Friday, December 28, 2007

నీకై...

వేకువ జామున మొదలు
మిసిరాత్రుల మేళనం వరకు
అను నిత్యం ప్రకృతితో
ప్రతి స్పందించే నీవు ...
మాతృప్రేమను మరువలేక
ప్రకృతి ఒడిలో శయనించావా...!

నిరంతరం శ్రమించే నీవు
ఆదమరిచి ఆకులపై
నిద్రించావా...!

నిత్యం దోబూచులాడె
ఆ పక్షుల కిల కిల రాగాలు వింటూ
వాటితో శృతి కలిపేందుకు
సాగిపోయావా...!

పిల్ల తెమ్మరల
ఈల పాటలు వింటూ
చేదు జీవితపు కలతలు మరిచి
తన్మయత్వంతో తరలిపోయావా...!

కటిక నేలపై కాలుజాపే నిన్ను
మత్త కోయిలలు మత్తుగా జోలపాడి
పచ్చని ప్రకృతమ్మ
వెచ్చని పొత్తిళ్ళలో నిద్రబుచ్చాయా...!

నిత్యం నీవు కదలాడే
పంటచేలోని ప్రతి మొక్క
వెర్రిగా నను ప్రశ్నిస్తుంది
నీ జాడ తెలుసుకోమని....!

పిల్లగాలి మెల్లగా
గేళి చేస్తుంది నను
నీవిప్పుడు అనాథవని ....!

తెలియదు వాటికి నిజం
చిగురించే ప్రతి మొక్కలో
నీ సున్నితపు మనస్సు,
వికసించే ప్రతి పూవులో
నీ చిరునవ్వులు దర్శిస్తున్నాని ...!

అందుకే....
ప్రకృతిని చూస్తే
ఒకింత ప్రేమ,
రెండింతలు ఈర్శతో
మదన పడుతుంటాను.
నిను ఒడిలోకి చేర్చుకొని
సేదతీరుస్తున్నందుకు...!
మానుండి దూరం జేసి
మాయ జేసినందుకు ...!

అయినా....
ప్రకృతిని చూస్తే పరవశించి పోతాను
నీవు దానిలో లీనమైనందుకు,
నిత్యం దానిలో వెతుకుతుంటాను
నీ ఆప్యాయత దొరుకుతుందేమోనని !
వికసించే వెన్నెలకై వేచి చూస్తాను
నీ రూపు దర్శనమిస్తుందేమోనని...!
(మానాన్న గారు స్వర్గీయ పచిమట్ల లచ్చయ్యగౌడ్ గారి ఙాపకార్థం)

Thursday, December 13, 2007

దయార్ద్ర హృదయుడు

అంట రాని వాడంటు
అడ్డు గోడ బెట్టకు
అంతులేని విలువ గల్గి
నీకంద రాని వానిని.

రంగు మెరుగు రాళ్ళ
నెరిగిన నీవు
వాటి జన్మ తలాలైన
మూలాలను యెంచలేవు.

సృస్టి కర్త తనువు నుంచి
చించుకుంటు మీరస్తే
పరుల మేలు గోరు
నేను పాదాలను యెంచుకుంటి.

మీరు చించిన దేహం
నేల రాలి పోకుండా
పాదాలలో ప్రవేసించి
పటిష్టంగ నిలబెట్టితి.

అర్థ విలువ లధికమయ్యి
ఆప్యాయత లెరుగలేవు
మమత లెరుగని నీవు
మనిషివి గానేరవు.

ఱెక్కలొచ్చిన మీరు
దిక్కులకై యెగురుతుంటె
జన్మ నిచ్చిన తల్లి
ఋణం తీర్చ నేనుంటి.

అంటరాని వాన్ని గాను
అనురాగం గల్గి నోన్ని
దలితుడిని గాను
నేనుదయార్ద్ర హృదయుడిని.

సిరులు గల్ల తల్లిని

పోరాటమె నా ఆయుధం
తెలంగాణమె నా ధ్యేయం
సంస్కృతులకు నెలవైన
చక్కదనాల తెలుగుతల్లిని
పిశాచాల్లా పీక్కుతిని
ఎముకల గూడు మిగిల్చిండ్రు.

తేనెలొలుకు నా భాషను
తూట్లు తూట్లు గాల్చేసి
పాండిత్యం గల్ల భాష
ప్రామాణిక మన్నారు.

పండితులం మేమే నని
పరవశించి పోయిండ్రు
తెలంగాణ కవి బిడ్డల
తుంగలోన దొక్కిండ్రు.

కన్న బిడ్డ కళ్ళు గట్టి
సిరులు గల్ల నాతల్లిని
నిలువున దోపిడి జెసి
వివస్త్రను గావించి
వినోదాలు జూస్తుండ్రు.

మీది తెలుగు మాది తెలుగని
మబ్బె పెట్టి మాయ జెసి
మేమంతా అన్నలమని
వరుసలు గలిపేస్తుండ్రు.

ఏరువడితె ఎదుగలేమని
కపట ప్రేమలొలకవోసి
పాలననే పేరు తోటి
పీల్చి పిప్పి జేసిండ్రు.

తెలుగు తల్లి నలరించిన
పచ్చని యా వరి మళ్లు
మీకుట్రల కుతంత్రాన
బిక్కసచ్చి బీళ్లు బారినై.

వెలుగు లిచ్చు నాతల్లి
జిలుగు లన్ని దోచుకొని
కటిక చీకటిని మాకు
కానుకగా యిచ్చిండ్రు.
నవాబుల రక్తాన్ని
నెమ్మదిగా నెమరు వేసిన
రైతన్నల తుపాకులు
ఆకలితో అరుస్తున్నై.

తూటాలకు తెలియదులే
మీరే మా అన్నలనీ
దారి గాచి దోచుకునే
దోపిడి దొంగల కాల్చి
ఆ నీచుల రక్తంతో
అభిషేకం జేయించి
పునీతగా మార్చుకొని
పట్టు బట్ట కడ్తాము
తెలంగాణ నడి వొడ్డున
మా తల్లిని నిలుపుతాము.

Tuesday, December 11, 2007

శవాల గుట్టలు

శోక సముద్రంలో కొట్టుకు పోతున్నాను
చిత్రం!నిద్ర లేచి చూస్తే
చుట్టు శవాల గుట్టలు
చిత్రంగా పడి ఉన్నవి.
ఆశ్చర్యం ! ఏమిటంటే
నే నిద్ర పోయి నెలలైంది
లేచి చూస్తే వింత దృశ్యం
ఒక్కొరిదో చరిత్ర
యెదల నిండ విషాదం
కదిలించితే కన్నీరు
ఏమని ఓదార్చను.

నేను వారిలో ఒకరినని
వారికెలా చెప్పను
బారమైన వారి గుండెల
బడలిక నెలా తిర్చను.
నిజంగా నే నిస్సహయుడ నయ్యా
చేద్దామని సాహసించిన
కాల్లు రెక్కలాడ లేదు
నేను చచ్చి నెలలైంది.

నీ రాక?

వసంత మాసంలో కోయిల రాక
మాఘ మాసంలో మంచుబిందువుల రాక
మధుమాసంలో మల్లెల రాక
యెప్పుడో చెలీ!నా యెద నిండిన నీ రాక?

Wednesday, May 2, 2007

వీడుకోలు పద్యాలు

ఆ:వె: తెలుగు శాఖయనెడి దివ్య మందిరమున అష్టదిగ్గజములె మాగురువులు 
నాటిరాయల సభ నేటికితలపించి
వెలుగు జిమ్ముచుండె వీడుకోలు

 తే: దిగులు పడటమే వీరుడు ధీనుడయ్యి
నిలిచెదవు మున్ముందు నింగి నంటి 
నివురు గప్పిన గానదు నిప్పు రవ్వ 
 ప్రజ్వలించి పెన్మంటలు రాకపోవు

Wednesday, April 11, 2007

పడుచు పరువం!

వసంతం వచ్చి పిలిస్తె
ఏ కోకిల పాడకుండు!
సూర్యోదయం సొచ్చుకొస్తె
ఏ కమలం విరియకుండు!
పైర గాలి వీస్తుంటె
పరువం ఆడకుండు!
ముద్దు మల్లె వికసిస్తె
ఏ మధుపం ఊరుకుండు!
నా హృదయాంతరాలలో
నిలిచిన నీవు
నీ హృదయద్వారం తెరిచి పిలిస్తె
రాకుండా వుండగలనా!
ఓ చెలీ? నీవే నాలోకమని
పాడకుండా వుండగలనా!

Tuesday, April 3, 2007

నేటి సంస్కృతి!

మన భారతదేశం సంసృతీ సంప్రదాయాలకు నిలయం.
అలాంటి పవిత్రదేశంలో జన్మించిన మనమే వాటిని చిన్న చూపు చూస్తున్నాం.
సృస్టిలో ప్రతి మనిషి తన చుట్టు ఉండే సమాజపు కట్టుబాట్లకు అనుగుణంగా మెదులుతుంటాడు.
ప్రతి దేశానికి ఏవో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.అలాంటివే మన సంప్రదాయాలు కూడా.
కాని మన దేశంలో కొంచెం ఎక్కువ.అంత మాత్రాన అది చాదస్తం అనుకుంటే పొరపాటే.
ఈ కట్టుబాట్లలో స్వేచ్చ లేదంకోవడం తప్పు.మనకూ స్వేచ్చ వుంది కాని విచ్చలవిడి తనము లేదు.
అలా విచ్చలవిడిగా తిరుగడమే స్వేచ్చ అనే భ్రమలో యువత
నేడు మన సంస్కృతి సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు
ఇంతగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం పల్లెలే.
అందుకే పల్లెలు "పల్లెలు పట్టుకొమ్మలని కీర్తించబడ్డాయి".
నాగరికత తెలిసిన మనం అభివృద్ది పేరుతో మన సన్స్కృతిని కాల రాస్తుంటే
అనాగరికులైన వాళ్ళు మాత్రం మన ఉనికిని కాపాడుతున్నరు.
వంటి వారిని గౌరవించాల్సింది పోయి అనాగరికులని,అవివేకులనీ నిందిస్తున్నాం.
మొక్క ఎంత ఎదిగినా, మనిషి నింగికి నిచ్చెనలేసినా పుట్టిన భూమిని,ఆచారాలను మరువద్దు.
కాని అన్ని మరిచిన మనమే వివేకులం.

మనిషి సంఘజీవి. తన చుట్టూ వున్న వారిని అనుకరిస్తుంటాడు,
తనకంటే మెరుగనుకున్న వాటిని అలవర్చుకుంటాడు.
ఈ క్రమంలోమన సంస్కృతి పూర్వ వైభవాన్ని క్రమంగా కోల్పోతుంది.
"అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని"
పలికిన మహాత్ముని పలుకులకు నగర యువత అక్ష్రాల అద్దం పడుతోంది.
అర్ధ రాత్రి ఏ పబ్బుల్లో చూసినా,డిస్కోతెక్కుల్లో చూసినా యువతులే.
ధూమపానం, మధ్యపానం ఇలా ఏ రంగంలో చుసినా
మగాడితో పోటీ పడుతూ తమదైన శైలిలో ఎదుగుతున్నారు.
బహుశా అదే నిజమైన నాగరికతేమో!

ఈ విషయంలో యువతను ఆపలేము.
అదే నాగరికత అనే భ్రమలో వారున్నారు.
దీనికంతటికి కారణం విదేశీ వ్యామోహం,పరాయి సంస్కృతులపై మోజు.
ఈ మైకంలోంచి తేరుకునే వరకు వారిని ఎవ్వరూ ఆపలేరు.
అయినా మనం చేయగల్గిందేముంది వారిని రక్షించమని దేవున్ని ప్రార్థించడం తప్ప.

"నేటి బాలలే రేపటి పౌరులని" నిరంతరం పాడుకునే
మనదేశంలో వారి ప్రగతి పక్కతోవ పడుతోంది.
కీర్తి పతాకాన్ని నింగికి నిలిపే యువత మధ్యం మత్తులో మునిగి
తమ కాల్లపై తాము నిలబడలేకపోతుంది. అదే కల్చరని కాలరెగురవేస్తుంది.
"డేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రులనుండి పతివ్రతల నుండి"అని తిలక్ గారన్నారు.
కాని నేడు "దేవుడా! రక్షించు నా దేశాన్ని పరాయి సంస్కృతులనుండి" అని కీర్తించాలనుంది.
ఆదరించి గౌరవించే నాటి సంస్కృతికి పూర్తి విరుద్దంగా నేటి తరం నర్తిస్తుంది.
అందుకేనేమో! తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవడం మానేశరు.
ఎవరికి వారే యమునా తీరే అయి దేశం ప్రగతి సాదిస్తోంది.
అందుకే "దేవుడా రక్షించు నా దేశాన్ని "మోడర్న్ కల్చర్" అనే పెను ప్రమాదం నుండి"
అని మరోసారి వేడుకుంటున్నాను.

తెలుగు గొప్పతనం!

చూశావా సోదరా!
తెలుగు గొప్పతనం.
రాయిని సైతం రత్నం మారుస్తుంది.
సముద్రంలా నదులన్నింటినీ
కలుపుకుని గంభీరంగా ఉంటుంది.
దిశాలు చూస్తే గాని తెలియదు
ఏ నీరు ఏ నదిదో,
నిఘంటువులు వెతికితే గాని తెలియదు
ఏ పదం ఏ భాషదో,
మరి దయార్దహృదయం తెలుగుది.
న్నింటినిఈ ఆదరించి,
తమ పోకడలను అద్దుకొని,
విడదీయరని బందం ఏర్పర్చుకుంటుంది.
చూశావా సోదరా!
తెలుగు హృదయం.
అది వెన్న కన్నా మెత్తన.
అన్య భాషల పదాలున్నా
ఏకత్వం ప్రదర్శించే ఉన్నత తత్వం తెలుగుది.

ఆ దేవుడి ప్రతిరూపం!

మానవ జన్మ డేవుడిచ్చిన వరం.
తలుచుకుంటే చేయగలవు సార్థకం.
మనిషి దేవుడి ప్రతిరూపం.
అందుకే కావాలి నీవందరికీ ఆదర్శం.

గతాన్ని తలుచుకుంటూ
భవిష్యత్తుని మరువకు.
గ్రీష్మంలాంటి గతాన్ని వదిలి,
వసంత భావినాహ్వానించు.

ఆశల మొక్కల్ని చిగురింపజేసి
ఆశయ ఫలాలనశ్వాదించు.
కావాలీ జగతికి నీ చైతన్య పథం
అవుతుంది నీ పేరు చరిత్ర పుటల్లొ లిఖితం.

అవరోధాల ముల్లను దాటి,
అంతిమ విజయం సాదించు.
విరబూసిన మల్లెలా
మానవత్వంతో పరిమలించు.

మహాందకారపు మానవలోకంలో
చైత్యన్య స్పూర్తిని ప్రేరేపించు,
ఖండాంతరాలకు నీ ఉనికిని చాటించు!
మనిషి దైవ స్వరూపుడని నిరూపించు
నీవు చేయగలవు నిజం ఆ దేవుడి కలల్ని
అందుకే నీవు అవుతావు ఆ దేవుడి ప్రతిరూపం!

Friday, March 30, 2007

ప్రకృతి అందాలు!

ప్రకృతిలో ప్రతి పూవుకో అందం!
పూవు పూవుకో పరిమళం !
విరిసిన పూదోటలాంటినీ సొగసు జూచి
తన్మయత్వంతో నన్ను నేను మరిచి
స్వర్గంలో విహరించి
ప్రకృతిలో లీనమయ్యా!

పచ్చిమట్ల ముచ్చట్లు

ఆ: ధనము యెంత వున్న దానంబు సేయకా
దాచి యుంచు వాడు దాతగాడు
విద్య కలిగి యుంటె విద్వాంసుడవడురా
పచ్చిమట్ల మాట పసిడి మూట

Monday, March 5, 2007

తెలుగుభాష

చూశావా సోదరా!తెలుగు భాష గొప్పతనం.
అన్ని భాషలను కలుపుకునే
ఆత్మీయ హృదయం తెలుగుది.
రాయిని సైతం రత్నంలా మారుస్తుంది.
సాగరంలా నదులన్నిటినీ Align Center
మలో ఐక్యం చేసుకుంటుంది.
దిశలు చూస్తేగాని తెలియదు
ఏ నీరు ఏ నదిదో,
నిఘంటువులు వెతికితే గాని తెలియదు
ఏ పదం ఏ భాషదో,
మరీ దయార్ద హృదయం తెలుగుది
అన్నిటిని చేరదీసి
తమ రూపులు దిద్దుకొని
విడదీయరాని బంధం ఏర్పర్చుకుంటుంది.
అన్నింటిని తమలో దాచుకొని
ఏకత్వం ప్రదర్సిస్తుంది.
చూశావా సోదరా!
తెలుగు హృదయంఎంత మెత్తన.

తెలంగాణ వెలుగు

వెలుగుల నిలయమ్ము వీర తెలగణమ్ము
అందు గాంచు తమము అన్ని యెడల
దివ్వెలు వెలుగునిట దివ్య తేజమ్ముగా
దాని కింద తమము దాగి యుండు