Friday, November 24, 2017

ముళ్ల బాట

మది నిండ మమతలు
యెదనిండ ప్రేమలతో
హృది నిండ మానవతా
పరిమళాలు వెల్లివిరిసి
విశ్వనరుడై విలసిల్లిన
నాటి మనిషి నేడు కానరాడు

పొద్దు వొడిసిననుండి పొద్దు గూకె దాక
నిరంతరం పోటీపడి గడిపే
ఉరుకులు పరుగుల జీవితం
కొండను దవ్వితే ఎలుక ఫలితం
నిరాశ నిట్టూర్పులే నిత్యదర్శనం !

నాడు దుప్పటి తీసి దేవుని ప్రతిమలు జూసే జనం
నేడు  మూడు ముళ్లు ముచ్చటగ కదిలే
గోడగడియారం వంక గోసగ జూసి
ముళ్లతోటి కాళ్లు కదిపి తెగ మురిసిపోతుండు!

పొద్దు తోటి సద్దు చేయక కదులిన నాడు
పొట్ట కూటికొరకు పొరలని మనిషి
నేడు రాత్రనక పగలనక రాటోలె దిరిగినా
కోరికలు దీరక గోసపడుతుండు

కాలంతోటి కాలుగలిపి
నిత్య చైతన్యముగ నిలువెల్ల శ్రమించినా
ఆశ చావదు ఆకలి తీరదు!
అయినా !
అభీప్సితం నెరవేరక అహరహం పరితపిస్తూ
 అలసి సొలసి ఆదమరిస్తే
హఠాత్తుగ  పెద్ద ముళ్లాగి పోతుంది
గడియారం మూలవడుతుంది
బతుకుబండి చతికిల బడుతుంది

తాటిచెట్టు

ఇనుప స్తంభపు కొన చిగురించి నట్టు
రాతి శిల శిరమున పచ్చనాకులు మొలిసినట్టు
మొగులంట బెరిగిన గర్వపడక
తనువణువణువు కరుణ నిండిన 
కరుణామయి తాటిచెట్టు !

పోతులూరి కాలజ్ఞానమునకు కాగితమ్మందించి
తాళ్లపాక కృతులకు తాటాకు ప్రతులొసగి
సకల శాస్త్రములకు సాకారమై నిలిచి
తరతరాల చరితకు తాళపత్రములందించిన
ధన్యజీవి తాటిచెట్టు !

సాటి మనిషి పడే గోస జూడలేక
ఎనగర్రగా  ఇల్లు కెన్నుపూసయితది
ఆసమై గూటికి ఆసరా గుండి
నిట్టాడుగా తాడు గుడిసె నిలబెడుతది
ఉర్వకుండా కప్పు కమ్మలనందించి
నిలువెల్ల నర్పించి నిలువ నీడనిచ్చు
నిస్వార్థ జీవి తాటిచెట్టు !

వాగుదాటుటకు వంతెన నయినది
చెరువులల్ల పడవలయి నది
ఊటబావులకు దోనెనందించింది
మానవ మనుగడను మనసార కాంక్షించె
పనిముట్ల నందించిన    పరోపకారి తాటిచెట్టు !

విలువనన పాత్రల చెలువ జూడకుండ
మట్టి పాత్రల నెత్తి చుట్టు గట్టుకోని
సుధామయమైనట్టి సురపాన మందించి
ఆబాల గోపాలము నాదమరిచి ఓలలాడించు
మోహినీమూర్తి తాటిచెట్టు !

పొరక పొదిగి జనులు తడక గట్టుకుంటే
మట్ట జీరి తాటి నార పొట్టెనంస్తది
చేదబావికి చెరోదిక్కు నిలిచి
గిరక దూలమయి నీళ్లు సేదిస్తది
పిడుగువడి తాటి మొగి రాలిపోయినా
పొట్టనత పిట్టగూళ్ల కర్పించే
త్యాగశీలి తాటిచెట్టు !

మట్టలు గొరికి ఉడుతలు గూడు వెట్టినా
వడ్ల పిట్ట మొద్దుకు తూట్లు వొడిసినా
కలత పడి కసురు కోక
తాటికమ్మ దొండ పండ్లు గాసినట్టు
రామచిలుకల గూడి రాగమాలపించు
ఆత్మీయాదరువు తాటిచెట్టు !

తనకు తాను మొలచి తరతరాలు నిలిచి
కులవృక్షమై పేరు గుర్తింపు నొందినా
అన్ని వృత్తులకు ఆసరయి ఉంటది
అన్ని చెట్లను జంపి తానొక్కటే పెరిగే
మర్రి చెట్టు ఒడిల పురుడు వోసుకొని
అంచలం చలుగ  ఆకసమున కెగిసే
ఆశాజీవి తాటిచెట్టు !

కులమతాల కుళ్ళు దరిజేరనీకుండ
కనుమూసి నోళ్లపయి కరుణ గురిపించి
పచ్చి కమ్మలు నిచ్చి పరుపు తానవుతది
రక్త సంబంధీకులు బంధు జనుల తోడ
పాడెతో పాటు కాటి వరకచ్చే
 ఆత్మబంధువు తాటిచెట్టు !

Wednesday, November 22, 2017

తెలుగు మహాసభలు

ఆంగ్లమాద్యమాన భాషను బలిజేసి
పాండితీవరులను పాతి పెట్టి
వైభవముగ తెలుగు సభలుజ రుపుటకు
అవని జనుల కాహ్వ నములు బంపె

Tuesday, November 21, 2017

సొగసు లొసగులు

ప్రకృతి పిదప అందమైనది స్త్రీ!
అందాన్ని అతిశయంగ అలంకరించి
అందరి మన్ననలందేది స్త్రీ!
 తరతరాల మన సంప్రదాయపు
వస్త్రాలంకరణల అందం ద్విగుణీకృతమై
దినదిన ప్రవర్దమానమై దివ్యకాంతి నొసగు
నిండు చందమామలా  కనువిందు జేయలె గాని
కృష్ణపక్షపు జాబిలివయి
అంతకంతకు అంతరించిన
సినీవాలి లాంటి సితుకు గుడ్డలతో
నలుగురిలో నవులపాలు గాకు తల్లీ!
నాగుబామును చూసి దూరముడ
డాలె గాని
నాదసరమూది నాట్యమాడించవలదు
కంఠమాగిన మనలనది కాటేయక మానదు చెల్లీ!


Thursday, November 16, 2017

శ్రమతత్వం(గజల్ )

వెక్కి వెక్కి ఏడ్వనిదే పలుకులొంట బట్టవులే

పదేపదే పడిపోనిదె నిలబడి అడుగేయవులే
పరిశ్రమయె ఫలితాలను సాధించునని మరువక
అనునిత్యము సాధనతో ఆకశమునకెదిగి చూడు

కష్టపడక కూర్చుంటే కలుగు ఫలితమదియేమి
నిరంతరం నిరీక్షణలో నీకు ఒరిగినదియేమి
మట్టి పొరలనొక్కొక్కటి తొలుచుకుంటు ముందు కెళ్ళి
అమత మయ జలదారలు అందిపుచ్చుకొని చూడు

చెట్టుకున్న ఫలములేవి చేరిరావు నీ దరకు
కోరుకున్న సుఖములన్ని తనకుతానె దరిచేరవు
విధిరాతని నిట్టూర్చుతు దేవుని నిందించకుండ
అణువణువుగ ప్రయత్నించి దరి చేరే దారిచూడు


తలచినంతనే మనుషుల తలరాతలు మారవులే
చేరి కూరుచుండినంత శిఖరాగ్రము జేరవులే
ఆంతర్యము తెలుసుకొని అడుగుఅడుగు కదిలినపుడే
విజయము నీ బానిసయై వినమ్రిల్లునది చూడుఘ

పారెయేరు ఎప్పుడైన ప్రాంతాలను దాటుతుంది
నిలకడగుండే నీరే కుళ్లి కంపుగొడుతుంది
జడత్వ చైతన్య గుణము కవిశేఖరుడెరుగునులే
అలసత్వము నొదిలిపెట్టి అడుగు ముందుకేసి చూడు

Tuesday, November 14, 2017

కళదప్పిన ఇల్లు


పచ్చని తాటాకులతో
కంకబొంగులు పంజరపొరుకలతో
అల్లుకున్న పిట్ట గూడోలె
అదంగున్న మా యిల్లు !

పచ్చని ప్రకతిని తలకెత్తుకుని
రుతువు కనుకూలంగ రూపుమార్చి
మండుటెండల్లో మంచును
నిండు చల్లోన కరి వెచ్చదనాన్ని
పంచేటి మట్టిగోడలు
అరుగు యిల్లు సాయవానులను
అంతఃపురమున దాచిన
గిజిగాని గూడు మా యిల్లు !

ఇంటినిండ పిల్లలు
అల్లరి అరుపులతో చిలిపి చేష్టలతో
ఊరవిస్కలు కోడిపిల్లలతో
నిత్య సందడిగుండే నా యిల్లు !

చుట్టాలు బందువులు 
సుట్టు సోపతిగాండ్లు
సబ్బండ వర్ణాల సాదరాభిమానాలు
బుద్ది సెప్పే వాళ్లు భుజంతట్టే వాళ్లు
ఆప్యాయతానురాగాల అపూర్వ లోగిలి మా యిల్లు !

మూడునాల్గు తరాలు
శాఖోపశాఖలై విలసిల్లిన మొదల్లు
ముదిమి ముసిరి
పండుటాకులై వంగి
చిరుదరహాసపు చిగురుటాకులతో
అల్లుకున్న అనుబంధాల  సాలెగూడు మా యిల్లు!


ఇప్పుడు పండుగ పబ్బాలకు
వచ్చి పోయే పిల్లపాపలతో
ఉద్యోగాలకై వలసవోయిన కొడుకులతో
ఏడాదికోసారి తీరప్రాంతానికి
తరలివచ్చే పక్షులోలె
అడపదడప ఇంటికొచ్చే
అరుదైన అనుబంధాలకై
ఎదిరిచూసి ఎదురు చూసి
కళ్లు కాంతివిహీనమై మెరుస్తున్నయి
యిల్లు కళ దప్పి కనవడుతుంది !