 12, 2020

గురువు (పద్యం)

గురువు రూపు చూడ కురుచగానున్ననూ
జ్ఞాన దీప్తి బంచు కొనల వరకు
దీపసెగల తీరు పాపని శినిబాపు
సురుకు వెట్టు ఖలుల కరములంట

Sunday, June 7, 2020

వలపుసమీరం(గజల్ )


చెలియకనులు సంధించిన చూపుశరము తాలగలన
మృదుమోవిని జాలువారు పరుషపదము తాలగలన

వసంతాన విరులసిరులు వర్షించే మేఘమాల
విరహపువీవెనలూపెడు వడగాలుల తాలగలన

చెలితలపుల నదితరగల చెలగిచెలగి ఈదులాడ
ఊటచెలిమయెదలోతులొ సుడిగుండము తాలగలన

నింగినుంచి తొంగిచూచు జాబిలంటి జానకనుల
అలమటించి యంబరమై వర్షించిన తాలగలన

యెదసరసున ఓలలాడు సరోజమౌ కవిశేఖరు
మదగజమ్ము సృష్టించే ప్రళయక్రీడ తాలగలన

Friday, May 29, 2020

గజల్ - తావిలేని పూలు

తావిలేని పూలనెలా ధరించెదవు ఓ నరుడా!
ఈవిలేని మనిషినెలా భరించెదవు ఓనరుడా!

వలపులేని వయసుపుఢమి వరపుధార వరిస్తుంటే
మనసులేని మనిషినెలా పూజించెద వోనరుడా!

కలువలెన్నో కొలువుదీరు కొలనుచూసి యెదనుమురిసే
కలువలేని కడలినెలా ప్రేమించెద వోనరుడా!

అల్లుకున్న అనురాగపు తీగెలలో తీపిగ్రోలి
శుష్కమైన సంతునెలా పోషించెద వోనరుడా!

పచ్చదనపు ప్రకృతంత రాగమొప్పు రాజుకరము
విలపించే విపనినెలా వలపించెదవో నరుడా!

పచ్చిమట్ల రాజశేఖర్

గజల్ - యెదతలపులు

మనసులోని జ్ఞాపకాలు కరిగినాయి కన్నీరయి
అంతులేని అశలన్ని చెదిరినాయి కన్నీరయి

మూగవోయి మౌనంగా యెదగదిలో కుములుతుంటే
మనస్నేహపు తలపులన్ని పొంగినాయి కన్నీరయి

ఓదార్పుతొ భుజంతట్టే హృదయం మరుగవుతుంటే
మదినంటిన మలినాలు చెలగినాయి కన్నీరయి

మంచితనం వంచితమై కనుదోయిన మెదులుతుంటె
తాలలేని వ్యథలన్నీ  పెనవేసినాయి కన్నీరయి

అమావాస్య చీకట్లు రాజుమదిని నిశిజేసిన
కన్నులలో వెన్నెలలు విరిసినాయి కన్నీరయి

Thursday, May 21, 2020

సమస్యా పూరణం

సమస్య- అక్కను పెండ్లాడె మిగుల ననురాగమునన్

మక్కిన మామిడి వోలెను
చక్కని సౌరుల్ గలిగిన సరసిజ నేత్రిన్
దక్కిన వరముగ  మిత్రుని
యక్కను పెండ్లాడెమిగుల ననురాగమునన్

Sunday, May 17, 2020

నరోద్భవఫలం(సీసం)

నరులంట పుఢమిపై! నవతరించిన నుండి
ప్రాణికోటికినంత! హానివచ్చె

మనుషులీమహిలోన! మనుగడొందిననుండి
చెట్టుచేమలకంత! చీడవట్టె

బుద్దిజీవులిలలో! వృద్ధిజెందిననుండి
ప్రకృతంతనువెలసి! వికృతి యయ్యె

నరసంతతిలలోన! నడయాడినానుండి
యేరులన్నియునెండి! యరుగులయ్యె

ఉత్తతోలుబొమ్మ!  హృదయమన్నదిలేదు
పాపభీతిలేని! పాతకుండు
భూతదయయులేని! భూతమీ మనుజుండు
నరునితోటె సర్వ!నాశమయ్యె

Thursday, April 9, 2020

కరోనాపై పద్యం

సీసపద్యం:1

నీకున్న సంపదల్! నీవెంట రాలేవు
తాడుగట్టినయాలు! తోడురాదు

నీకన్నబిడ్డలు! నినుజేర రాలేరు
తల్లిదండ్రులునిన్ను! తాకరారు

బంధుజనులుబాధ ! పంచుకొనగరారు
చిన్ననాటి మిత్రులు! చేరరారు

చుట్టమనెడువారు! చూడనెవ్వరురారు
పలుకరించనురారు! పక్కవారు

ఎంతమందీనీకు! సొంతవా రుండినా
సేవజేయదరికి! నెవరురారు
ఒంటి పీనుగువయ్యి! వెంటనెవ్వరురాక
కరొన సోకనరులు! కాటికేగు

సీసపద్యం:2

వైద్యులె దేవులై! వైరస్సు బాపంగ
ప్రాణములకు తెగి! పాటుపడిరి

పోలీసు బలగాలు! పోరాట పటిమతో
సర్వకాలములోన! సడకు గాచె

పారిశుధ్యపువారు! పరిసరాలన్నింట
మలినములనుబాప! మథనపడిరి

ప్రభుతపాలకులంత! ప్రజలశ్రేయముగోరి
చేయికలిపిరంత! సేవజేయ

ఇంటయందునుండి నినునీవు గాచుకో
బాధ లొంద బోకు బయట కొచ్చి
స్వస్తమొందనీవు స్వస్తయౌ లోకమ్ము
లక్షపెట్టకున్న రక్షలేదు


Sunday, March 29, 2020

చెట్టు - తోబుట్టు

పేరు. రాజశేఖర్ పచ్చిమట్ల
        గోపులాపూర్
        జగిత్యాల .జిల్లా
        9676666353

శీర్షిక:

1.సీసపద్యం:
పుడమి తనువుచీల్చి పుట్లుపుట్లుగ మొల్చి
ఆకుపచ్చనివస్త్ర మవని కొసగు

అహరహమ్ము వెరిగి యలరారి వనములై
పశుపక్ష్య ములకంత వసతి గూర్చు

మనుజలో కముకంత మలయమారుతమిచ్చి
కమనీయ ఫలముల కడుపు నింపు

అంబరమ్మునసాగు యభ్రమ్ము లనుబిల్చి
అవనిదాహము దీర్చ నంబువొసగు

ప్రాణవాయు వొసగి ఆయుర్దాయముబెంచి
కూడు గూడు నొసగు కూర్మి తోడ
అఖిల ప్రాణి కోటి కాధార భూతమౌ
మొక్క నాటవోయి ఒక్కటైన

2.సీసపద్యం:

సాళ్లుసాళ్లుగనిల్చి స్వాగతమ్ములు బల్కి
ఛాయనిచ్చి మిగుల హాయి గొల్పు

అలసి వచ్చినవారి బడలికన్ దీర్చేల
మలయమారుతమిచ్చి మరులు గొల్పు

ఆకొని దరిజేరు యతిథిసంతుష్టికై
మధురఫలములిచ్చి మమతబంచు

సకల రోగములకు  స్వాంతన మ్మొసగేల
ఔషధ మ్ములనిచ్చి స్వస్త తొసగు

కన్నతల్లి వలెను కడుపు నింపుడెగాక
కామితార్థమొసగు కల్పతరువు
మనిషి మనుగడూంచు మహిత శక్తి తరువు
మొక్కనాటవోయి ఒక్కటైన!

హామిపత్రం:
     ఈపద్యములు నాస్వంత రచనే తప్ప దేనికీ అనువాదము కాదు. దీనిని ఏగ్రూపులో, ఏ పుస్తకంలో ప్రచురించలేదు.
ఈపోటీకొరకే రచించితిని.

Saturday, March 28, 2020

మా'నవ' నైజం


~~~~~~~~~~~~~
కరువుకోరల్లో చిక్కిన లోకంలో
బతుకుదెరువు భారమైనపుడు
నూకలకై వెదికేదొకరైైతే
రూకలకై వెదికేదొకరు
ఒక్కోచేపకు గాలమేసి నిరీక్షించి నీరసించి
దొరికినదాన్ని దాచుకుని మురిసేదొకడు
దాచినసంచికికూడ దెల్వకుండ లేపేసేదింకొకడు
చిన్నచేపను పెద్దచేపలు మింగే విషసంస్కృతిలో
గద్దల ఆకలిదీర్చ కాకులదరిమే లోకంలో
ఎన్నెత్తులువేసి ఎంతెత్తుకెదిగినా
మనిషికావల్సింది జానెడు పొట్ట
మూరెడు బట్ట
ఆరడుగుల నేల!

రాజశేఖర్ పచ్చిమట్ల
జగిత్యాల
9676666353

Wednesday, March 4, 2020

బంధీయైన బాల్యం ( సీసం)

సీసం: 
బడికేగు బాల్యమ్ము బాధిల్లుతున్నది 
సంచిమోయనులేక సదువలేక
బడికేగు బాల్యమ్ము బాధిల్లుతున్నది
ఆటపాటలులేక హాయిలేక
బడికేగు బాల్యమ్ము బాధిల్లుతున్నది 
మంచినిద్రనులేక మమతలేక
బడికేగు బాల్యమ్ము బాధిల్లుతున్నది 
చెలగిమెలిగునట్టి చెలిమిలేక
పుస్తకములుదప్ప నేస్తమేదియులేక
మరుగునవడె సృజన మెరుపులేక 
కన్నవారుగన్న గరిమ కలలయందు
పేరుమోసినట్టి పెద్దబడులయందు
బంధియైనదిసుమ బాల్యమంత  

వాణిస్తుతి



విమల వస్త్రధారియయిన విజ్ఞుమూర్తి

కమల పీఠము దాల్చిన కరుణ మూర్తి

వీణియ ధరించి జనుల వివేక పరుచు

వాణి! నీకు నేనొరింతు వందనమ్ము .

చదువు

కవితోదయం

 రాత్రి తొమ్మిది ఘడియల పురిటినొప్పులనంతరం
పుడమి తల్లి
పండంటి పసిబిడ్డను
ప్రసవించింది
ఉదయభానుడికి పురుడుపోసింది

జగత్తంత వణికిస్తున్న
చలిపులికి
నులివెచ్చని కిరణాల
సూర్యోదయం
సింహస్వప్నం

ప్రభాకరుడి
వాలుచూపులు వాలిన
పుడమి తల్లి
దేహముపై రాలిన
ముత్తెపు బిందువులు
స్రవించి యావిరులై
ఆకసమున కెగసె

పశుపక్షాదుల
స్వాగత గీతికల మధ్య
పతంగుడి పదము
పల్లెకేసి కదిలె
పల్లెతల్లి దుప్పటితీసి
ప్రాతఃకాల విధులందు
పరితప్తమయ్యె
[1/4, 3:07 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: శీర్షిక: కరుణావీక్షణం

నిండు వేసవిలో
చలికాలపు చల్లని
వీచికల నానందించే

ఎముకలు కొరికే చలిలో
రగ్గుల వెచ్చని కౌగిట్లో ఒదిగే

నిడుజడిలో నింపాదిగా
ఒళ్లు తడవకుండా
ఒడ్డునజేరే
ఆగర్భ శ్రీమంతులనొదిలి
దినదిన గండమై బ్రతికే
దినసరి కూలీల దైన్యమును జూడు
కవిహృదయం కకావికలమవుతుంది
[1/4, 3:16 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: శీర్షిక: గాలింపు

పూల పరిమళాల నాస్వాదించు చాలు
శాఖా భేదాలను శోధించకు

మధురజలాలు స్వీకరించు చాలు
నదులలోతులు వెతికుచూడకు

చల్లని నీడను స్వస్తత బొందు చాలు
తరువుల యంతరువు లెంచకు
[1/4, 3:43 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: శీర్షిక: క 'వికలం'

నాలోని భావాలు
నను వేదించిన క్షణాలు

అక్షరాలుగ అంకురించి
పదకవితా లతలుగ
పాటల సెలయేళ్లుగ
అలంకారపు టలలుగ
వినువీధిని విహరించక


మనిషితో మమైకమై
సంఘంతో సంఘటితమై
ప్రజాపక్షం నిలిచిననాడు
       నా కలానికో శక్తి!
              నా గళానికో రక్తి!!
[1/4, 3:52 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: శీర్షిక: పరిశీలన

అలరించే పూలనుగాదు
అట్టడుగున దాగిన వేళ్లను జూడు

అగుపించే ఆకారముగాదు
ఆలంబనైన రాయినిజూడు!

అందమైన తోటను గాదు
తోటమాలి శ్రమను జూడు!

మిరుమిట్లుగొలిపె మెరుపులుగాదు
దానిమాటు సంఘర్షణ జూడు!

వెలుగులీను విద్యార్థిని గాదు
సానరాయి సత్తువ జూడు!

పండంటి బిడ్డను గాదు
తల్లి ప్రసవవేదనను జూడు!
[1/4, 3:53 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: శీర్షిక: పరిశీలన

అలరించే పూలనుగాదు
అట్టడుగున దాగిన వేళ్లను జూడు

అగుపించే ఆకారముగాదు
ఆలంబనైన రాయినిజూడు!

అందమైన తోటను గాదు
తోటమాలి శ్రమను జూడు!

మిరుమిట్లుగొలిపె మెరుపులుగాదు
దానిమాటు సంఘర్షణ జూడు!

వెలుగులీను వజ్రమును గాదు
సానరాయి సత్తువ జూడు!

పండంటి బిడ్డను గాదు
తల్లి ప్రసవవేదనను జూడు!
[1/4, 4:02 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: హొయలొల్కు శిల్ప సౌందర్యాన్ని గాదు
శిల్పి కళావైధుష్యాన్ని జూడు
[1/4, 4:03 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: సద్వీక్షణ
[1/4, 4:52 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: కవిప్రసవవేదనానంతరం
కవితాప్రభ ప్రభవించినది

శిల్పి మనోచింతనము
శిలకడుపున శిల్ప ముద్భవించినది

కర్షకుని స్వేదము సేద్యపునీరైతేగాని
పుడమి సస్యములతో పులకరించదు
[1/4, 5:06 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: ఒకరికొకరు చేదోడు వాదోడయ్యే రోజు

పైసలకుగాక
మనుషులకు విలువిచ్చేరోజు

ఆహార్యముల నొదిలి
అసలు మనిషిని గౌరవించే రోజు

అంతస్తులనుదిగి
అంతరంగాలలో ఒదిగేరోజు
మళ్లీరావాలి
[1/4, 5:50 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: సీసం: లక్ష్మీ కటాక్షం

సకలసం పదలతో వికసించు వారల
చెంతనుం డిననేమి చిద్విలాసి

భోగభా గ్యములతో పరివసిం చెడివారి
పంచజే రిననేమి పంక జాక్షి

బొడ్లెవ రములతో పురుడువో సుకునేటి
వరపుత్రు వలపేల వనజ నేత్రి

పలపూప పాయస పంచభ క్ష్యములతో
డలరినన్  ఫలమేమి యంబు జాక్షి

గడియొక గండమై గడుపువా రనొదిలి
గర్వోన్న తులనేల కమల నయని

అన్నపాన ములక కంగలా ర్చెడివారు
అనుది నమొక యుగము  బతుకు వారు
నీదు రాక కొరకు నిత్యత పముజేయు
వారి జేరు కంటె వాసి గలదె
(వారి జేర నీకు పరము దక్కు)
[1/4, 6:21 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: సంపద లనుజూసి సంబుర పడువాడు
ధనమద మ్ముననిల దనరు వాడు

అధికార దాహాన అంగలా ర్చెడువాడు
అన్నద మ్ములతోడు బాపు వాడు

జగతిజ నులనెల్ల సమముజూ చుటగాక
తనపర భావంబు తలచు వాడు

పేదవా రినిజూసి ఛీదరిం చెటెగాక
ధీనస్థి తినిజూసి తిట్టు వాడు

మనసు గల్గి నట్టి మానవుం డవలేడు
అవని వెలసి నట్టి రాయి గాక
అట్టి వార మనుషు లనుటకం టెమిగుల
ధరణి పుట్టి నట్టి ధాన వుండు
[1/4, 6:38 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: ఆకల య్యెడువేళ అన్నముం డినజాలు
ధాన్యరా శులనింట తనరుటేల

అవసర మ్ములుదీర పైకముం డినజిలు
ధనరాశు లనుదాయ తలచు టేల

అంగము లనుగప్ప వస్త్రముం డినజాలు
గుడ్డల న్నిటిమూట గట్టనేల

తలదాచు టకుతగు తలముం డినజాలు
పెద్దభ వంతుల పేర్చ నేల
[1/4, 8:01 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: మాదరి కినిరావె మమత తోడ
[1/4, 9:25 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: నిత్యసం తుష్టులై నిగనిగలాడేటి
సంపన్ను లనువిడ్చి సంయ మమున

ధనవంతు లుగనిల తలలునిం గికియెత్తి
గర్వహి తులబాసి కదము దొక్కి

ఐశ్వర్య ములతోడ అలరారు చుండేటి
విలసిత మ్మొనరించు విభుల విడిచి

స్వర్గభూ యిష్టమై సరసాల నిలయమౌ
కూబరు లకొలువు కూట మొదిలి

నీదురాక కొరకు నిత్యత పముజేయు
వాని కరుణ జూడు వారి జాక్షి
ధనమ దులను వీడి దారిద్ర్య దారుల
కదిలి రావె తల్లి కమల పీఠి
[1/4, 11:36 AM] రాజశేఖర్ పచ్చిమట్ల: అన్నాది కాలాన ఆదిదే వులకంత
సురపాన మైనిల్చి సుధను గొల్పె

ప్రభువులున్ బ్రజలంత ప్రమధులై తిరుగాడ
ద్రాక్షాస వమ్మయి దార వారె

కాలగ మనమందు గౌడన్న చేతిలో
తాటిక ల్లుగరూపు దాల్చె నదియె

ఆధుని కాలాన బ్రాందివి స్కీపేర
నానావి ధమ్ముల నవత రించె

మద్య మేది యైన మత్థెక్కు టేగాదు
పిల్లి పులిగ మారి లొల్లి జేయు
నాటి తరము నుండి నేటివ రకుజూడ
కల్లు దాగ నోడు ఖలుడె సుమ్ము (గాదె)

Tuesday, March 3, 2020

ఎడబాటు


చెలీ!
ఎడబాటు వేదిస్తుందనీ
చెలగి కన్నీరు కార్చకు!
మన ఈ ప్రేమాయాణంలో
నీకు నేనెంత దూరమో
నాకు నువ్వంతే దూరం
కాని చిన్న తేడా
ఎడబాటుకు ఏడ్చియేడ్చి
గుండెబరువు దించేసుకు
కుదుటపడుతావు నీవు!
ఎడబాటును అణచివేస్తూ
ఏడుపంత దిగమింగి
బరువెక్కిన గుండెతో
బతుకీడుస్తాను నేను!

ఆవేదనతో అవిసిన
గుండెనుసైతం గుడిచేసి
బండబారిన శిలపై
నీరూపసౌందర్యం నెరపి
నిన్నే ఆరాధిస్తా చెలీ!

రాజశేఖర్ at 4:57 AMu

Tuesday, January 28, 2020

సీసం: ఆలిసేవలు



కౌమారదశలోనకౌతుక ములుదీర్చ
అప్సరసేయౌను ఆలితాను

మధ్యవయసులోని మంతనములలోన
మంత్రియైతగినట్టి మాటజెప్పు

ముదిమిజొచ్చినవేళ మూడొకాళుగమారి
పతులగమ్యమునకు పదములౌను

అవసానదశయందు అతిథిసేవలుజేసి
ఆలంభనగనిల్చి యాసరౌను

వేలుబట్టినదాదితా వెంటనడిచి
కష్టసుఖములనన్నింట కలిసిమెదిలి
ప్రేమ బంచుట లోపిల్ల పెన్మిటికడ
అమ్మలకుమారు సేవించి యాలినిలుచు

Wednesday, January 22, 2020

వాడుకభాషా వత్సలుడు(గిడుగు రాంమూర్తి)


పాలకభాష పండితభాష
ప్రామాణిక భాషంటూ
భాషను బహురూపుల బంధించి
శుద్ధగ్రాంథీకంలో సాహిత్యరచన జేసి
విద్యను బ్రహ్మపదార్థంగా
సామాన్య జనానికి సదువు వాసన సోకకుండా
పండితుల వంటింటి కుందేలునుజేసి
వాడుకభాషకు విలువనీయక
మేధావులంతా తత్సమభాషను
మేథస్సు నిదర్శనంగా ఊరేగుతున్న కాలంలో
ప్రజలభాష పరపతిపెంచి
సదువులతల్లిని సర్వజనుల
చేరదీసి చేయికందించిన
వ్యవహారికభాషోద్యమపితామహుడు గిడుగు

మాటలుతప్ప లిపిలేని
సవరభాషను సవరించి
సవర సాహిత్య సృజనకు
పునాదివేసిన భాషాశాస్త్రవేత్త గిడుగు

తెలుగుపత్రికను స్థాపించి
పండితప్రశంసాయుత గ్రాంధికభాషను గద్దెదించి
పామరజనరంజక ప్రజలవాడుకభాషకు పట్టంగట్టి
మాటలకుమాత్రమే పరిమితమై
గ్రామ్యంగా ముద్రవేయబడి
పలురకాల పరిహాసమొందిన
పల్లెభాషను
కావ్యభాషగా మెరిపించి మురిసిన భాషాయోధుడు గిడుగు!
సాధారణభాషలో సాహితీసృజనకు బాటలువేసిన సాహిత్యపిపాసి గిడుగు!

మాట్లాడేభాష వేరు సదివే భాష వేరుగ
చదివేపిల్లల శ్రమజూసి
పాఠ్యపుస్తకాలన్ని ప్రజలభాషలుండాలని
సాహిత్యమేగాక విజ్ఞానాన్ని
ప్రజలభాషకు మార్చి
సదువులమ్మను సామాన్యప్రజల లోగిల్లలో నిలిపిన అపర భగీరథుడు గిడుగు

         పచ్చిమట్ల రాజశేఖర్
                 జగిత్యాల
           9676666353

Monday, January 6, 2020

అనుబంధాల ముల్లె

పల్లె
ఆప్యాయతానురాగాల ముల్లె
అనుబంధాలు పెనవేసిన మల్లె
పుట్లకొలది పంటలరాశులు
పాలయేరుల పాడియావులు
ఆడే పిల్లల అరుపులు
ఎగిరే లేగదూడల గెంతులు
అపురూప మేళవింపు పల్లె
మకరసంక్రమణంతో సూర్యుని తేజస్సు
సంక్రాంతి పండుగతో తెలుగు లోగిళ్లు
దేదీప్యమానమై తేజరిల్లుతాయి
చుక్కల తోపులై తళుకులీనుతుంటయి
పంటల రాకతో రైతు
పండుగ రాకతో పల్లె
మురిసిపోతది మైమరిచి పోతది!
ఇరుకైన పూరిళ్లు విశాలహృదయంతో
పల్లెమనసులు పరిమళించి
బంధుజనుల సందడితో
సంక్రాంతి సంబురాల్లో మునిగితేలుతది పల్లె!
కోడిపుంజుపోటీలు గంగిరెద్దులాటలు
భోగిమంటలు పిండివంటలు
తీరొక్క ముగ్గులు తీర్చిన గొబ్బెమ్మలు
కొత్తరంగు పులుముకుంటది పల్లె!
పరవశంతో పులకిించిి పోతది పల్లె!

మూడురంగుల జెండా (గేయం)

శీర్షిక: మూడురంగుల జెండా
రచయిత పేరు: పచ్చిమట్ల రాజశేఖర్
పల్లవి:
మూడురంగుల జెండా ముచ్చటైన మన జెండా
భరతావని యెదలనిండి రెపరెపలాడే జెండా
చ1.
తరతరాల బానిసత్వ సంకెళ్లను తొలగించిన
త్యాగధనుల గుండెనిండ
ధైర్యము నింపిన జెండా
చ2.
సైరికులతో సైనికులతో
సంప్రదాయ విలువలతో
ఆకాశపు అంచులలో
అలరారెను మనజెండా
చ3.
ఆసేతు హిమాచలము అణువణువూ తడిసేలా
మానవతా పరిమళాలు
మదిపులిమిన మన జెండా
చ4.
అస్త్రశస్త్ర విలువిద్యలో ఆరితేరినా యోధుల
అహింసనే ఆయుధమై యలరారిన మన జెండా
చ5.
కులమతాలు వర్ణవర్గ విభేదాలు యెన్నున్నా
భారతీయసూత్రంతో బంధించిన మన జెండా

గోపులాపూర్ గ్రామం
జగిత్యాల జిల్లా
9676666353

Saturday, January 4, 2020

శీర్షిక: అంధుల బంధువు

(లూయీస్ బ్రెయిల్  జన్మదిన సందర్భంగా)


చిక్కులెన్నిటినో చిరునవ్వుతో చేధించి
చీకటిబతుకుల్లో చిరుదివ్వె వెలిగించావు
'అంధ'కారమగు అంధుల మోముపై
చిద్విలాసమై చిగురించావు

దారితెలియక పడబడు అడుగులకు
ఊతమై క్రాంతిపథం చూపించావు
చుక్కలలిపితో  చక్కని రాతనేర్పి
చూపులేని వారకు చుక్కానివైనావు!

Friday, January 3, 2020

శీర్షిక: మణిదీపం


ఉన్నతవర్గంలో ఉద్భవించి
అగ్రవర్ణంలో  మెరుగులు దిద్ది

దళితవాడలో
కటికదరిద్రంలో పుట్టి
మైలవడ్డ బతుకుల కడిగి
ముత్యాల జేసింది

అజ్ఞానపుచీకట్లు ముసిరిన
ఆదిహిందువుల అడుగులకు
దారిజూపే చేతిదీపమైంది

అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని
దుష్టబుద్దిని దురహంకారాన్ని తూలనాడి తూర్పారవట్టింది!

మురికివాడల కంపుగొట్టిన
తాడితపీడిత బహుజనుల బాగుకొరకు
అవమానాల్నే అలంకారాలుగ
పిడికిలి బిగించి పోరాడింది!

పడగవిప్పిన బానిసత్వపు కోరలు పీకి
బడుగులఅడుగుల్లో అడుగై
అజ్ఞానపు బతుకుల్లో
అక్షరదీపం వెలిగించింది!
ఆదిగురువై నిలిచింది!

గజల్



ఊగిఊగి ఉయ్యాల ఉన్నచోటనే ఆగెను
ఎగిరియెగిరి నామనసు దేహగూటికే చేరెను

రేయింబవలు ఆశలకై తమకముతో చెలరేగిన
కలలుదీరు దారిలేక మదిన కలతలే చేరెను

సత్యమేదో తెలుసుకోక స్వార్థముతో దోచేసిన
ఏసంపదలెంటరాక వల్లకాటికే చెరెను

ఆలుబిడ్డలన్నదమ్ము లనుబంధము పెనవేసిన
ప్రాణము దేహమునువీడి పరమాత్మనే చేరెను

మేదినీలో మహిమలన్ని గాంచలేరు జన శేఖర
మాయపొరలు చీల్చుకొని మహితకనులనే చేరెను

(మేదినిలో మహిమలన్ని గాంచునులే కవిశేఖర
 మాయపొరలు చీల్చుకొని మహితకనులనే చేరెను)

Thursday, January 2, 2020

ఎడబాటు


చెలీ!
ఎడబాటు వేదిస్తుందనీ
చెలగి కన్నీరు కార్చకు!
మన ఈ ప్రేమాయాణంలో
నీకు నేనెంత దూరమో
నాకు నువ్వంతే దూరం
కాని చిన్న తేడా
ఎడబాటుకు ఏడ్చియేడ్చి
గుండెబరువు దించేసుకు
కుదుటపడుతావు నీవు!
ఎడబాటును అణచివేస్తూ
ఏడుపంత దిగమింగి
బరువెక్కిన గుండెతో
బతుకీడుస్తాను నేను!

ఆవేదనతో అవిసిన
గుండెనుసైతం గుడిచేసి
బండబారిన శిలపై
నీరూపసౌందర్యం నెరపి
నిన్నే ఆరాధిస్తా చెలీ!

ఆంగ్లవత్సరాది

కవితాలోకంలో విహరించే
కవివరేణ్య నెచ్చెలికాండ్రందరకు
'ఆటవెలది' తో హార్ధిక శుభాకాంక్షలు
ఆ.వె.
సఖియసొంటినూత్న సంవత్సరమువచ్చె
ఆలువంటి గతము అరగిపోవ
పాతనొదిలిపెట్టి కొత్తనా హ్వానించి
హాయి నొందు మిగుల సోయి మరచి