Saturday, May 29, 2021

బతుకుబండి (రిక్షా కార్మిక వ్యథ)


పాడుకాలం దాపురించిన్నాటి నుండి

బతుకుబండి నడుత్తలేదు

మూడుచక్రాలు రోడుమీద

చక్కర్లుగొడితెనే మూప్పూటల తిండి

లేనినాడు అంతేసంగతి

కరోనాకాలంల జనం కాళ్లకు సంకెళ్ళేసె

మూడుగీరెలకు తాళాలేసె

మంది నడువకపాయె

గీరెలు దిరుగకపాయె

అయినా జీవనచక్రం ఆగదాయె

కందెనలేని గీరెతీర్గ

పొంటెకోతీరు ఒర్రవట్టె

ఇంటికాడి గోసచూత్తె

కళ్లనీళ్లు కారవట్టె

ఏదేవుడు కరుణించాలె

మాగోసలెవలకర్థం గావాలె

Wednesday, May 26, 2021

అద్దెకొంప


నీదనుకున్నదేదీ నీసొంతంకాదు

ఏదీ నీవెంట రాదు

అద్దెకొంప సర్దేసినట్టు

తనువునుండి తరలివెళ్లును జీవం

అంతవరకు నాదని మురిసిన

తనువూ నీవెంట రాలేక కూలబడుతుంది

నాఅన్న బంధాలన్నీ

వల్లకాటి చితిమంటిల వరకె

నీవు మోహించిన బంధాలన్నీ

ఏడ్చి తూడ్చి  క్రమంగా మరచి

ఆస్తిపంపకాల్లో లీనమౌతారు!

చుట్టూన్నలోకం వాళ్లకు వీలైనపుడు

నీమంచి చెడు తరాజుల జోకి

నీబతుకు అర్థాన్ని వెలగడుతుంటారు!

రోజులు.....

నెలలు...........

వత్సరాలు..........

గడిచి గడిచి

నీవునికే లేకుండ అంతర్ధానమౌతుంది!


అంతా మిథ్యే!

నీవనుకునేదంతా భ్రమే!

నీవన్నది మాత్రం నిజం!

నీచుట్టంతా అబద్దం!

నీవే నిజం!

Tuesday, May 25, 2021

భారతీయతత్త్వం (చిత్రకవిత-1)



నిటారుగ పెరిన వనాలు

నిత్యంపారె నదులు

అశుచిత్వాన్ని బాపె శుచి

భూదేవికి వీవెనలూపె మారుతం

ఎడతెరిపి లేకుండా ప్రాణులప్రగతికై శ్రమించే అరుణగోళం

పంచభౌతికముల పకృష్ట బంధమే

పాంచభౌతిక దేహమే అఖండభారతం!

అది ఆద్యాత్మికతకు ఆధారం!


త్వమేవాహం అనుమంత్ర 

పరమార్థం పరికించి

ఆద్యాత్మిక వెల్లువలో

పల్లవమై పయనించిన

తత్వమెరిగిన గురువులు

తనువనువనువూ నిండినది భారతం!

సంస్కృతీసంప్రదాయాల సెలయేరు 

వెల్లివిరిసిన నైతికత

పరిమళించిన మానవత్వానికి ప్రతీక భారతం!

ఖగోళ జ్యోతిష్య ఆయుర్వేదాది

సకలశాస్త్రాల నెలవు భారతం!


రాజశేఖర్ పచ్చిమట్ల

9676666353

Sunday, May 23, 2021

గద్దలనెలవులు (దావకాండ్లు)


కళ్లతో కనలేని 

నలుసంతపురుగు దాటికి

ఉస్తాదులు సుత విలవిలలాడుతుండ్రు

నేనన్నోన్ని నెత్తులపేనున్జేసిన

కరోనా కాటుకు వెరచి

పాణాలరిసేతుల వట్టుకొని

ప్రైవేటు దావకాండ్లకు వోతె

తెల్లగుడ్డల దాకుదార్లకు

జీతందప్ప జీవితాలు పట్టవు

మేకతోలు కప్పుకున్న పులుల తీరు

యాజమాన్యపు యమదూతలు

ఆసుపత్రుల కాసుపత్రులుజేసి

నిలిపేప్రాణానికి బదులు

నిలువుదోపిడి జేస్తుండ్రు

జీవంలేని తోలుతిత్తికి

ముక్కులమూతిల పైపులువెట్టి

జలగలై రోగిబంధువుల రక్తందాగి

సావుకబురు సల్లగజెప్పుడెగాదు

పైసలిచ్చెదాక పీనుగిస్తలేరు!

పాణదాతలు ధనదాహార్తులై

సెలిమలసొంటి చిన్నకుటుంబాల

నెర్రెలుగొట్టిపిత్తుండ్రు!


పీనుగుదగ్గర పీతిరిగద్దలతీరు

నల్గురైగుద్గురు నాల్గుదిక్కుల్జేరి

సమజుగాని బాషల సోచాయించుకొని

తోచిన మందులన్ని తోలుతిత్తిలనింపి

కట్టలన్ని కంపూటర్ల నింపుకొని

కాపాడలేకపోయినమని కల్లలాడుతుండ్రు!


వైద్యోనారాయణి హరి యని

ప్రాణదానంజేసె దాకుదార్లు

ఆసాములిచ్చే కాసులకాశపడి

గంగెద్దుతీరు ఆడుతుండ్రు

పాణబయాన్ని ఆసరజేసుకొని

మనుషులను చీకినబొక్కల్జేత్తుండ్రు!


Friday, May 21, 2021

కౌజుపిట్ట


పొట్టకుండ కింద

ఆకలిమంటవెటినట్టు కుతకుత ఉడుకంగ

గంజిల గట్కేసుకొని

పొంగుమీద నీళ్లుజల్లినట్టు 

కడుపుమంట జల్లారవెట్టుకోను

పాయిరంగ దాగి

సొలుక్కుంట సొలుక్కుంట

దొరల పొలాల్ల ఎట్టిజేసి ఎముకలగూడైన జాతిని


ఇనుము పోతవోసినట్టుండి

అలుముకుంటే అందని రాతికంబాలను

ఏన్గులెత్తలేని బారుకంబాలను

బొక్కల్లబలమంత బుజాలకుదెచ్చి

ఎగిసిపడే ఊపిరిని ఉప్పెనోలె ఎగజిమ్మి

వందలచేతిబలం మోకుతాడుజేసి

ఊరునడుమ బొందలగడ్డోలె

దొరగడీ నిలవెట్టి

పీనుగులై పొర్లాడుతున్న జాతిని


ఆడమగా పిల్లాజెల్లా

ముసలీముతకా అందరు

పొద్దుతిరుగుడు పువ్వోలె

కాయకట్టంజేసి కడుపుతీపు బాపుకోని

కడుపునిండ పిల్లలకు పాలుదాపతీరికలేక 

పుట్టెడు దుఃఖంతో బూదేయి పాల్జేసి

సలుపులు బాపుకొని శెమజేసే జాతిని


ఎంగిలిమెత్కుల కాశపడి

దొరజీకేసిన బొక్కలకు బమిసి

ఎన్కనిలవెట్టుకోంగనే 

ఎన్నెముకనుకోని బమవడి

జాతిగుణం దాసిపెట్టుకోని

పెద్దిర్కం మొకాన పుల్ముకోని

అమాయికుల వట్టుకచ్చి

గడీతంబాలకు గట్టి 

సందులేకుంట గొట్టి

చీకటిగదుల్ల అలమటించి

మనకు మనం జచ్చేటట్టు జేసె

దొరగులాంలకు

తనకడుపు నింపుటానికి

జాతిని తాకట్టువెట్టే

నకిలి కూతలను కౌజుపిట్టల

గొంతుపిసికి బొందవెట్టతందుకు

తెనెవూసిన కత్తోలే మాట్లాడి

పాణందీసే బద్మాసులకు

బడితెపూజ జేసెతందుకు

బుర్కలన్ని కలుస్తున్నయి!

ఎండిన కడ్పుల 

పేగులన్ని గల్సి ఉర్లువేనుతున్నయి!

Tuesday, May 11, 2021

గజల్

 వికసించే చంద్రునిలో చల్లని నీనవ్వున్నది

వినిపించే సవ్వడిలో తియ్యని నీపిలుపున్నది


వలపువాన కురియువేళ  చెలిజాబిలి నీవేగా

అలలుపొంగే నాహృదిలో వెచ్చని నీచెలిమున్నది


ఆకాశపుసరసు నడుమ ఆశలతామర నీవే

కదలాడెడు కనులవెనుక కమ్మని నీరూపున్నది


నీతొలకరిముద్దుకొరకు చెలగు చకోరము నేనే

తేలియాడు మబ్బులలో  తెల్లని నీమనసున్నది


నీవెచ్చని నిట్టూర్పులు తాకెను శేఖరు చెక్కిలి

నాగమ్యపు దారులలో వెయ్యని నీయడుగున్నది



Monday, May 10, 2021

మొక్క పద్యాలు

 ఆ.వె.

ప్రాణవాయుకొరకు ప్రాకులాడుటయేల

ధరణి మ్రానులన్ని నరికివేసి

చెట్లుబెంచిననది చెలగివిజృంభించు

వాయువీపుగట్టి మోయనేల?


ఆటగోరుబాలుడారీతి తెలిజెప్పె

పుఢమితపముబాప బుద్ధితోడ

అవనిజనులకంత ఆయుష్యమిచ్చేల

మొక్కనాటతొడిగె మోదమలర


ఆ.వె.

ప్రాణవాయులేక ప్రాణిలేదనెరింగి

పరివిధమ్ములుగను తరచి చూచి

వీపుమొద్దుమోయ విడ్డూర మగుననీ

మొక్కనాటపుఢమి మోకరిల్లె

కరోనా పద్యం

 ఆ.వె.

బతికియుంటెచాలు బలుసాకు దినవచ్చు

చవినిగోరిబయట జనుటవలదు

మూతిముక్కుమూయ ముందుబతుకుగల్గు

మాస్కుదీసినెడల మనుట కల్ల


రాజశేఖర్ పచ్చిమట్ల

Sunday, May 9, 2021

అమ్మ గేయం


అమ్మతనమె అమృతమై ఆయువుపోస్తున్నదీ

అమ్మతనమె అఖండమై యవనిని మోస్తున్నదీ

అమ్మతనం అంకురమై యవని నిలుపుతున్నది


మృగమైనా తనకూనల మురిపెముతో పెంచును

కాకైనా తనబిడ్డల కనురాగము పంచును


అమ్మసాటి ఈజగతిల అగుపించదు వెదికినా

అమ్మదనం జగతిలోన అమృతమే తెలుసునా


చక్రవాకమై నిత్యం తపిస్తుంది అమ్మతనం

తొలకరికై వేచివేచి కృశిస్తుంది అమ్మతనం


అమ్మతనమె ఈజగతిని  మోస్తున్నది వరాహమై

అమ్మతనమె అంబరాన

పూస్తున్నది హరివిల్లై


అమ్మప్రేమలేనిదే మనిషి ఉనికి లేదుగా

అమ్మమెప్పుపొందనీ మనిషిబతుకు దండుగా


అణువణువు తనకు అర్పించిన అమ్మఋణం తీరునా

బతుకంత దార వోసినా అమ్మఋణం తీరునా


అమ్మేగద అనురాగం అమ్మేగద మమకారం

అమ్మప్రేమ పొందడమే  మనజన్మకు సింగారం

Wednesday, May 5, 2021

అసలురంగు (గజల్ )


 ముసుగులన్ని తీసిచూడు అసలురంగు తెలుస్తుంది

మనసుతెరలు తీసిచూడు మనిషిరంగు తెలుస్తుంది


యవ్వనమది శాశ్వతమని గాలిలోన తేలిపోక

మలివయసులో మదనపడితె

వయసుపొంగు తెలుస్తుంది


తనునిండిన చీకటిలో తడుముకుంటు నడువనేల

చిరుదివ్వెలు వెలిగించిన పుఢమిరంగు తెలుస్తుంది


ఈర్షాద్వేషాలతోటి యొనగూరిన ఫలమదేమి

ప్రేమకిటికి తెరిచిచూడు

 మనసుపొంగు తెలుస్తుంది


నీకునీవు బంధీవై చీకటిగది నుండకుండ(నెలరాజును నిందించక)

వలపుతలుపు తెరిచిచూడు నింగిరంగు తెలుస్తుంది