Sunday, October 22, 2017

కళదప్పిన పల్లె

ఒకప్పటి నా పల్లె
ఆకశాన విరిసిన అందాల హరివిల్లు
ఒకప్పటి నా పల్లె
మధురానుభూతుల లతలుగ అల్లిన పొదరిల్లు

పుట్టమన్నలికిన పూరిగుడిసెలు
ముచ్చటగొలిపే మూలభవంతులు
ఆచారపుటలవాట్లు
సంస్కృతి సంప్రదాయాలు
పండుగ పబ్బాలు
పిల్లపాపలతోటి సందడి చేసే పల్లె
నేడు కళదప్పి కనవడుతుంది
వ్యథనంత వినిపిస్తుంది !

తొలికోడి కూతతో తెలవారకమునుపు
వేకువ జామున లేచి వెన్నెల దీపపు వెలుగులో
ఇల్లు వాకిల్లన్ని నున్నంగనూడ్చి
ఆవు పేడతోటి అలికి ముగ్గులు వెట్టి
జాజుతో తీరైనతీనెలు తీర్చి
పెండ్లి కూతురు తీర్గ
ముస్తాబయి మురిసిపోయే నాపల్లె
 నేడు  కాంక్రీటు గుంజలపై
కళాత్మకంగ  పేర్చిన బంగళాలతో
నేడు కళదప్పి కనవడుతుంది
         వ్యథనంత వినిపిస్తుంది !

పొద్దు పొడుపుకు ధీటుగ పొయ్యివెట్టి
నిప్పురాజేసి ఇగురంగ మండించి
మట్టి కడువల్ల వంటజేసి
పొద్దెక్కక ముందు పొలము జేరవోయి
కాలం తోటి కాలు కదిపి కష్టించి
ప్రకతితో మమైకమయి పనిజేసి
చెట్లకింద సేదదీరు  తల్లులతోటి

ఆటగోరు పిల్లల అల్లరరుపులు కేరింతలు
ఆకసాన బారులు దీరిన పక్షుల విన్యాసాలు
దుమ్ములేపుతు  దారొంట నడిచేటి ఆలమందలు
కట్టెవట్టుకొని అదిలిం చే కాపు దొరలు
పాడిపంటలు గొడ్డు గోదలతోటి
సందడిగ కనిపించే నా పల్లె
ప్రాకృతిక మార్పులతొ పక్షులంతరించినయి
ఆలమందల కాళ్లకింద ఛక్రాలు మొలిసి
కభేళాలకు తరలిపోయి శోకిస్తూ
   కళదప్పి కనబడుతుంది నా పల్లె
                           వ్యథ నంత వినిపిస్తుంది!

రెక్కలకింద పిల్లల దాచిన కోడోలే
నిండ మనుషులతో నిండుగ
కళకళలాడు నా పల్లె
చిన్ననాడు చదువుల పేరట
తల్లి ఒడినెడబాసిన బాల్యం
ఉన్నత చదువులు ఉద్యోగాన్వేషణలో
పట్నం గల్లీలల్ల పరుగెడుతున్న యవ్వనం
చేవజచ్చి చేతికర్ర సాయంతో
వణుకుతు వగచే ముదిమి
తనువంతబాకి
చావలేక బ్రతుకలేక సతమతమవుతూ
చిన్ననాడు తన పిల్లలు
యెదపై కదలాడిన నునులేత అడుగులను
ఎదిగే వరకు వెన్నంటి యున్న అనుభూతులను
మనసార తలచుకొని మదనపడుతూ
మూగగా రోదిస్తూ
 కళదప్పి కనవడుతుంది నాపల్లె
               వ్యధనంత వినిపిస్తుంది !

ఆప్యాయతానురాగాల  కాలవాలమై
ఆత్మీయానుబంధాల కాదరువై
పచ్చని ప్రకతికి నిలువెత్తు నిదర్శనమై
సకల జీవాల సమాగమమై
మునుపు నాపల్లె మురిపాల ముల్లె
కుమ్మరి కమ్మరి సాకలి మంగలి
సాలె బెస్తలు సబ్బండ వర్ణాలు
అరమరికలు లేక అన్ని వృత్తులతోడ
సుభిక్షంగా సుస్థిరముగ నుండు నాపల్లె
నేడు కరువు డేగల కాళ్ల కింద
గిలగిల కొట్టుకుంటుంది
బల్లి నాలికెమీద పురుగోలే
బంధీయై బాధ పడుతుంది
తీరొక్క దినుసుతో తీపి ఫలములతో
కొలువు దీరిన పల్లె
నేడు వెలవెల బోయింది

అనుబంధాలు పెనవేసుకున్న పల్లె
నేడు ఆగమై
బతుకు దెరువు కరువై
వలస బాటవట్టి అలసిపోయింది
నింగి నిండ చుక్కలు విరబూసినట్టు
పుడమి నిండ పుట్ల కొలది
ధాన్య రాసులతో తులతూగు నా పల్లె
అన్నమో రామచం ద్రాయని
అలమటిస్తూ
కళదప్పి కనవడుతుంది నాపల్లె
వ్యథనంత వినిపిస్తుంది !

Thursday, October 19, 2017

దీపావళి శోభ

నీవరు దెంచిన న్వెలుగువిరజిమ్ము
          తారలన్ని ధరణి తరలి వచ్చె
నీరాక తోమహి న్నిండిన ట్టిమిగుల
          అంధకరమ్మంత అంత రించె
అవని జనులకున్న బాధలన్నిటబాసి
          ఆనంద భీజముల్ అంకురించె
ఆయురా రోగ్యముల్ అనురాగ మునబంచి
           సుఖశాంతు లనుబంచె సుస్థిరముగ

  • అష్టల క్ష్మి  మీగృ హమునందు నెలవయ్యి
  • సకలశుభము లిలను సంతరించ 
  • దివ్య శోభ గూర్చు దీపాల వెలుగులో
  • దీప వళిల వచ్చె దివ్య ముగను


Thursday, October 5, 2017


అవని పైవెలసిన అన్ని జీవమ్ములు
ఆయు క్రమము కొలది అంతరించు
కవి రవులిరువురిల కలకాల ముందురు
పచ్చిమట్లమాట పసిడి మూట

Wednesday, October 4, 2017

మధ్యతరగతి జీవితం

మధ్యతరగతి మనిషి బతుకు
సాలెగూడులో ఇరుక్కున్న పురుగు
స్తబ్ధంగా ఉండి ప్రశాంతత పొందలేం
పోరాడి బయట పడలేం
ఒక్కో ఒక్కో అర ఛేదించడంలోనే
కాలం కరిగిపోతుంది
జీవితం జీర్ణమవుతుంది

సుఖదుఃఖాల సుందర దృశ్యం జీవితం
ఆరెంటికి మధ్య అడుగు దూరం
కలిమి లేములు కావడి కుండలు
ఒకటుంటే రెండోదుండదు
ఏ ఒకటీ శాశ్వతం గాదు
ఆ రెంటిని అందుకొను తపనలో
ఆవిరవుతుంది జీవితం

ఆహ్లాదాన్నిచ్చే అలలప్రయాణంలో
పైకెగసినపుడు ఆనందపడలేం
పడిపోతున్నందు బాధ పడుతాం తప్ప
 అనునిత్యం  అలలతో పోటీపడి
పైకి రావాలనె పరితపిస్తం
పరిపరి విధాల ఆలోచిస్తం
అందని దానికి అర్రులు చాస్తూ
ఎగిసే కెరట మవ్వాలనె
ఆరాటంలోనే అంతరిస్తుంది  జీవితం

ధనవంతుని జూసి ఈర్ష్య పడుతాం
పేదవాల్లని ఛీదరించుకుంటాం
స్వర్గానికి చేరలేము
నరకంలో నడయాడలేము
ఆ రెండింటి నడుమ ఊగిసలాట
మధ్యతరగతి వృథా ప్రయాస !

మరణమే శరణ్యమా?


మనసు విరిగిందనో
మమత కరువైందనో
కరుణ కనుమరుగైందనో
ప్రేమ విఫలమైందనో
మానవత మాయమైందనో
బాధలు వెరిగినయనో
బతుకు దెరువు గానరావట్లేదనో
చితికి చేరువవుతావా

మాష్టారు తిట్టాడనో
మార్కులు తగ్గాయనో
తల్లిదండ్రులు మందలించారనో
చెలికాల్లు చులకన చేశారనో
పరీక్షలో తప్పామనో
ఫలితాలు మారాయనో
జీవనరంగం లోంచి తప్పుకుంటామా?

జనన మరణాలు
స్వేచ్ఛా విహంగాలు
ఏదీ నీ చేతిలో లేదు
అంతా దైవ సంకల్పం

కష్ట సుఖాలు కావడికుండలు
నిరంతర దోబూచులాటలు
నిత్యం  ఒకటే కనిపిస్తుంది
రెండోది లేదనిపిస్తుంది
ఒకదాని వెంట ఒకటి నడిచొస్తుంది
యథార్థమిది యని తెలియకుంది

మనసును మరుగు పరచు
మబ్బు పరదాలను తొలగించుకొని
ఏదీ శాశ్వతంగాదని తెలుసుకో
వెతలు మాని బతుక నేర్చుకో

జీవితం విలువైనదని
మరణమే శరణ్యం గాదని
జీవిత సత్యం తెలుసుకొని
మనస్థైర్యముతో మనుగడ సాగించాలి
మానవాళికి మార్గదర్శి వవ్వాలి