వేకువ జామున మొదలు
మిసిరాత్రుల మేళనం వరకు
అను నిత్యం ప్రకృతితో
ప్రతి స్పందించే నీవు ...
మాతృప్రేమను మరువలేక
ప్రకృతి ఒడిలో శయనించావా...!
నిరంతరం శ్రమించే నీవు
ఆదమరిచి ఆకులపై
నిద్రించావా...!
నిత్యం దోబూచులాడె
ఆ పక్షుల కిల కిల రాగాలు వింటూ
వాటితో శృతి కలిపేందుకు
సాగిపోయావా...!
పిల్ల తెమ్మరల
ఈల పాటలు వింటూ
చేదు జీవితపు కలతలు మరిచి
తన్మయత్వంతో తరలిపోయావా...!
కటిక నేలపై కాలుజాపే నిన్ను
మత్త కోయిలలు మత్తుగా జోలపాడి
పచ్చని ప్రకృతమ్మ
వెచ్చని పొత్తిళ్ళలో నిద్రబుచ్చాయా...!
నిత్యం నీవు కదలాడే
పంటచేలోని ప్రతి మొక్క
వెర్రిగా నను ప్రశ్నిస్తుంది
నీ జాడ తెలుసుకోమని....!
పిల్లగాలి మెల్లగా
గేళి చేస్తుంది నను
నీవిప్పుడు అనాథవని ....!
తెలియదు వాటికి నిజం
చిగురించే ప్రతి మొక్కలో
నీ సున్నితపు మనస్సు,
వికసించే ప్రతి పూవులో
నీ చిరునవ్వులు దర్శిస్తున్నాని ...!
అందుకే....
ప్రకృతిని చూస్తే
ఒకింత ప్రేమ,
రెండింతలు ఈర్శతో
మదన పడుతుంటాను.
నిను ఒడిలోకి చేర్చుకొని
సేదతీరుస్తున్నందుకు...!
మానుండి దూరం జేసి
మాయ జేసినందుకు ...!
అయినా....
ప్రకృతిని చూస్తే పరవశించి పోతాను
నీవు దానిలో లీనమైనందుకు,
నిత్యం దానిలో వెతుకుతుంటాను
నీ ఆప్యాయత దొరుకుతుందేమోనని !
వికసించే వెన్నెలకై వేచి చూస్తాను
నీ రూపు దర్శనమిస్తుందేమోనని...!
(మానాన్న గారు స్వర్గీయ పచిమట్ల లచ్చయ్యగౌడ్ గారి ఙాపకార్థం)
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చాలా బాగుంది.మీ నాన్నగారికిది ఘన నివాళి.
Post a Comment