Friday, June 16, 2017

నింగికెగసిన సాహితీ కెరటం !

భావకవుల వారసుడయి
భావికవుల మార్గదర్శకుడయి
కొత్తపాతల మేళవింపుగ
మేలిమి కవితలల్లే అభినవ కవితాఝరి !

సమాజ స్థితిగతులకు
సజీవ సాక్షపు రచనలతో
సూటిగ ప్రశ్నించే అభ్యుదయ కవితాదార !

కవనలోకపు యవనికపయి
వెలుగులీనిన వెన్నెలతార
తెలుగు సాహితీ సౌరభాల
దిగంతాల గొనిపోయిన మలయమారుతవీచిక !

సరస సాహితీ ప్రియులను
సుస్వర శబ్ధ మాధుర్య
భావ గాంభీర్య లహరిలో
ఓలలాడించి మురిపించి
మై మరిపించే సమ్మోహన హస్తం !

జనన సామాన్యుడైన జడువక
సాహిత్యపు సారమెరిగి
చిరుప్రాయాది ముదిమి దాక
అలతి అలతి పదాలతో అలవోకగ కవనమల్లి
విశ్వంభరుడవై నిలిచి జ్ఞానపీఠమెక్కినావు
విశ్వ విజ్ఞాన వేదికపై వినువీధిన ప్రకశించావు !

మట్టి మనిషి ఆకాశపు
తత్త్వమంత తెలియజెప్పి
మంటలు మానవుడంటూ
మర్మమంత విడమరిచి
విశ్వగీతి మోగించి విశ్వమంత యెదిగినావు !

ప్రక్రియేదైన ప్రతిభ కనబరిచి
సరసుల రంజింప
సారసకవిత్వమ్మొనర్చిన
జగద్విగ్యాత ఝంఝా మారుతం
సాహితీ వినువీధిన సాగిన
అలుపెరుగని బాటసారి
నిరంతర కవన ఝరి
నిత్య చైతన్యశీలి సింగిరెడ్డి !

సాహితీ మేరునగ శిఖరాగ్రాన
తెలుగు పూలు తురిమిన కవిశేఖరం
నడయాడు స్నిగ్ధ గాంభీర్య మనోహర రూపం
ఆదరాభిమానాల ఆత్మీయరూపం
సింగిరెడ్డి నీ వ్యక్తిత్వం
సాహితీ ప్రియులకు చిరుస్మరణీయం !

            -- రాజశేఖర్ పచ్చిమట్ల
                తెలుగు లెక్చరర్
                 9676666353