Thursday, April 6, 2017

చెర'బడి'

అప్పుడే పుట్టిన రెక్కలతో
హాయిగా విహరించాలనుకునే
సీతాకోకల్ని
బడి బందదిఖానాలో
బందించారెందుకు నాన్న !

మీ స్థాయికి తగిన
కార్పోరేటు నర్సరీ నెంచుకున్నారు తప్ప
ఆ భారము
నే మోయగలనో లేదో తలంచలేదెందుకు నాన్న !

అక్కడ
రంగురంగుల పూలు లేవు
ఉక్కపోతకు ఉడికి
వాడిన ముఖారవిందాలుతప్ప !
బోసినవ్వులు లేవు
బోసిపోయిన విషన్న వదనాలుతప్ప!

అయినా
చదువుతా నాన్నా
నీ క్కావల్సిన పేరు కోసం
అక్కడే చదువుతాన్నాన్నా

ఆ కాఠిన్యాన్ని తాలలేక
రెక్కలు నలుగుతున్నా
మీ ఆనందం కోసం
నే బడికి వెళ్తా నాన్న !

కాని
నామనసు తెర వెనుకుండి
నా అభివృధ్ధికాటంకమవుతున్న
అఘాతం చూడు నాన్న

అల్లారుముద్దుగా
గోరు ముద్దలు తినిపిస్తూ
అనునిత్యం కనిపించే అమ్మ
వేలు పట్టి నడిపిస్తూ
నడక చూసి మురిసిపోయే నాన్న
 అమాసకో పున్నానికో
అతిథులై వచ్చి
ఆప్యాయంగా మాట్లాడే మాటలు
యాడదంతా తలుచుకుంటూ
మీకోసం చదువుకుంటాలే నాన్న !

నన్ను తలెత్తుకు నిలిపేందుకు
చదివించే చదువుల భారంతో
నే గూనిపోయి నా సరే
నీ నమ్మకం కోసం చదువుతా నాన్న !!