Monday, April 12, 2021

మబ్బుచాటు జాబిలి (ఉగాది)

రోజులు గడుస్తున్నయి 

నెలలు మారుతున్నయి

బతుకుతీరు మారుతలేదు

అయినా ప్రాకృతికమార్పులు ఆగుతలేవు

గ్రీష్మతాపంతో విరాగియై విలసిల్లిన పుఢమిపై

మన్మథలీలావిలాసమై మోడులన్ని చిగురించి విరబూసినయి

వసంతపురుషుని వలపించుటకు

ప్రకృతికాంత పచ్చకోక దాల్చినట్టు

నానాసూనసౌరభభరితమై వీస్తున్న పైరగాలికి పరవశించి

క్రొంజివురులు తావి మార్దవస్వరంతో

మధురగానమాలపిస్తున్న గండుకోయిలలు

తనువెల్ల పూతతో సింగారించుకున్న వేపలు

కలకంఠి కూతలు కిలకిలరావాలు

తొలికాంతికిరణాల వెలుగులో భువికి దిగివచ్చే ఉగాదికి

కరోనా చీకటి కమ్మి  కలవరపెడుతుంది

అమవసనిశి ఆవహించిన శార్వరి

కాంతిపుంజం గాంచకనే పలాయనం చిత్తగించింది

నడిసంద్రపు నావతీరున్న దిక్కుతోచని లోకాన్ని

అలలపై ఓలలాడించి దరిచేర్చుటకు

ప్లవనామ వత్సరం విప్లవోత్తుంగ తరంగమై వచ్చింది

కరోనా వికృతదంష్ట్రికల నూడబెరికి

మందగించిన మానవజీవితానికి జవసత్వాలందించి

ఆశలపల్లకిలో ఊరేగించి ఆనందమయ జీవనమందించి

జాతిప్రగతికి మార్గదర్శనమై నిలవాలి

తెలుగునేల తనువెల్ల కాంతులతో తళుకులీనాలి

ప్లవనామవత్సర ఆనంద వీచికలు లోకమంతా కలియవీచాలి!



No comments: