శరత్తులో చంద్రికనై వెలగాలని ఉందినాకు
వసంతాన కోయిలనై పాడాలని ఉంది నాకు
ఇరుకుహృదిలొ ఇముడలేక తొంగితొంగి చూస్తున్నా
వేసవిలో మల్లియనై విరియాలని ఉందినాకు
వెల్లువలో పల్లవమై వెరచివణికి పోతున్నా
వెచ్చనినీ మదిగదిలో ఒదగాలని ఉందినాకు
చెలరేగే అలనీవై ముంచెత్తా లనిజూచిన
నినునాతో దరిజేర్చగ నడవాలని ఉందినాకు
నీఒడిలో కైవల్యపు సంద్రముంది నిజమేనట
ఆస్వర్గపు తీరాలను చేరాలని ఉంది నాకు
నిత్యమునను నిందించే నరజాతిలొ ఇముడలేను
ఒంటరిగా తుంటరినై ఆడాలని ఉంది నాకు
నలుగురిలో ఒకరిలాగ నీవెందుకు కవిరాజా
బాతులలో హంసతీరు మెరవాలని ఉంది నాకు
No comments:
Post a Comment