Thursday, November 26, 2020

చీకటిరోజులు


అనంతవిశ్వాన్ని

చీకటిదుప్పటి పలుమార్లు కప్పేస్తున్నా

నిరంతరం నిట్టూరుస్తూ

దుర్భరమైన పయనంచేసి

ఆనందకర వెలుగురేఖలకై వేచిచూస్తున్నపుడు


అనువంత నీవు చీకటికో లెక్కా

నీవూ విశ్వంలో ఒకడివైతే 

నీకు భరించే ఓపికుంటే

వెనుకచ్చే వెలుగును చూడు

చీకటిరోజులకు చింతించకు!


కాలగమనంలో ప్రతిప్రాణి

సమస్యలసుడిగుండంలో చిక్కాల్సిందే

గిరికీలు కొట్టాల్సిందే

డక్కాలుముక్కీలు తినాల్సిందే


అంతమాత్రాన అలసట చెందితే

నీబతుకు నిరర్థకమే!

Wednesday, November 25, 2020

ముళ్ల బాట

 


మది నిండ మమతలు

యెదనిండ ప్రేమలు

హృది నిండ మానవతా

పరిమళాలు వెల్లివిరిసి

విశ్వనరుడై విలసిల్లిన

నాటి మనిషి నేడు కానరాడు!


పొద్దు వొడిసిననుండి పొద్దు గూకె దాక

నిరంతరం పోటీపడి గడిపే

ఉరుకులు పరుగుల జీవితం

కొండను దవ్వితే ఎలుక ఫలితం!


దుప్పటి తీసి దేవుని జూసే జనం

మూడు ముళ్లు ముచ్చటగ కదిలే

గోడగడియారం వంక గోసగ జూసి

ముళ్లతోటి కాళ్లు కదిపి మురుస్తుండు!


పొద్దు తోటి సద్దు చేయక కదులినా

పొట్ట కూటికొరకు పొరలని మనిషి

నేడు రాత్రనక పగలనక రాటోలె దిరిగినా

కోరికలు దీరక గోసపడుతుండు!


కాలంతోటి కాలుగలిపి

నిత్య చైతన్యముగ నిలువెల్ల శ్రమించి

ఆశ చావక అలసి సొలసి

హఠాత్తుగ  పెద్ద ముళ్లాగి పోతుంది

బతుకుబండి చతికిల బడుతుంది!


రాజశేఖర్ at 11:29 PM

Wednesday, November 11, 2020

దీపావళి - కైతికాలు

 కష్టాల చీకటి కడతేర్చి

సంతోషపు తారాజువ్వలు

దారిద్ర్యము రూపుమాపి

ధనమొనగూర్చు సిరులతొవ్వలు

వహ్వా! దీపాల వెలుగులు

చీకటిని చీల్చే చురకత్తులు - 1


తేజోవంత ప్రదీపికలు

నువ్వులనూనె దీపాలు

జిల్లెడువత్తుల జిలుగులు

జల్లించుజగతి పాపాలు

వెలుగునిచ్చు దీపం

సర్వపాప హరణం  - 2


ఇళ్లముంగిట వెలిగేటి

పగడపుముక్కు ప్రమిదలు

సూర్యున్ని సాగనంపే

మింటమెరిసే మిణుగురులు

వారెవ్వా తెలుగులోగిళ్లు

మెరుగుజిమ్మే దీపాలవెలుగులు - 3


పొద్దుపొడువక మునుపు

తలంటు స్నానాలు

పొద్దుగూకిన వేళ

గౌరిదేవి వ్రతాలు

వారెవ్వా! దీపావళి

నేలదిగిన తారావళి - 4


గంగస్నానాలు

గౌరమ్మ వ్రతములు

అలికిన ముంగిళ్లు

పరిచినా ముగ్గులు

పల్లెఒడిన పండుగ

మోదమొసగు మెండుగ - 5




Tuesday, November 10, 2020

చిత్ర కైతికాలు

 ఇంతచిన్న బుడ్డోడికి

ఎంతపెద్ద బాధ్యతనో

గుక్కపట్టి నాచెల్లిని

ఊకుంచేదెలాగనో

వారెవ్వా! ఓదేవుడా

నీలీలలు భళా భళా! -52


జానెడంత సొంతకడుపు

నింపుకోను దారిలేదు

చిట్టితల్లి చిన్నికడుపు

నింపుడెట్లొ తెలియలేదు

వారెవ్వా! ఆకలి

ఆమంటలు ఆరనివీ! -53


ఆకలితీర్చడమెగాదు

అరకదున్ను తుందిఅమ్మ

కూనలభారమేగాదు

ఇల్లునడుపు తుందిఅమ్మ

వారెవ్వా మాతృమూర్తి

నీకుసాటిలేరు జగతి - 54


చిటపటలు చిలిపిచేష్టలు

అలకలూ బుజ్జగింపులు

దినమంతా పడిగాపులు

మురిపించే మునిమాపులు

వారెవ్వా! ఆలుమగలు

అల్లుకుపోయె లతలతోపులు - 55

Sunday, November 8, 2020

చిత్ర పద్యమాలికలు

 నిగనిగలనుజిమ్ము నెమ్మోము నెరజాణ

ఆడునెమలిజూచి ఆదమరచి

అందమైనపింఛ మమరిచేతనుబూని

ముద్దులిడెనదరము మురిసిపోవ