Monday, September 25, 2023

(తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ) సీసపద్యం


సీసం:

మందార మకరంద మాధుర్యములతోడ

మధురస మొలకించు మాతృభాష

నిర్మల మందాకి నీవీచి కలదూగు

హాయిగొ ల్పెడునట్టి యమృతభాష

లలితరసాల పల్లవ లాలిత్య విలసిత

నవనీత కోమలి నాదు భాష

పూర్ణేందు చంద్రికా స్పురిత యైసాగు

జ్ఞానసు ధలుబంచు జనుల భాష



పలుతె రగుల దెలివి ప్రపుల్ల మొందేల

పదస మూహ మున్న పసిడిభాష

మనసులోని భావ మాధుర్య ములతోడ

జనుల రంజ కమయి జగతి వెలుగు


రాజశేఖర్ పచ్చిమట్ల

తెలుగు భాషోపాధ్యాయులు

Monday, September 18, 2023

వినాయక చవితి (సీసం)

 నాకలో కమునందు నడయాడు గణపయ్య

ఎలుకవా హనమెక్కి యిలకు వచ్చె

అమ్మతో డమిగుల ఆటలా డెడువాడు

దాగుడు మూతల ధరణి జొచ్చె

భూలోక వాసుల పులకింప జేసేల

ఆదర మ్మునతాను అవతరించె

ఇహలోక వాసుల విఘ్నమ్ము లనుబాపి

విహరించ తానొచ్చె విఘ్నరాజు


పరవ శించె తాను బాలకు లగలిసి

బాల్య క్రీడ లాడి పులక రించె

అట్టి యతిథి రాక ఆశ్చర్య మునుగొల్పె

మనుజ లోక మంత మైమ రించె


పచ్చిమట్ల రాజశేఖర్