Sunday, September 16, 2018

అసలు కథ

అపజయ పంచునే
విజయం విరబూస్తుంది
కటికచీకటి వెనకాలే
కాంతిరేఖ దాగుంటుంది
నిరాశ కవతలనే
ఆశావిత్తు అంకురిస్తుంది
పతనం పాదాలచెంతనే
ఉత్తాన మూపిరిపోసుకుంటుంది
సాహపు శ్రమ దాటితే
సంతోషం చెకిలిస్తుంది
విషాదం వీపునే
ఆనందం అంటివుంటుంది
దేనికీ మురిసిపోకు
దేనినీ మరిచిపోకు
శ్రమించు
శోధించు
సాధించు
నిరంతరం జీవించు!

జీవనాటకం

వెలుగు చీకట్ల మేళవింపు లోకం
కష్ట సుఖాల కలబోత జీవితం
గిరగిరతిరిగే జీవనఛక్రం
స్థానాలు కావు పదిలం
నాలుగురోజుల నాటకం
ఏదీకాదు శాశ్వతం
నీ పాత్ర నీవుపోషించు
మురుపురాని
మరువలేని
మధుర జ్ఞాపకమై మిగిలిపో


Friday, September 14, 2018

ముగ్గు



ముసిముసి మబ్చుల నిద్రలేచి
మిణుగురులై మెరిసి
దాగుడుమూతలాడుతూ
మబ్బుల దాగిన చుక్కల
మనసువెట్టి ఏరుకచ్చి
ఆవుపెండతోటి అలుకుజల్లిన ఆకిట్ల
అందంగా అదిమిపెట్టి
అరిపిండితోటి చారుకలోలె
లక్షణంగ చుట్టూర
లక్ష్మణరేఖలు గీసి చుక్కల బందించి
పూలులతలు దీర్చిన
పొదరింటి వాకిల్లు
ఇల్లాలి చిత్రకళా నైపుణ్యానికి
సజీవ సాక్షాలు

చిరునగవుల బుడ్డోడి
చిగురాకు చేతుల్లో
మెళుకువతొ మైదాకు వెట్టినట్టు
అవని యాలంభనగా వంగి
సుతారంగా చుక్కలు పొదిగి
పుడమిపై ముగ్గులువెట్టే
అతివల అందాలకు
ముగ్ధులై మురిసిపోదురు
సూసుకుంట వోయెటోళ్లు

అందంగా గూర్చిన
రంగవల్లుల జూసి రంజిల్లి మురిసి
దివిపైనె దిరిగేటి సకలదేవతలు
వాకిల్లలో జేరి వరుసబాడుదురు
ఇల్లలో కొలువై ఇచ్ఛ దీర్చెదరు

Thursday, September 13, 2018

గణేశ స్తుతి

విఘ్న ములను బాపు విఘ్నేశు నీవంచు
శతక మునొన రించ చెంత కొస్తి
సంక టమ్ము లన్ని  యలలయ్యి తొలిగేల
దీవె నొసగు మయ్య దేవ దేవ

మోహ రూపు తోడ మోదక హస్తుడై
ఆది దైవ మయ్యె నవనియందు
విమల పద్య దార వెల్లువై సాగేల
వరము నొసగు మయ్య వారి జాక్ష
ఏక దంత 
వినతి జేతు నయ్య విఘ్నరాజ

పొద్దటి నడక

ఉరకలేస్తున్న ఉదయభానుని కరచాలన వెచ్చని స్పర్శ
పచ్చలు తాపిన వస్త్రమై
అవనిపై పరుచుకున్న పచ్చదనం
అరవిరిసిన అరవిందాలు
సుగంధమిళిత కుసుమలతలు
పత్రపుష్పశోభితాలై
అప్సరసాంగన దీర్చిన ముగ్గునిండిన వాకిళ్లు
బడలిక బాసి తనువిదిలించి
ఆహారాన్వేషణకై ఆకసానికెగిరే
పక్షుల కిలకిల రావాలు
గుడిసె సూరులో గూడుగట్టుకున్న
ఊరవిస్కల కిచకిచ లూసులు
గువ్వల గుసగుసలు
పచ్చని చెట్లపై కులికె
చిలుకల పలుకులు
నల్లని తనువు మించి
మధురరాగాలు పాడే కోయిలలు
వస్తూ వస్తూ పూలపరిమళాలనొంపుకొచ్చే
మలయమారుతాలు
చెంపలను తాకి  సౌరభాలు పెనవేస్తుంట
కనికట్టుజేసే ప్రకృతి కౌగిట్లోంచి
పచ్చని చాపపరిచినట్లున్న
గడ్డిదారులెంట
నిండుకుండలైన చెరువుపొంటి తాపీగ సాగే తొలిపొద్దు నడక
మదిని మరిమరి తొలుస్తుంటే
మనసాపుకోలేకమబ్బులలేసి మళ్ల నడుద్దామనుకున్న
పొలుమారుదాటి పాదాలు కదులుతుంటే
పరవిశించే పూలతలు లేక
పలుకరించే కిలకిలలులేక
నాటి ఆనవాళ్లసలే లేక
కనుసూపుదూరంలో
పచ్చదనం గానరాక
తొలిపొద్దునడకను తొందరగ ముగించి

కృత్రిమ జీవితపు అరలలో ఒదిగిపోయా!

Tuesday, September 11, 2018

అన్యాయాన్నెదిరించిన కాళోజీ

తండ్రి మరాఠా తల్లి కన్నడా
అయినా కాళన్నకు
తెలంగాణపై మక్కువ
పుట్టినూరు నొదిలిపెట్టి
మడికొండకు మకాంమార్చి
ఓరుగల్లులో ఒదుగి యెదిగి
తెలంగాణ ముద్దుబిడ్డవైనావు !

పలుభాషలు నేర్చుకొని
పలువిధాల పరికించి
తెలంగాణ యాస మెచ్చి
తెగువతో నిటొరిగినావు !

ఆట తప్పు మాట తప్పు
ఆచారాలసలే తప్పని
అన్నింటిని అణచివేసి
ఉర్దూను మనపై రుద్దిన
నిజాంపై భాషాశరమ్ములు సంధించి
తెలుగు ప్రజలకందరికి ఆదర్శమై నిలిచితివి

తెలంగాణ భాష యాస
సంస్కృతి సారస్వతములను
అణగద్రొక్కి నాంధ్రులను
మెడలువంచి మెప్పించి
తెలంగాణ గోసనంత
మన యాసల తెలిపితివి !

అవనిపై జరిగేటి
అవకవకలన్నిటిపై
అవేదనతో స్పందించి
ప్రజల మనసు గెలిచినట్టి
ప్రజాకవి మన కాళోజీ !

ధనికపేద వర్గాంతరాలను
వ్యత్యాసాలుగ జెప్పిన
ఉదాత్తవాద సిద్ధాంతాలను
నిరసించి నీరుగార్చి
రాజకీయ డొల్లతనాన్ని
ఎండగట్టిన హేతువాది కాళోజి !

వస్తువేదైనా తన మస్తిష్కపు
అలోచనలో ఓలలాడితే చాలు
కవిత్వపు రంగు పులుముకొని
ఈటెలుగా వెడలాల్సిందే
సమాజాన్ని తట్టి లేపాల్సిందే !

నిజాం వ్యతిరేక పోరాటం మొదలు
సాయుధ రైతాంగపోరాటం వరకు
ప్రేమ నమ్మకం  మూఢాచారాలు
హాస్యం వ్యంగ్యం అధిక్షేపణలు
వేదన నుంచీ బోధన వరకు
అన్నీ వశమైన కవితా వస్తువులే
తాను వశమవ్వడు దేనికీ !

అన్యాయాన్నెదురిస్తే నాగొడవకు సంతృప్తని
అన్యాయం అంతమైతే నాగొడవకు ముక్తిప్రాప్తని
అన్యాయాని కెదురునిల్చి
అగ్ని గుండమై రగులుతున్న
తెలంగాణ కదనరంగాన
కొదమసింహమై దునికిన ధీరకవి కాళోజీ!

నిజాంపాలనను నిరసిస్తూ
దొరల అరాచకాల నెదురిస్తూ
రజాకార్ల ఆగడాల కడ్డునిలిచి
నిప్పులు చెరిగే భావాలతో
కవితలల్లి కలమెత్తి
ప్రజాభివృద్ది కాంక్షించిన అభ్యుదయవాది కాళోజీ!

ఒక్కొక్క సిరాచుక్కతో లక్షల మెదల్లను కదిలించి
తెలంగాణ భాషలోని తెగువను చూపించి
ప్రజాచైతన్యపు బాటలువేసిన
తెలంగాణ వైతాళికుడు కాళోజీ!

ప్రజల గొడవను తనగొడవగా యెంచి
ప్రజల భాషలో కవితలను రాసి
అన్యాయాన్నెదురించి అందరినీ ఆదరించి
ఆత్మాభిమానం పలికించిన ప్రజాబంధు కాళోజీ!

భాషలోనే బతుకుందనీ
యాసలోనే భవితుందనీ
భాష యాస మరిచిపోతే
మనుగడ కరువవుతుందనీ
బడిపలుకుల నొదిలించి
పలుకుబడులు వలికించిన
 మాతృభాషాభిమాని కాళోజీ!

బానిసత్వపు బాధలుబాపి
అణిచేసిన సంస్కృతికి కంచెనాటి
పరిహసించిన భాషకు పట్టంగట్టి
మనిషిలోని జడత్వాన్ని బొందవెట్టి
అక్షరసేద్యంతో లక్షలమెదల్లు కదిలించి
ప్రజల మనిషి కాళోజి!
మానవతను పరిమళింపజేసిన
మానవతావాది మన కాళోజీ!

Tuesday, September 4, 2018

జై కిషన్ గారికి

నడిసంద్రాన నలలతో పోటీపడలేక
గతుకుల బాటలో గమనం సాగించలేక
బ్రతుకుదెరువు కరువై
చతికిల బడిన బండిని
విద్యామార్గము జూపిన మార్గదర్శి
సరస్వతీ కటాక్ష విలసిమ్మొనర్చిన
గడ్డిపూలకు గంధమంటించి
ఉత్కృష్ట సౌరభాల నుర్వికిబంచినట్టి
మా గురువర్యులు
నిరంతరం మా హృదినంటియుండే
ప్రాతస్మరణీయులు
   
జై కిషన్ గారికి శుభాకాంక్షలతో అంకితం


ఆకలితో అల్లాడుతున్న
బాల్యాన్ని జూసి
పరితపించిన అమ్మ
హృది యమృతం వర్షించింది

స్వార్థ చింతన(పద్యాలు )

నాది నాది యంటు నరుడుపొ రలుచుండ
ఇహము పరము రెండు  చెడును సుమ్ము
సర్వ మీశ్వ రునిప్ర సాదమ్మ నుచునెంచ
మిగుల తృప్తి గలుగు నిహము పరము

పద్య కవులు

కవుల నియెడు వారు కలమునె రుసునింపి
కవిత లల్లి రిగద గరిమ తోడ
మదిల నిల్చి నట్టి మధురభా వములతో
పద్య ములను రాయ చోద్య మయ్యె

Monday, September 3, 2018

మాధవమాయ(పద్యాలు )

అల్లారు ముద్దుగా ఆడుకుం టున్నట్టి
ముద్దుకృ ష్ణునిజూసి మురిసె ముదిత

నల్లన య్యనుజూసి నగుమోము విలసిత
బృందావ నియుబాడె బృంద గీతి

నల్లదే హముగల్గి నడయాడు వెన్నుని
గూడియా డెనుతారు గోప జనులు

గొల్లభా మలుగూడ కొంటెచే ష్టలుమెచ్చి
అలకొకిం తయులేక నలరు చుండ్రి

బాలు తీరు నున్న పరమాత్మ యునుగూడ
బృంద వనము నంత మోద పరిచె
జల్లు వెన్నె లదొర జలువచూ పులతోడ
మోద యుతము వారు మోక్ష మొందె

Saturday, September 1, 2018

కొండకో నలనుండి వెండిను ర్గలతోటి
జలజాత ముయిలకు జాలువారె
జాలువా రుతుతాను జాబిల్లి లామెర్సి
కొండకో నకువెల్గు వెండి నొసగె
పాలుగా రెడుకొండ పడతియా కారమై
సాకార మైనది సలిల ప్రతిమ
పొంగిపొ ర్లడెనీరు పొలతియై పారుతు
పచ్చతి వాచిని బరచి పిలిచె

పండువెన్నెలంటి పరికిణి లోనున్న
పైడికాంతజూడ పరిత పించె
అట్టి జల కన్య అందాల ముగ్దులై
నిలచి చూచె దరుగ నిండు జడిని