Sunday, April 30, 2023

కోతినాడించే గారడివాని చిత్రంపై సీసపద్యం

 సీసపద్యం


కోతిబట్టుకుతెచ్చి కొత్తపుట్టము గట్టి

కన్నకొడుకువలెను గాంచునతడు


అల్లరంతయుమాన్పి ఆటలెన్నోనేర్పి

జనముతోడనునిచె వనమువీడి


కర్రబుచ్చుకమిగుల గష్టపెట్టుటగాదు

మంచిబుద్ధులతోడ మించజేసె


సొంతబిడ్డలకన్న కొంతయెక్కువజూచు

వేలుబట్టినడుపు వెంటదిప్పు



బతుకు దెరువుకైతాను పరిత పించు

జేయుటెరుగడు పాపము జీవహింస

కోతి నాడించుటన్నది కూటి కొరకె

దాని యాటతోనెఘనత దక్కుతనకు


పచ్చిమట్ల రాజశేఖర్


Saturday, April 22, 2023

చెట్టు చెలిమి

 పచ్చ నాకు తోడ హెచ్చుపె ర్గినచెట్టు

పక్షి జాతికంత వాస మయ్యె

కొమ్మరెమ్మలయ్యి కొలువు దీరినచెట్టు

జంతు జాతి కంత ఛాయ బంచె

Tuesday, April 18, 2023

సేదదీర్చే చెట్టు

 మొక్కనాటినుండి మొగులంట బెరుగుతూ 

విపులంగ లతలెల్ల విస్తరించె


నీరుబోయుకొలది నింగివై పుకెదిగి

పచ్చనా కులనెల్ల పరువదొడగె


పక్షమై చిగురించి వృక్షమై చెలువొంది

పక్షిజాతులకంత వాసమొసగె


పెరిగిపె రిగితాను పెద్దవృ క్షమ్మయి

జంతుకోటికిబంచె చలువఛాయ


(చెట్టుబెరుగుచుండు చెలగివి జృంభించి)

నిలువతలమునీయ నీడనిచ్చుటెగాదు

చెట్టుబెరిగి జనుల సేదదీర్చు

తన్నుతానుబెరిగి తనపరమ్మెంచక

పంచజేరు జనుల ఫలమునిచ్చు

Sunday, April 16, 2023

నానీలు

1.

పేదరికమూ

పెద్దగురువే

ఎదురీదుట

నేర్పుతుందిగా


2.

సమస్యలు

సానబెడుతున్నయి

బతుకు వజ్రం

మెరుసిపోవాలని


3.

గూడు

సిన్నవోయింది

రెక్కలొచ్చిన

పక్షులు రావడం లేదని


4.

హలము 

హలాహలం వర్షిస్తుంది

వడ్డించిన విస్తర్లను

మొలిపించేందుకు

5.

కవికులం

గులామయ్యింది

వంతవాడుడె

కవిత్వమయ్యింది

6.

రైతు 

బురద గాలిస్తుండు

అన్నపు గింజల

ఆవిష్కరణ కోసం

Friday, April 14, 2023

నాన్న యెదపై నిద్రించిన పాప (చిత్రంపై పద్యం)


సీసపద్యం:

ఉల్లాస  మొసగెడు ద్యానమ క్కరలేదు

    సౌరులొ ల్కుసుమవ ల్లరులులేవు


పట్టుప రుపులతో పడకల క్కరలేదు

          మెత్తని దిండులు పొత్తులేదు


చేరిసే వలుజేయ చెలియల క్కరలేదు

       వందిమా గదులతో పొందులేదు


జోకొడ్తు పాడేటి జోలలక్కరలేదు

    వింజామ రలులేని వెలితిలేదు  


నాన్న తనువె నాకు నాజూకు మంచమై

ఊపి రిగతి తీరు జోల లయ్యె

గుండెలయల దరువు గుట్టుగా జోకొట్ట

శేషసాయితీరు సేదదీరె