Saturday, August 1, 2020

తెలంగాణ అస్తిత్వం కాళోజీ (కైతికాలు)


నిజాం నెదురించిండు
దొరలమెడలువంచిండు
అణగారిన వారినంత
అనకొండలు జేసిండు
వారెవ్వా తెలుగోడు
ప్రజలమనిషి కాళోజీ - 30

భాషతోనె బతుకన్నడు
యాసలోనె భవితన్నడు
భాషయాస మరచిపోతె
బతుకుదెరువు లేదన్నడు
వారెవ్వా కాళోజీ
తెలంగాణ హీరోజీ - 31

ఉద్యమంలో ముందుంటడు
అన్యాయాన్నె దురిస్తడు
ప్రజలబాధ లన్నింటిని
తనబాధగ భావిస్తడు
వారెవ్వా కాళోజీ
సామాన్యుల హీరోజీ -32

అన్నదమ్ముడెవడులేడు
న్యాయాన్యాయాల తాన
తప్పుచేస్తె యెవడినైన
నిలదీస్తా ఉన్నతాన
వారెవ్వా కాళోజీ
నిజంగానే ప్రజలమనిషి - 33

ప్రజాగోడు ప్రకటించగ
కలమెత్తిన  కవియోధుడు
ప్రజలుద్యమ నాయకుడై
గళమెత్తిన మహధీరుడు
వారెవ్వా కళన్నా
తెలుగు ప్రజల పెద్దన్నా - 34

బడిపలుకుల భాషగాదు
మనపిల్లలు చదువవలెను
పలుకుబడుల భాషలోనె
ప్రజలంతా చదువలెను
వారెవ్వా కాళోజీ
తెలంగాణ వెలుగోయి - 35

ప్రజలగొడవను ప్రశ్నించ
పాళినిసవరించినాడు
బడుగుజీవి బాధలకై
గొంతును సవరించినాడు 
వారెవ్వా కాళోజీ
కలము దూసిన శివాజీ! - 36

కలములోని సిరానంత
అక్షరమాలలుగమలచె
గళమెత్తి గర్జించి
లక్షమెదళ్లు గదిలించె
వారెవ్వా ! కాళోజీ
పడలేదెన్నడు రాజీ! - 37

పలుకుభాష రాయుభాష
రెంటినడుమ భేదమేల?
పలికేటిది రాయుటకూ
మనుషులంత జంకనేల
బడిపలుకులు కాదుభాష
పలుకుబడియె అసలుభాష - 38

No comments: