Tuesday, June 27, 2023

గౌడన్న గాథ (పాట)

పొట్టకూటికొరకు చెట్లెక్కుతవు గౌడ  పాణంతో చెలగాట మాడుతుంటవు

ఒంట్లసత్తువంత ఒక్కదగ్గరజేర్చి ఉడుతోలె అంతెత్తుకెగబాకుతవు

యాలి మెడలో తాళి చల్లగుంటె గౌడ దివినుంచి ఈభువికి దిగివస్తవూ

గాలిలో దీపమై వేలాడుతవు గౌడ పూటకొక్కసారి పుడుతుంటవూ

దినదినగండమే నీజీవితం ॥2॥

ఆతల్లి దీవెనలె నీకున్న వరమూ

గౌడన్న నీగాథ కష్టాలనెలవూ . . ఊ

గౌడన్న నీవెతలు కన్నీటి కొలనూ . .ఊ..


నీగుజితాడులో బలమెంత యున్నదో మొగులుతో ముచ్చట్లు పెట్టస్తవూ

నీగీతకత్తిల మహిమయేమున్నదో అమృతాన్ని జనులకందిస్తవూ

(పాణాన్ని ఫణంగా పెట్టెక్కుతవు)

మోకుముత్తాదుంటే మీదుంటవూ॥2॥ 

గౌడ పట్టుదప్పితే నేలమీదుంటవూ

గౌడన్న నీగాథ కష్టాలనెలవు

గౌడన్న నీవెతలు కన్నీటి కొలను


సబ్బండ వర్ణాలు సామంతులే నీకు సాలెల్ల కూలిపనిజేస్తుంటవు

పొద్దువొడువకముందు పొలిమేరదాటి ఆకసాని కాసువోస్తుంటవూ

ఊరంతచుట్టాలె గౌడన్నకు ॥2॥

ఉండ తలమూ లేదు గౌడన్నకూ

గౌడన్న నీగాథ కష్టాలనెలవూ ఊ  ఊ  

గౌడన్న నీవెతలు కన్నీటి కొలనూ . . ఊ . 


మబ్బుతునుకను దెచ్చి గూఢలొట్టీల వెట్టి

నురుగులుగక్కేటి మధువు సృష్టించుతవు 

తాటివనమునంత తాతలాస్తిగయెంచి రాజువై రాయిపై గూర్చుంటవూ

ఉన్నోడులేనోడు ఎవ్వరచ్చినగాని ఎచ్చుతచ్చుల్లేక పలుకరిస్తుంటవూ

దారొంటవోయేటి పాదచారులకంత॥2॥

దాపునిల్చీ దూపదీరుస్తవూ

గౌడన్న నీగాథ కష్టాలనెలవు

గౌడన్న నీవెతలు కన్నీటి కొలనూ 


పోశమ్మ మైసమ్మ తల్లి పోలేరమ్మ 

గ్రామదేవత  కల్లుసాకనందిస్తవూ

సావుపుట్టుకల్ల సాయమందిస్తవూ

కావడై కల్లాల కాడ గనవడ్తవూ


నీముందు వెనకాల నిండుకుండలున్నా॥2॥

నీబతుకు నిలువెల్ల సిల్లుకుండరన్నా

గౌడన్న నీగాథ కష్టాలనెలవూ ఊ  ఊ  

గౌడన్న నీవెతలు కన్నీటి కొలనూ . . ఊ . 

Wednesday, June 7, 2023

వెలుగుల తెలగాణ (రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా)

 రాష్ట్రమొస్తదని యనుకోలే

రారాజుగ (రాజోలె) బతుకుత మనుకోలే

తరతరాల మన బానిసత్వమూ తరలిపోతదని యనుకోలే


చెరువులు నిండుత యనుకోలే

పంటలుపండుతయనుకోలే

నెర్రెలుబాసిన ఒర్రెలువాగులు నిండుగ బారుతయనుకోలే


నిమ్నజాతులకు దన్నుగనిలిచీ

ప్రగతిపథమ్ముకు బాటలువేయగ

వెలవెలబోయిన మనకులవృత్తుల

కళకళలాడుతయనుకోలే


 నదులపరుగులకు సంకెళ్లేసీ

ఎత్తిపోతలతో ఎగుసంచేస్తె

మోడువారినా బీడుభూములలొ

బంగారముపండుత దనుకోలే


పేదలబతుకును పెద్దగజేసే

పలుపథకాలకు ఆయువువోయగ

మోడువారినా ధీనులబతుకులు

చిగురులు తొడుగుతయనుకోలే


వేషభాషలను హేళనజేసి

ఆచారమ్ములనవమానించిన

దాయాదులపై దండునుజేసి

మనుగడసాగుతదనుకోలే

మనిషిగ బతుకుత మనుకోలే

Friday, June 2, 2023

పాలకుల పై పద్యం

 ప్రజల సేవ పేర పాలకు లైనోళ్లు

వృద్ధి పథము నందు బుద్ధి నిలుప

కాసు లతిర కాసు గమ్మత్తు లోబడి

ఆశయాలు చచ్చె ఆశ హెచ్చె


పచ్చిమట్ల రాజశేఖర్