Tuesday, January 23, 2024

గజల్ (శిలలన్నీ)

 గజల్ 


శిలలన్నీ ప్రతిమలుగా ప్రభవించుట సాధ్యమేన మనుషులంత మహాత్ములై వెలుగొందుట సాధ్యమేన


ఊహలన్నీ పెనుగాలికి ఏకమేడలై కూలెను కాలముతో సాగకుండా ఎదురించుట సాధ్యమేన


సాంకేతిక ముసుగులోన సమాజగతి దాగున్నది అభివృద్దిని కాంచకుండా నిదురించుట సాధ్యమేన 


అజ్ఞానపు ఆగాదాలు అడుగడుగున ప్రతిఘటించె 

ప్రత్యామ్నాయ ప్రగతిబాట పయనించుట సాధ్యమేన 


మానవతను మరచిపోయి మనుగడ సాగించు టేల 

మమత లేక మనషులుగా జీవించుట సాధ్యమేన


తోలుబొమ్మలాడించుట సూత్రధారి పనితనమే ఆజ్ఞ మీరి క్షణమయినా మనగలుగుట సాధ్యమేన


అపజయాల చింతనలో కవిరాజుకు కలతెందుకు తెగిన గాలిపటమిలలో పైకెగురుట సాధ్యమేన


పచ్చిమట్ల రాజశేఖర్

Thursday, January 11, 2024

గజల్ (నెరజాణా)

 చిరునవ్వుల తేనియలను చిందించవె నెరజాణా

దరహాసపు నిగనిగలను వెలయించవె నెరజాణా


నీకోసం నిరీక్షణలొ నిలువెల్లా అలసిపోతి

నీరూపం నాకనులలొ పొందించవె నెరజాణా


నింగిలోని నీచెంతకు చేరలేక చితికిపోతి

ఊహలనే రెక్కలనూ మొలిపించవె నెరజాణా


నీఅదరపు చుంబనముకు చకోరమై కాచుకున్న

మధుపానపు పాత్రగైన ప్రభవించవె నెరజాణా


మలిసందెలొ మల్లెలన్ని నన్నుచూసి వెక్కిరించె 

తొలిసందెలొ ప్రభాతమై కనిపించవె నెరజాణా


నీస్మృతులతొ క్షణాలన్ని యుగాలుగా గడుపవడితి

నాజీవిత లక్ష్యానివై మురిపించవె నెరజాణా


నినుజేరెడు దారిలేక నిరీక్షించు నెలరాజుకు

 వడ్డించిన విస్తరివై అర్పించవె నెరజాణా

Sunday, January 7, 2024

నీలో ఏముంది?

 అవని నిండిన అజ్ఞానాంధకారంలో జ్ఞానచంద్రుడు నీవై ప్రభవిస్తావు


తుమ్మెదలన్నీ దరిజేరిన పూదోట నీవేమో అనిపిస్తావు


హరివిల్లులె చుక్కలై విరిసిన గగనం నీవై విరబూస్తావు


ఆకుకొనపై అలరారే హేమంతపు తుషారమై మురిపిస్తావు


మట్టివాసన గుభాళించే తొలకరి నీవై కురుస్తావు


చుట్టూన్న లోకుల పాపాలు కడిగే గంగవై గమిస్తావు


అనాథలకు నీడనిచ్చే గొడుగు నీవై విచ్చుకుంటావు


పశుపక్షాదులను మమైకపరిచేటి  వేణుగానం నీమాట


అన్నివర్గాలు ఆచరించే ఆదర్శవంతపు అడుగుజాడ నీబాట


నిజం నేస్తం

నీలో ఏదో ఉంది 

మానవాతీత మహిమాన్విత శక్తి


అవును నిజం మహానుభావులకు అది జన్మగుణం


పచ్చిమట్ల రాజశేఖర్

Friday, December 22, 2023

నానీలు ( శాంతి)

 అంశం: శాంతి

శీర్షిక: వెతుకులాట


1.శాంతి 

వలసపోయింది

మానవులలోం

దానవ చూడలేక


2.మనసు విరిగిందో

మనిషే ఒరిగిండో

శాంతి

గూడు సెదిరింది


3.శాంతి కోరి

విశ్వాంతరాలలో వెదికిన

అశాంతి

ఆవగింజంత తగ్గలే



4.కార్తిక దీపకాంతి

కలత దీర్చింది

చీకటిలోకంలో

మిణుగురే శాంతి


5.మనసు సచ్చిందో

మనిషే మారిండో

శాంతి

చాలా దూరమైంది


పచ్చిమట్ల రాజశేఖర్

Wednesday, December 20, 2023

నానీలు

 ప్రకృతంతా

తడిసిముద్దైంది

ఆకాశపు

ప్రేమపరవశంలో


పుఢమి 

పూలు పూసింది

ఆకాశ యవనికపై

నక్షత్రాలకు మారుగా


పూలన్నీ 

తలలాడిస్తున్నయి

తోటిమాలి

దయాతుంపరలో తడిసి

Tuesday, December 5, 2023

గజల్ (ఆవసంత)

 ఆవసంత కోయిలమ్మ మూగవోయె నెందుకో

ఆపచ్చని ప్రకృతినేడు ఆకురాల్చె నెందుకో


మనిషిబతుకు యెండమావి నీటిచెమ్మ లేకున్నా

కోరికలే గుర్రాలై పరుగుదీసె నెందుకో 


వలపురాణి చెలిమిలేక వయసన్నది వాడుతున్న

ఆవసంత మాసాంతం విరహవేదనెందుకో


బంధాలే పాశాలై వేదిస్తూ వెలివేసిన

అనుబంధపు ఆనవాల అన్వేషణ లెందుకో


 ఆకసాన చుక్కలదొర వెలుగులెన్ని పంచినా

కవిశేఖరు మదిచీకటి కమ్ముకున్న దెందుకో

గజల్ (రవికిరణపు)

 రవికిరణపు స్పర్శలేక తనువు తపిస్తున్నదీ

చెలికౌగిలి చేరలేక మనసు దహిస్తున్నదీ


పెనవేసిన మనసులనూ విడదీయుట భావ్యమా

నానీడే (కాలమె యమ) పాశమ్మయి నన్ను శపిస్తున్నదీ


కొమ్మనుండి కోయిలనూ దూరంగా తరిమినా

ఆవిరహపు మధురగీతి కడువేదిస్తున్నదీ


నింగిలోని చందమామ వెలుగునంత పంచినా

ఆకసాన పెనుచీకటి కమ్ముకువస్తున్నదీ


మబ్బులలో గుండెతడిని ఆరనీక దాచినా

పాలధార లేకనేల తెగవేధిస్తున్నదీ 


బృందావన తీరాలలొ పూవులెన్ని పూచినా

మధువులకై తుమ్మెదతటి  కడుఘోషిస్తున్నదీ


ఆఆమని వన్నెలన్ని కవిరాజుకు దెలిసినా

వర్ణనలో కలమెందుకు తెగవగపిస్తున్నదీ