Sunday, October 22, 2017

కళదప్పిన పల్లె

ఒకప్పటి నా పల్లె
ఆకశాన విరిసిన అందాల హరివిల్లు
ఒకప్పటి నా పల్లె
మధురానుభూతుల లతలుగ అల్లిన పొదరిల్లు

పుట్టమన్నలికిన పూరిగుడిసెలు
ముచ్చటగొలిపే మూలభవంతులు
ఆచారపుటలవాట్లు
సంస్కృతి సంప్రదాయాలు
పండుగ పబ్బాలు
పిల్లపాపలతోటి సందడి చేసే పల్లె
నేడు కళదప్పి కనవడుతుంది
వ్యథనంత వినిపిస్తుంది !

తొలికోడి కూతతో తెలవారకమునుపు
వేకువ జామున లేచి వెన్నెల దీపపు వెలుగులో
ఇల్లు వాకిల్లన్ని నున్నంగనూడ్చి
ఆవు పేడతోటి అలికి ముగ్గులు వెట్టి
జాజుతో తీరైనతీనెలు తీర్చి
పెండ్లి కూతురు తీర్గ
ముస్తాబయి మురిసిపోయే నాపల్లె
 నేడు  కాంక్రీటు గుంజలపై
కళాత్మకంగ  పేర్చిన బంగళాలతో
నేడు కళదప్పి కనవడుతుంది
         వ్యథనంత వినిపిస్తుంది !

పొద్దు పొడుపుకు ధీటుగ పొయ్యివెట్టి
నిప్పురాజేసి ఇగురంగ మండించి
మట్టి కడువల్ల వంటజేసి
పొద్దెక్కక ముందు పొలము జేరవోయి
కాలం తోటి కాలు కదిపి కష్టించి
ప్రకతితో మమైకమయి పనిజేసి
చెట్లకింద సేదదీరు  తల్లులతోటి

ఆటగోరు పిల్లల అల్లరరుపులు కేరింతలు
ఆకసాన బారులు దీరిన పక్షుల విన్యాసాలు
దుమ్ములేపుతు  దారొంట నడిచేటి ఆలమందలు
కట్టెవట్టుకొని అదిలిం చే కాపు దొరలు
పాడిపంటలు గొడ్డు గోదలతోటి
సందడిగ కనిపించే నా పల్లె
ప్రాకృతిక మార్పులతొ పక్షులంతరించినయి
ఆలమందల కాళ్లకింద ఛక్రాలు మొలిసి
కభేళాలకు తరలిపోయి శోకిస్తూ
   కళదప్పి కనబడుతుంది నా పల్లె
                           వ్యథ నంత వినిపిస్తుంది!

రెక్కలకింద పిల్లల దాచిన కోడోలే
నిండ మనుషులతో నిండుగ
కళకళలాడు నా పల్లె
చిన్ననాడు చదువుల పేరట
తల్లి ఒడినెడబాసిన బాల్యం
ఉన్నత చదువులు ఉద్యోగాన్వేషణలో
పట్నం గల్లీలల్ల పరుగెడుతున్న యవ్వనం
చేవజచ్చి చేతికర్ర సాయంతో
వణుకుతు వగచే ముదిమి
తనువంతబాకి
చావలేక బ్రతుకలేక సతమతమవుతూ
చిన్ననాడు తన పిల్లలు
యెదపై కదలాడిన నునులేత అడుగులను
ఎదిగే వరకు వెన్నంటి యున్న అనుభూతులను
మనసార తలచుకొని మదనపడుతూ
మూగగా రోదిస్తూ
 కళదప్పి కనవడుతుంది నాపల్లె
               వ్యధనంత వినిపిస్తుంది !

ఆప్యాయతానురాగాల  కాలవాలమై
ఆత్మీయానుబంధాల కాదరువై
పచ్చని ప్రకతికి నిలువెత్తు నిదర్శనమై
సకల జీవాల సమాగమమై
మునుపు నాపల్లె మురిపాల ముల్లె
కుమ్మరి కమ్మరి సాకలి మంగలి
సాలె బెస్తలు సబ్బండ వర్ణాలు
అరమరికలు లేక అన్ని వృత్తులతోడ
సుభిక్షంగా సుస్థిరముగ నుండు నాపల్లె
నేడు కరువు డేగల కాళ్ల కింద
గిలగిల కొట్టుకుంటుంది
బల్లి నాలికెమీద పురుగోలే
బంధీయై బాధ పడుతుంది
తీరొక్క దినుసుతో తీపి ఫలములతో
కొలువు దీరిన పల్లె
నేడు వెలవెల బోయింది

అనుబంధాలు పెనవేసుకున్న పల్లె
నేడు ఆగమై
బతుకు దెరువు కరువై
వలస బాటవట్టి అలసిపోయింది
నింగి నిండ చుక్కలు విరబూసినట్టు
పుడమి నిండ పుట్ల కొలది
ధాన్య రాసులతో తులతూగు నా పల్లె
అన్నమో రామచం ద్రాయని
అలమటిస్తూ
కళదప్పి కనవడుతుంది నాపల్లె
వ్యథనంత వినిపిస్తుంది !

No comments: