తనుభారము తాలలేక
తరువులన్ని ఆకులురాల్చి
మోడులోలె గనవడుతున్న
ప్రకృతిని జూసి పరితపించి
చైత్ర రథమెక్కిన
ఋతురాజు వసంతుడు
మాయజేసెనో లేక
అమృతబిందువులే చిలుకరించెనో గాని
తలంటు స్నానం జేసి
తలారబెట్టుకుంటున్నట్టు
నిరాడంబరంగా నిలబడ్డ తరువులన్ని
నిరాశ నిండా కూరుకుపోయిన బతుకుల్లో
కొత్త ఆశలు చిగురించినట్టు
నూత్న వధువుకు నగిసీలు దిద్ది
ఆభరణాలు తొడిగి అలంకరించినట్టు
తరులతలన్ని తనువణువణువూ చిగురించి
ప్రకృతికి పచ్చల చీరగట్టు
ముద్దుగ ముస్తాబయ్యింది
చైత్రమన్మథుడు మంత్రమేమి వేసేనోగాని
విరజాజులు విరిసిన లతలు
వింజామరలై వీసిన
మలయమారుత మాయలో
తనువణువణువు పులకించి మైమరిసిపోయింది
అరవిరిసిన కిసలయమ్ముల
పరిమలాలను మోసుకొచ్చే పైరగాలి
ప్రాణికోటినంతా ప్రణయసల్లాపాలతో
సమ్మోహన పరుస్తుంది
ఆనంద డోలికల్లో ఓలలాడిస్తుంది !
మావిచిగురులు మల్లెలు
విరగబూసిన వేపలు విరజాజులు
గండుకోయిలలు తీపికూతలు
మావి తోరణాలు మధుర స్మృతులు
ముంగిట్లో విరిసిన ఇంద్రధనుసులు
పక్షుల కిలకిల రావాలు సమ్మిలితమై
సలలిత సరాగ సంరంభమైవస్తున్న
విళంభికి స్వాగతం !
ఉరకలేసే ఉత్సాహంతో
ఆగమించే ఉగాది స్వాగతం !!
No comments:
Post a Comment