దరిచేరని గమ్యానికి దిగులెందుకు నేస్తమా
కాచుకున్న కష్టాలకు వెరపెందుకు నేస్తమా
శిశిరంలో రాలితేనె వసంతమై పూస్తుందీ
చేజారిన విజయాలకు చింతెందుకు నేస్తమా
పాలకడలి విషమువెనుక అమృతపొంగు పొరిలినదీ
ఫలితముకై రేబవళ్ళు కలతెందుకు నేస్తమా
వెలుగువెంటె చీకట్లూ నిశిదాటితె ఉషోదయం
కృషిచేసిన వృధా కాదు గుబులెందుకు నేస్తమా
సరసుశిరసు మాడితేనె మబ్బులయ్యి కురిసేదీ
మార్పుకోరి నడిచేందుకు బెరుకెందుకు నేస్తమా
ఉలిదెబ్బల కోర్వకుండ శిలలువెలుగు లీనవుగా
విజయాలను చేరలేని నడకెందుకు నేస్తమా
గమ్యమెంత కష్టతరమొ కవిశేఖరు డెరుగునులే
అడుగుముందు కేసినడువు అలుపెందుకు నేస్తమా
No comments:
Post a Comment