Sunday, March 25, 2018

రామస్తుతి

1.
అల్లారు ముద్దుగా నలరారు రామయ్య
 ఆటపాటలయందు మేటి గుండె
పసిడిప్రా యములోనె పరిపరి విధముల
అస్త్ర శస్త్రములందు నారి తేరె
విశ్వమిత్రునివెంట విధినిర్వ హణముకై
అడవుల కే గెనా బాలకుండు
యాగరక్షణమున తాగెమున్ జూపించి
మారీచ సుభహులన్ మట్టుబెట్టె

లోక కళ్య ణమ్శు లోగుట్టు గాతాను
నాశ నమొన రించె నసుర మూక
జగతి హితము గోరి జనులను బాలించ
రామ చంద్రు నంటి రాజు గలడె

2.
విశ్వామి త్రునిమాట విమల మదినిదాల్చి
జగద్రక్ష కుడుజేరె జనకు నిల్లు
స్వయంవ రమ్మునన్ సావధా నముతోడ
విల్లుగై కొనిగట్టె వింటి నారి
దర్పమ్ము నన్ తాను ధనుసునె క్కువెట్టి
శివధనుస్సునువిర్చి సీత నొందె
గురువునా జ్ఞలతాను శిరసావ హించుతూ
అయోధ్య పురికేగె రాఘవుండు

తల్లిదం డ్రులమొక్కి తనదుభ క్తినిజూపి
ప్రగతి మార్గమదని జగతి చాటె
జగతి హితము గోరి జనులను బాలించ
రామ చంద్రు నంటి రాజు గలడె


రాముడు



కష్ట సుఖము లందు కలిమి లేములయందు
పాటి దప్ప కుండ పాట్లు వడుతు
జనహితము గోరి జగతిని బాలించు
రామచంద్రు నంటి రాజుగలడె

Saturday, March 24, 2018

చైతన్యశీలము



ఊర చెరువు జూడ నున్నకా డనెయుండు
చేరు గమ్య ములను బారు వాగు
చేతనత్వమున్న చేకూరు ఫలితముల్
పచ్చిమట్లమాట పసిడిమూట

సంతృప్తే సంపద



సంప దెంతొ యుండి సంతృప్తి లేకున్న
నరక ప్రాయ మౌను  నరుని బ్రతుకు
సంపద లవి యేవి సంతృప్తి నిన్మించి
పచ్చిమట్ల మాట పసిడిమూట

Friday, March 23, 2018

విలేకరి

అనుక్షణం ప్రజారక్షణకై పరితపించే
కలంయోధులు
అన్యాయాన్నెదిరించే
ధర్మవీరులు
ప్రజలను సన్మార్గంలో
నడిపించు సామాజిక వేత్తలు
అణగారిన వర్గాల ఆత్మబంధువులు
పత్రికా విలేకరులు

Thursday, March 22, 2018

పత్రికలు

పత్రికలు
అక్షరవిత్తులు నాటిన కేధారాలు
అరవిరిసిన సుమ సౌరభాలు
పాఠకుల మదిలో మెదిలే
ఆలోచనా తరంగాలు
సామ్యవాదాన్ని పంచే
ప్రజాస్వామ్య వీచికలు

కష్టజీవుల వ్యథలు వినిపించు
శ్రమజీవుల గొంతుకలు
యదార్థాన్ని ఆవిష్కరించే
సమాజ ప్రతిబింబాలు
జడత్వాన్ని పారద్రోలే
చైతన్య ప్రదీపికలు

సమసమాజ స్థాపనకై సాగే
విశ్వమానవ గీతికలు
చీకట్లను చీల్చి
వెలుగు ప్రసరించే వెన్నెల కిరణాలు!

ప్రజా కవచం

జగతి నావహించిన
చీకట్లను చీల్చుటకు
ఉషోదయమై ఉదయించింది పత్రిక

దావానలమై వ్యాపించిన
మూఢనమ్మకాల ముక్కువిండి
మతోన్మాద శక్తుల మదమనిచి
చాంధసాచారాలను చర్నకోలలై తరిమి
సామాజిక రుగ్మతలను సమూలంగా బాపి
సామాన్య ప్రజల శ్రేయోభిలాషియై వర్దిల్లాలి

పాలకుల పంచనజేరి ప్రజల వంచించక
స్వయం పోషకాలై యెదగాలి
సదా ప్రజాశ్రేయస్సుకై పాటుపడాలి

చాపకింద నీరులా సాంతం వ్యాపిస్తున్న
అసాంఘీక శక్తుల నంతమొందించి
శాంతి స్థాపన ధ్యేయంగా సాగిపోవాలి

మసిబూసి మారేడుకాయ జేసెడు
నయవంచకుల మోసాలను
పాలకు పాలు నీళ్లకు నీళ్లుగ
విడమరిచి చూపే హంసముక్కై వెలగాలి

ప్రభుత్వాన్ని ప్రజల ముందుంచడమెగాక
సమాజాన్ని ప్రతిబింబించాలి
జనం నాడి వినిపించాలి
నిజాలను నిగ్గుదేల్చాలి
ప్రభుత్వానికి ప్రజకు నడుమ
వారధియై విలసిల్లాలి పత్రిక !
ప్రజకు రక్షణ కవచమై మెలగాలి పత్రిక !!

Wednesday, March 21, 2018

కవిత్వ మంటే ?

మనోవీధిలో గాంచిన దృశ్యమాలికలను
సుమధుర భావాలతో
 సుధామయ  సుందర వర్ణనలతో
పాఠకలోకానికందించడం కవిధర్మం
కవి కల్పనలు అద్వితీయం


కవ్వించేది కవనం
నవ్వించేది కవనం
ఉహల్లో విహరింపజేసి
మనసును రాగరంజిత మొనర్చేది కవనం

కవి అపర బ్రహ్మ
ఊహల్లో  విహరింగలడు
ఉత్తమ సృష్టి గావించగలడు
మానసికానందం దాపున
గురుతర బాధ్యత దాగివుంది
కవి కవితా సేద్యంచేయాలి
సాగర లోతుల్ని శోధించాలి
మంచిముత్యపు కవితామాలలందించాలి
రాసి కన్నా మిగుల వాసి గావాలె
పఠితను నడిపించి
నవరస భరిత మొనర్చి
ఆశించినదందించేది కవిత్వం

కవిత్వమంటే
సమాజాన్ని ప్రతిబింబించేది !
పాలకులను ప్రశ్నించేది !
పాఠకుల నాలోచింప జేసేది !
పరిపరి విధాల శోధించి
సమస్యలను సాధించి చూపేది !
భగవంతుని సాక్షాత్కరించేది !
సంఘాన్ని ధర్మ మార్గాన నడిపించేది !



Tuesday, March 20, 2018

విత్తుల పొత్తము

అనంత అశేష విశాల
వినీలాకాశపు పొత్తములో
కవికలహాలముతో జల్లిన
నక్షత్రాల విత్తులు అక్షరాలు.

పుడమి శుష్క పొరల్లో
నిద్రాణమైైన విత్తులకు
పాఠకుని నాలుక తడితగిలిన నాడు
మట్టిని పెకిలించుకొని అంకురించి
అనంత ఆలోచనలకు ఆయువుపోసి
అద్వితీయ అపురూప సృష్టికి
అంకురార్పణ చేస్తుంది !


కారునలుపు కమ్మిన మేదినిపై
మిణుగురులై  మెరిసే వర్ణాలు
కొంగ్రొత్త వెలుగులు జిమ్ముతూ
మానవ మస్తిష్కంలో
జ్ఞానపు దొంతరలు పేరుస్తూ
భవితకు బాటలు వేస్తుంది పుస్తకం !
సృష్టికి ప్రతి సృష్టిగావించి
విశ్వనరునిగ విహరింపజేస్తుంది పుస్తకం !!





Monday, March 19, 2018

నాలోని నీవు

చెలీ !
నా మనసు కాన్వాసుపై
నీబొమ్మ గీసుకొని
నాశ్వాసలో సగం నీకు పంచి
నాలోని నీకు ప్రాణంపోసి
నీవే నేనై బ్రతుకుతున్న !

నీవు నాదానవని యెంచి
కుంచె నీకందించాను ప్రియా!
మనవైన మధుర స్మృతుల
భావచిత్రాలు పొదుగుతావని
నాలోని నీ చిత్రానికి నిజరూపు నిస్తావనీ
 చూడచక్కని సుందర దృశ్యాల్ని చిత్రించి
పరవశంతోపులకిస్తావో ?
నీలోని అలలై ఎగిసే భావాలను
పరిపూర్తి గావించి ప్రపుల్ల మొనరుస్తావో ?
సజీవ చిత్రాలను చెరిపి
 తడిలేని   ఎడారి సృష్టిస్తావో ?

Sunday, March 18, 2018

విళంభికి స్వాగతం (ఉగాదికి స్వాగతం)



తనుభారము తాలలేక
తరువులన్ని ఆకులురాల్చి
మోడులోలె గనవడుతున్న
ప్రకృతిని జూసి పరితపించి
చైత్ర రథమెక్కిన
ఋతురాజు వసంతుడు
మాయజేసెనో లేక
అమృతబిందువులే చిలుకరించెనో గాని
తలంటు స్నానం జేసి
తలారబెట్టుకుంటున్నట్టు
నిరాడంబరంగా నిలబడ్డ తరువులన్ని
నిరాశ నిండా కూరుకుపోయిన బతుకుల్లో
కొత్త ఆశలు చిగురించినట్టు
నూత్న వధువుకు  నగిసీలు దిద్ది
ఆభరణాలు తొడిగి అలంకరించినట్టు
తరులతలన్ని తనువణువణువూ చిగురించి
ప్రకృతికి పచ్చల చీరగట్టు
ముద్దుగ ముస్తాబయ్యింది

చైత్రమన్మథుడు మంత్రమేమి వేసేనోగాని
విరజాజులు విరిసిన లతలు
వింజామరలై వీసిన
మలయమారుత మాయలో
తనువణువణువు పులకించి  మైమరిసిపోయింది

అరవిరిసిన కిసలయమ్ముల
పరిమలాలను మోసుకొచ్చే పైరగాలి
ప్రాణికోటినంతా  ప్రణయసల్లాపాలతో
సమ్మోహన పరుస్తుంది
ఆనంద డోలికల్లో ఓలలాడిస్తుంది !

మావిచిగురులు మల్లెలు
విరగబూసిన వేపలు విరజాజులు
గండుకోయిలలు తీపికూతలు
మావి తోరణాలు మధుర స్మృతులు
 ముంగిట్లో విరిసిన ఇంద్రధనుసులు
పక్షుల కిలకిల రావాలు సమ్మిలితమై
సలలిత సరాగ సంరంభమైవస్తున్న
విళంభికి స్వాగతం !
ఉరకలేసే ఉత్సాహంతో
ఆగమించే ఉగాది స్వాగతం !!




Friday, March 9, 2018

మనిషి గుణము చేత మాహోన్న తుండగు
కలిమి బలిమి చేత నగుట కల్ల
ఎనుము బలిసి నంత ఏనుగె ట్లవునురా
పచ్చిమట్ల మాట పసిడి మూట