Thursday, September 13, 2018

పొద్దటి నడక

ఉరకలేస్తున్న ఉదయభానుని కరచాలన వెచ్చని స్పర్శ
పచ్చలు తాపిన వస్త్రమై
అవనిపై పరుచుకున్న పచ్చదనం
అరవిరిసిన అరవిందాలు
సుగంధమిళిత కుసుమలతలు
పత్రపుష్పశోభితాలై
అప్సరసాంగన దీర్చిన ముగ్గునిండిన వాకిళ్లు
బడలిక బాసి తనువిదిలించి
ఆహారాన్వేషణకై ఆకసానికెగిరే
పక్షుల కిలకిల రావాలు
గుడిసె సూరులో గూడుగట్టుకున్న
ఊరవిస్కల కిచకిచ లూసులు
గువ్వల గుసగుసలు
పచ్చని చెట్లపై కులికె
చిలుకల పలుకులు
నల్లని తనువు మించి
మధురరాగాలు పాడే కోయిలలు
వస్తూ వస్తూ పూలపరిమళాలనొంపుకొచ్చే
మలయమారుతాలు
చెంపలను తాకి  సౌరభాలు పెనవేస్తుంట
కనికట్టుజేసే ప్రకృతి కౌగిట్లోంచి
పచ్చని చాపపరిచినట్లున్న
గడ్డిదారులెంట
నిండుకుండలైన చెరువుపొంటి తాపీగ సాగే తొలిపొద్దు నడక
మదిని మరిమరి తొలుస్తుంటే
మనసాపుకోలేకమబ్బులలేసి మళ్ల నడుద్దామనుకున్న
పొలుమారుదాటి పాదాలు కదులుతుంటే
పరవిశించే పూలతలు లేక
పలుకరించే కిలకిలలులేక
నాటి ఆనవాళ్లసలే లేక
కనుసూపుదూరంలో
పచ్చదనం గానరాక
తొలిపొద్దునడకను తొందరగ ముగించి

కృత్రిమ జీవితపు అరలలో ఒదిగిపోయా!

No comments: