పొట్టకుండ కింద
ఆకలిమంటవెటినట్టు కుతకుత ఉడుకంగ
గంజిల గట్కేసుకొని
పొంగుమీద నీళ్లుజల్లినట్టు
కడుపుమంట జల్లారవెట్టుకోను
పాయిరంగ దాగి
సొలుక్కుంట సొలుక్కుంట
దొరల పొలాల్ల ఎట్టిజేసి ఎముకలగూడైన జాతిని
ఇనుము పోతవోసినట్టుండి
అలుముకుంటే అందని రాతికంబాలను
ఏన్గులెత్తలేని బారుకంబాలను
బొక్కల్లబలమంత బుజాలకుదెచ్చి
ఎగిసిపడే ఊపిరిని ఉప్పెనోలె ఎగజిమ్మి
వందలచేతిబలం మోకుతాడుజేసి
ఊరునడుమ బొందలగడ్డోలె
దొరగడీ నిలవెట్టి
పీనుగులై పొర్లాడుతున్న జాతిని
ఆడమగా పిల్లాజెల్లా
ముసలీముతకా అందరు
పొద్దుతిరుగుడు పువ్వోలె
కాయకట్టంజేసి కడుపుతీపు బాపుకోని
కడుపునిండ పిల్లలకు పాలుదాపతీరికలేక
పుట్టెడు దుఃఖంతో బూదేయి పాల్జేసి
సలుపులు బాపుకొని శెమజేసే జాతిని
ఎంగిలిమెత్కుల కాశపడి
దొరజీకేసిన బొక్కలకు బమిసి
ఎన్కనిలవెట్టుకోంగనే
ఎన్నెముకనుకోని బమవడి
జాతిగుణం దాసిపెట్టుకోని
పెద్దిర్కం మొకాన పుల్ముకోని
అమాయికుల వట్టుకచ్చి
గడీతంబాలకు గట్టి
సందులేకుంట గొట్టి
చీకటిగదుల్ల అలమటించి
మనకు మనం జచ్చేటట్టు జేసె
దొరగులాంలకు
తనకడుపు నింపుటానికి
జాతిని తాకట్టువెట్టే
నకిలి కూతలను కౌజుపిట్టల
గొంతుపిసికి బొందవెట్టతందుకు
తెనెవూసిన కత్తోలే మాట్లాడి
పాణందీసే బద్మాసులకు
బడితెపూజ జేసెతందుకు
బుర్కలన్ని కలుస్తున్నయి!
ఎండిన కడ్పుల
పేగులన్ని గల్సి ఉర్లువేనుతున్నయి!
No comments:
Post a Comment