నిజాంనిరంకుశత్వాన్ని నిలదీసి
అణగారిన ప్రజలపక్షాన నిలిచి
అగ్నిదారలు కురిపించిన త్రినేత్రుడు!
నవాబుల ఆజ్ఞలపై
ఖాసీంఅకృత్యాలపై
ఎక్కుపెట్టిన శరం దాశరథి!
అణచిన ప్రతిసారీ
అలజడులు సృష్టించే
ప్రభంజనమై పైకెగిసిన పెనుఉప్పెన!
తనపద్యదారలు ప్రవహించిన
ప్రతీచోట నిప్పురాజేసిన ప్రభాకరుడు!
రాజదురహంకారం రాతికోటల్లో బంధించినా
చలించని సంకల్పంతో బొగ్గుటులితో
గోడలనిండా పద్యఫిరంగులు
పేర్చిన ఉద్యమశిల్పి!
చావుకెదురునిలిచి
వెరపన్నది కొనగోటికైన తాకకుండా
పదునైన కవితాధారల
నిజాంరాజుల బూజుదులిపిన
కవితాదురంధర ధైర్యశాలి!
నల్లనిచీకట్లు పులిమిన తెలంగాణమున
కరవాలహలముతో చీల్చి
అక్షరవిత్తులు నాటిన సేధ్యకాడు!
తెలగాణమ్మున వేళ్లూనిన
రాక్షసరాజరిక వటవృక్షమ్మును
కూకటివేళ్లతో పెకిలించిన గిరిధారి!
తాడితపీడిత ప్రజాగళం
తెలుగు ఉర్దూభాషలే నేత్రయుగళం
అమాయకప్రజల నాసాంతం దోచిన
రజాకార్ల కోరలు పీకిన అసురసంహారి
వెట్టిచాకిరితో శ్రమనుదోచిన
దొరల ఆగాడాలకు అడ్డుకట్టలేసిన మురారి
తడిసిన దున్నపోతై
మొత్తంగా మొద్దుబారిన తెలంగాణను
రుద్రవీణారవమున
జాగృతపరిచిన వైతాళికభానుడు!
అజ్ఞానపుచీకట్లనుచీల్చి
తెలంగాణ వెలుగుల్ని
తేటతెల్లంచేసిన తెలంగాణవైతాళికుడు దాశరథి!
దొరల ఏలుబడిల
నిజాం పాలనల
ధనమానప్రాణాలకు దాపులేక
మైలవడిన తెలంగాణల
కవితాహోమమొనరించి
అగ్నిధారల ముంచి
పునీతగావించిన పుణ్యపురుషుడు దాశరథి!
(దాశరథి స్మరణాంకిత కవితాపుష్పం)
రాజశేఖర్ పచ్చిమట్ల
No comments:
Post a Comment