Wednesday, October 4, 2017

మరణమే శరణ్యమా?


మనసు విరిగిందనో
మమత కరువైందనో
కరుణ కనుమరుగైందనో
ప్రేమ విఫలమైందనో
మానవత మాయమైందనో
బాధలు వెరిగినయనో
బతుకు దెరువు గానరావట్లేదనో
చితికి చేరువవుతావా

మాష్టారు తిట్టాడనో
మార్కులు తగ్గాయనో
తల్లిదండ్రులు మందలించారనో
చెలికాల్లు చులకన చేశారనో
పరీక్షలో తప్పామనో
ఫలితాలు మారాయనో
జీవనరంగం లోంచి తప్పుకుంటామా?

జనన మరణాలు
స్వేచ్ఛా విహంగాలు
ఏదీ నీ చేతిలో లేదు
అంతా దైవ సంకల్పం

కష్ట సుఖాలు కావడికుండలు
నిరంతర దోబూచులాటలు
నిత్యం  ఒకటే కనిపిస్తుంది
రెండోది లేదనిపిస్తుంది
ఒకదాని వెంట ఒకటి నడిచొస్తుంది
యథార్థమిది యని తెలియకుంది

మనసును మరుగు పరచు
మబ్బు పరదాలను తొలగించుకొని
ఏదీ శాశ్వతంగాదని తెలుసుకో
వెతలు మాని బతుక నేర్చుకో

జీవితం విలువైనదని
మరణమే శరణ్యం గాదని
జీవిత సత్యం తెలుసుకొని
మనస్థైర్యముతో మనుగడ సాగించాలి
మానవాళికి మార్గదర్శి వవ్వాలి

No comments: