Wednesday, November 25, 2020

ముళ్ల బాట

 


మది నిండ మమతలు

యెదనిండ ప్రేమలు

హృది నిండ మానవతా

పరిమళాలు వెల్లివిరిసి

విశ్వనరుడై విలసిల్లిన

నాటి మనిషి నేడు కానరాడు!


పొద్దు వొడిసిననుండి పొద్దు గూకె దాక

నిరంతరం పోటీపడి గడిపే

ఉరుకులు పరుగుల జీవితం

కొండను దవ్వితే ఎలుక ఫలితం!


దుప్పటి తీసి దేవుని జూసే జనం

మూడు ముళ్లు ముచ్చటగ కదిలే

గోడగడియారం వంక గోసగ జూసి

ముళ్లతోటి కాళ్లు కదిపి మురుస్తుండు!


పొద్దు తోటి సద్దు చేయక కదులినా

పొట్ట కూటికొరకు పొరలని మనిషి

నేడు రాత్రనక పగలనక రాటోలె దిరిగినా

కోరికలు దీరక గోసపడుతుండు!


కాలంతోటి కాలుగలిపి

నిత్య చైతన్యముగ నిలువెల్ల శ్రమించి

ఆశ చావక అలసి సొలసి

హఠాత్తుగ  పెద్ద ముళ్లాగి పోతుంది

బతుకుబండి చతికిల బడుతుంది!


రాజశేఖర్ at 11:29 PM

No comments: