Wednesday, April 28, 2021

ప్రకృతి ప్రక్షాలన

 ప్రకృతికి సమాంతర జీవనం 

పాతకాలపు అనాగరికులది

ప్రకృతికి ఎదురీదే జీవనం 

ఆధునికపు నాగరికులది

విశృంఖలాభివృద్ధిని తాళలేని

ప్రకృతి వికృతరూపం దాల్చడం

ఆత్మపరిశుద్ధతారంభమే!

మానవతప్పిదాల అపరిశుభ్రతకు 

కంపుగొడుతున్న ధరణిదేహసంస్కారం చేసుకుంటుందనీ

అహం నడ్డివిరుస్తుందని యెరుగని మనిషి చేస్తున్న

నానా భీభత్సానికి ప్రక్షాళన తప్పదు

వంగిన తుంగ నిలదొక్కుకున్నట్టు

నిక్కిన మ్రాను నిలవడలేదు

నిక్కిన మనిషి మెడలెలా వంచాలో ప్రకృతికి తెలుసు!


మానవసమూహంలో మనుగడ సాగించే నేటి బుద్ధిజీవి

సాటిమనిషిని చేరదీయలేని స్వార్థజీవి!

అడవుల్లో సంచరించిన నాటి ఆదిమానవుడు

కౄరజీవుల నడుమ తిరుగాడిన సాధుజీవి!

నింగీనేలా గాలీనీరూ నిప్పూ

అన్నీ దైవసమానం!

అలజడిలేని జీవనం!


అభివృద్ధిపేరట అంతరిక్షవిహారంచేసి

అడ్డులేదని  విర్రవీగిన మనిషిని

ఆత్మరక్షణపేరట గడపదాటకుండా 

నిలువరించింది ప్రకృతి!

అథఃపాతాల అంతులుచూసే మానవమేథను

ముక్కుమూయించి మూలనకూర్చోబెట్టింది ప్రకృతి!


 చావుపుట్టుకలు నీచేతిలోలేవు

పుట్టించిన వాడూ దేవుడే 

గిట్టించినవాడూ దేవుడే

అవసరాలకు స్తుతించిన నోరే

ఆపదలపుడు నిందిస్తుంది!

అంతా దైవమయం

గుర్తెరుగకపోవడం మనిషి అవివేకం!

అందినప్రతీ దానిపై తనదైన ముద్రవేసి 

సాధించిన ప్రగతి ఫలితమేమి?

సర్వజీవులకు అధిపతియై

మానవమేథస్సుతో సాధించిందేమి?

తినేతిండీ కల్తీ తాగేనీరు కల్తీ

మనసు కల్తీ మాటకల్తీ

చుట్టూన్న మనుషులు కల్తీ!


ప్రగతి మాటున విజ్ఞానస్వైర విహారంచేసి

విశుద్ధ ప్రకృతిపై మనిషి కుమ్మరించిన 

అశుద్ధతను కడిగి ఆత్మపరిశుద్ధి చేసుకోవడం ప్రకృతికి తెలుసు!

పంచభూతాల ఆత్మప్రక్షాళనలో

ఎంతటి వారైనా వంతపాడాల్సిందే!

పరుశుభ్రతకు పచ్చలతివాచీ పరిచి

ఆత్మీయంగ ఆహ్వానించాల్సిందే!

Tuesday, April 27, 2021

స్వేదపరిమళం


ఆ.వె.1


సృష్టికర్తలైన సుహృజ్జనులిలలో


కర్మగారమందు కష్టపడుచు


ఆకరమ్మిడేరు అపురూపవస్తుల


ప్రణతులిడునుతమకు అఖిలజగతి


ఆ.వె.2


చెమటచుక్కతోటి సిరులనిలకుచేర్చి


కండలుకరిగించి కాంతినింపి


సర్వమానవాళి సౌఖ్యమందించేరు


కరములెత్తి మొక్కు కార్మికులకు


రాజశేఖర్ పచ్చిమట్ల

గోపులాపూర్ 

జగిత్యాల

9676666353

rajapachimatla@gmail.com

కార్మికుల కళ

  ఆ.వె.1

సృష్టికర్తలైన సుహృజ్జనులిలలో

కర్మగారమందు కష్టపడుచు

ఆకరమ్మిడేరు అపురూపవస్తుల

ప్రణతులిడునుతమకు అఖిలజగతి

ఆ.వె.2

చెమటచుక్కతోటి సిరులుపండించేరు

కండలుకరిగించి కరుణతోడ

సర్వమానవాళి సౌఖ్యమందించేరు

కరములెత్తి మొక్కు కార్మికులకు

Wednesday, April 21, 2021

పూవులే ఆకులైనచెట్టు(పద్యం)

 అందమైయలరిన యాకులన్నిటిరాల్చి

ఆకుపచ్చశోభ నణచుకొంటు

విరులెయాకులయ్యి విరబూసి తనువెల్ల

కొత్తశోభవెలిగె కోరి తరులు

Monday, April 12, 2021

మబ్బుచాటు జాబిలి (ఉగాది)

రోజులు గడుస్తున్నయి 

నెలలు మారుతున్నయి

బతుకుతీరు మారుతలేదు

అయినా ప్రాకృతికమార్పులు ఆగుతలేవు

గ్రీష్మతాపంతో విరాగియై విలసిల్లిన పుఢమిపై

మన్మథలీలావిలాసమై మోడులన్ని చిగురించి విరబూసినయి

వసంతపురుషుని వలపించుటకు

ప్రకృతికాంత పచ్చకోక దాల్చినట్టు

నానాసూనసౌరభభరితమై వీస్తున్న పైరగాలికి పరవశించి

క్రొంజివురులు తావి మార్దవస్వరంతో

మధురగానమాలపిస్తున్న గండుకోయిలలు

తనువెల్ల పూతతో సింగారించుకున్న వేపలు

కలకంఠి కూతలు కిలకిలరావాలు

తొలికాంతికిరణాల వెలుగులో భువికి దిగివచ్చే ఉగాదికి

కరోనా చీకటి కమ్మి  కలవరపెడుతుంది

అమవసనిశి ఆవహించిన శార్వరి

కాంతిపుంజం గాంచకనే పలాయనం చిత్తగించింది

నడిసంద్రపు నావతీరున్న దిక్కుతోచని లోకాన్ని

అలలపై ఓలలాడించి దరిచేర్చుటకు

ప్లవనామ వత్సరం విప్లవోత్తుంగ తరంగమై వచ్చింది

కరోనా వికృతదంష్ట్రికల నూడబెరికి

మందగించిన మానవజీవితానికి జవసత్వాలందించి

ఆశలపల్లకిలో ఊరేగించి ఆనందమయ జీవనమందించి

జాతిప్రగతికి మార్గదర్శనమై నిలవాలి

తెలుగునేల తనువెల్ల కాంతులతో తళుకులీనాలి

ప్లవనామవత్సర ఆనంద వీచికలు లోకమంతా కలియవీచాలి!



Sunday, April 11, 2021

గజల్ -1

 ఆజాబిలి నింగిజారి యిలతలపై చేరెనేమొ

తామరాకు ఆచంద్రుని దళఛత్రము పట్టెనేమొ


తానడిచిన పథమునల్ల వెన్నెలవన్నెలు పులుముతు

భువిచీకటి తరిమికొట్ట వెలుగు తెచ్చెనేమో


పుఢమియెదల దాగివున్న దివ్వెలన్ని వెలిగించగ

తనకన్నుల మెరుపుతీగె లరువు యిచ్చెనేమో


మోడుబారి ముడుచుకున్న మదిప్రకృతి మనసువిరియ

చిరుజల్లుల చంద్రికలను యిలకు దించెనేమో


ఆచల్లని చూపులలలు యెదగోడలు తడిపేలా

నులివెచ్చని సమీరాల వలపు  విచ్చెనేమో

Friday, April 9, 2021

ఉషస్సు కొరవడిన ఉగాది

ఉగాది కవితల పోటీకి (శార్వరినామసంవత్సర ఉగాది కవిత)

మావిచిగురుల సందులోంచి
వినచ్చే కోయిలకూతలతో
వికారఫలితాల పరధ్యానంలోంచి  భయటపపడి
నన్నునేను తడుముకొని
కళ్లునలుసుకొని ఆశగ వెదికా
యెదతలుపులు తెరచి ఆబగ యెదురుచూసా
పుఢమి పొత్తిల్లు వీడి పైకెగబాకుతున్న
బుడిబుడిఅడుగుల నూత్నకాంతిని
ఒళ్లుజలదరించేంత భయపెట్టింది
తెరలుతెరలుగ నేలరాలుతున్న చీకటి!


మావిడాకులు  చెట్లను వీడలేదు
కోయిలల గొంతుకు వంతపాడలేదు
షడ్రుచులపచ్చడి గొంతుదిగలేదు
పంచాంగశ్రవణం మనసువట్టలేదు
అయినా సూర్యోదయకాంతి కళ్లుగప్పి
కటికచీకటితానై శార్వరి రానేవచ్చింది
ఇళ్లముంగిళ్లు తెరవనెలేదు
తనివిదీర కళ్లాపిజల్లనెలేదు
మామిడితోరణాల మాటేలేదు
నలుగురు మనుషులు గలువనెలేదు
పాతజ్ఞాపకాలను మసిబూసి
కొత్తచీకటి దరజేరింది కరోనాయై
ఈచీకటితెరలు వీడేదెన్నడో?
ఉగాది ఉషస్సులు ఉబికేదెన్నడో?

వసంతంలో గండుకోయిల
గానాలాపనను వింటూన్న లోకానికి
(శార్వరి) రూపమావిర్భభవంచి
కరోనాయై కలవరపెట్టింది
కటికచీకటి కోరల్లోంచి మెల్లగా తొంగిచూసిన లోకాన్ని
ప్లవనామ వత్సరం పలుకరించింది
నడిసంద్రపు నరుని బతుకు 
దరిచేర్చుటకు తెప్పలను కుప్పలుగ జేసుకొని
ఇగనన్న ఉత్సవాలకు ఉత్సాహం తోడైతదో
గతకాలపు శని చీకటితీరీ మటుమాయమైతదో
మనుషులంతా గలిసి పండుగ జేసుకుంటరో
ఈయెడబాటుకు తెరబడుతదో
యెదురు సూడాలె!

ఈ నాకవిత ఇదివరకెక్కడ ప్రచురించబడలేదు.

        రాజశేఖర్ పచ్చిమట్ల
        గోపులాపూర్
        జగిత్యాల
        96766666353

నైరాశ్యం(గజల్ )

 చీకటినే దుప్పటిగా కప్పుకుంది హృదియెందుకో

కలలనేటి విరులకోటి విచ్చుకుంది మదియెందుకో


తెలివాకిట రవికరములు గిలిగింతలు పెడుతున్నా

జ్ఞాపకాల పాన్పుపైన పడుకొనుంది తనువెందుకొ


చెలికూజిత స్వరములేక మూగదైన యెదవీణియ

అలుపులేని మగతనిదుర నలుముకుంది హృదియెందుకొ


మిథునమయ్యి  యలరించిన క్రౌంఛమంటి కనుదోయిని

తనురాలిన ఆగతమ్ము పులుముకుంది భవితెందుకొ


నందనమై వలపులొలుకు రాశేఖరు మదిగదిలో

నిశిరాతిరి తిమిరమెంతొ పరుచుకొంది భావెందుకో



Thursday, April 8, 2021

తుషార బిందువులు

 బాల్యపు మధుర క్షణాలెన్నో 

దోసిట ముత్యాలై  దొర్లుతున్నవి


కాలగతిలో గడిచిన మరువలేని సంఘటనలెన్నో 

మదినమెదిలి కన్నీరు వర్షిస్తున్నవి


ఆనందతీరాల గవ్వలలో దాగి 

ఓలలాడిన అపురూప క్షణాలెన్నో  

మేలిమి ముత్యాలై యెదసూరున జారుతున్నవి


కరిగిన కాలపు చెరగని మరకలెన్నో

మంచుబిందువులై తట్టిలెపుతున్నవి


చీకటికొమ్మకు చిక్కిన చుక్కల్లా

చిన్నచిన్న ఆశలు బతుకుదారి చూపుతున్నవి


నాటకం ముగిసి దీపమై వెలుగుతున్నపుడు

మలుపులన్ని కొమ్మనవేలాడి రాలుతున్న తుషారములై 

మదిని ఆర్ద్రంగా మారుస్తున్నవి

Tuesday, April 6, 2021

మధురస్మృతులు(గజల్)

 

 తీయనైన జ్ఞాపకాల వెల్లువనయి విరిసాను

చెలిజాబిలి వెన్నెలలో తడిసి నేను మురిసాను


చిరుప్రాయపు చిలిపిపనులు గిలిగింతలు పెడుతుంటే

మోయలేని భారంతో పండుముదిమి మురిసాను


వాగుపొంగు వయసులోన విరబూసిన వసంతాలె

అలసిసొలసి అరుగువేళ దౌడుతలచి మురిసాను


బిగితప్పిన తనుముసిరిన వణుకుతున్న కడదశలో

కాపుదశలొ తులతూగిన తళుకుతలచి మురిసాను


ఋతురాజము వసంతమని కవిశేఖరు కామించిన

షడ్తుతువుల సరసతను పిలిచివలచి మురిసాను

రామధీక్షా పరాయణుడు

 సీసం:1

 రోమరోమమ్మునా రామనామముదాల్చి

భక్తితో కొనియాడు భక్తుడెవరు?


వానర మ్ములలోన వాసియై వెలుగొంది

సవ్యసాచిగవెల్గు సచివుడెవడు?


రామదుఃఖముబాప రామజాడవెదుక

సంద్రమ్ము దాటిన సాహసెవడు?


సౌమిత్రి రక్షింప సంజీవినినిదెచ్చి

వైధేయతనుచాటు వినయుడెవడు?


ఎవరు బాపె రామ డెందపు తాపమ్ము

యెవరు సీత జాడ వెదికి తెచ్చె

ఎవరు చూడ బనుప వేగిరమ్మునజని

ఎవరు కాల్చి వచ్చె లంకనగరి


సీసం: 2

కృష్ణవాంఛనుదీర్చ కురుక్షేత్ర యుద్ధాన

అర్జున ధ్వజముపై అంకురించె


రథశూన్యుడవంటు రామున్ని తులనాడ

రామరథమయితా రణముజొచ్చె


సీతమ్మ నుదుటిపై సింధూర మునుజూచి

తనువెల్ల దాల్చిన దాసవరుడు


అభయమొసగినట్టి యాయాతి రక్షింప

ప్రభువుతో పోరిన భక్తవరుడు


కష్టకాలమందు గాచె సుగ్రీవున్ని

శనికి దాపునిచ్చి శరణు గాచె

రామరామయనుచు రణమందు తానిల్చి

అస్త్ర శస్త్ర ములను అణచె హనుమ