Wednesday, June 19, 2019

గజల్ మది నివేదన!




మదిలోని భావాలను విన్నవించనా చెలీ!
నామది నీయెదవాకిట పరిచివుంచనా చెలీ!

నీమనసున నాతలపులు అనునిత్యం పూచేలా
ప్రేమలతకు మధురాంబువు లోసి పెంచనా చెలీ!

నీ మనసును గ్రమ్మినట్టి కల్మషంపు కారుమబ్బు
తొలగించెడు పవనమ్ముల ప్రసరించనా చెలీ!

ముకులించిన వదనాంబుజము వికసింపజేసేలా
నీచూపుల కిరణమ్ములు సారించవా చెలీ!

చెలిమనసున యేమున్నదొ కవిశేఖరు కవగతమే
బిడియపు పరదలనుదాటి ప్రేమపంచవా చెలీ!


       - పచ్చిమట్ల రాజశేఖర్

Tuesday, June 11, 2019

చిరకీర్తి

(పాలకంటె పెరుగు పెరుగుకంటెను వెన్న, వెన్నకన్నను మిగుల నేయి శాశ్వతముగ నిలుచుతీరు మనుషులు నిత్య సంఘర్షనలతో మంచి మనుషులు మారి చిరకీర్తులందాలని ఆశిస్తూ - -)

సీసంం:
పాలవంటి మనసు పలుచనై దిగజారు
అచిరకా లమ్మునే అంత మౌను
పెరుగసొం టిమనసు పెంపునొం దునుగాని
మూడునా ళ్లకుతాను మురిగి పోవు
వెన్నలాం టిమనసు విసుగుచెం దకతాను
వారమ్ము కొలదిగా వరలుచుండు
నేయిలాం టిమనసు నిగనిగ లాడుతూ
నెలలువ త్సరములు నిలిచి యుండు

పాల నుండి పెరుగు వెలికివ చ్చినతీరు
పెరుగు నుండి వెన్న బరగు తీరు
వెన్న చిలుక నేయి వెలికి వచ్చినతీరు
మనిషి వెలయ వలెను మనల నుండి