Wednesday, April 28, 2021

ప్రకృతి ప్రక్షాలన

 ప్రకృతికి సమాంతర జీవనం 

పాతకాలపు అనాగరికులది

ప్రకృతికి ఎదురీదే జీవనం 

ఆధునికపు నాగరికులది

విశృంఖలాభివృద్ధిని తాళలేని

ప్రకృతి వికృతరూపం దాల్చడం

ఆత్మపరిశుద్ధతారంభమే!

మానవతప్పిదాల అపరిశుభ్రతకు 

కంపుగొడుతున్న ధరణిదేహసంస్కారం చేసుకుంటుందనీ

అహం నడ్డివిరుస్తుందని యెరుగని మనిషి చేస్తున్న

నానా భీభత్సానికి ప్రక్షాళన తప్పదు

వంగిన తుంగ నిలదొక్కుకున్నట్టు

నిక్కిన మ్రాను నిలవడలేదు

నిక్కిన మనిషి మెడలెలా వంచాలో ప్రకృతికి తెలుసు!


మానవసమూహంలో మనుగడ సాగించే నేటి బుద్ధిజీవి

సాటిమనిషిని చేరదీయలేని స్వార్థజీవి!

అడవుల్లో సంచరించిన నాటి ఆదిమానవుడు

కౄరజీవుల నడుమ తిరుగాడిన సాధుజీవి!

నింగీనేలా గాలీనీరూ నిప్పూ

అన్నీ దైవసమానం!

అలజడిలేని జీవనం!


అభివృద్ధిపేరట అంతరిక్షవిహారంచేసి

అడ్డులేదని  విర్రవీగిన మనిషిని

ఆత్మరక్షణపేరట గడపదాటకుండా 

నిలువరించింది ప్రకృతి!

అథఃపాతాల అంతులుచూసే మానవమేథను

ముక్కుమూయించి మూలనకూర్చోబెట్టింది ప్రకృతి!


 చావుపుట్టుకలు నీచేతిలోలేవు

పుట్టించిన వాడూ దేవుడే 

గిట్టించినవాడూ దేవుడే

అవసరాలకు స్తుతించిన నోరే

ఆపదలపుడు నిందిస్తుంది!

అంతా దైవమయం

గుర్తెరుగకపోవడం మనిషి అవివేకం!

అందినప్రతీ దానిపై తనదైన ముద్రవేసి 

సాధించిన ప్రగతి ఫలితమేమి?

సర్వజీవులకు అధిపతియై

మానవమేథస్సుతో సాధించిందేమి?

తినేతిండీ కల్తీ తాగేనీరు కల్తీ

మనసు కల్తీ మాటకల్తీ

చుట్టూన్న మనుషులు కల్తీ!


ప్రగతి మాటున విజ్ఞానస్వైర విహారంచేసి

విశుద్ధ ప్రకృతిపై మనిషి కుమ్మరించిన 

అశుద్ధతను కడిగి ఆత్మపరిశుద్ధి చేసుకోవడం ప్రకృతికి తెలుసు!

పంచభూతాల ఆత్మప్రక్షాళనలో

ఎంతటి వారైనా వంతపాడాల్సిందే!

పరుశుభ్రతకు పచ్చలతివాచీ పరిచి

ఆత్మీయంగ ఆహ్వానించాల్సిందే!

No comments: