Monday, August 17, 2020

బహుముఖ వజ్రం - పాములపర్తి

ఆరడుగుల దేహధార్ఢ్యము

ఆచ్ఛాదనపు పంచెకట్టు

సాధారణ లాల్చీలో ఇమిడిన

అసాధారణ రూపం!

ధీరత్వం సాకారమైన

ఆజానుబాహుడి అసలు నిర్వచనం!

బహుభాషా నేర్పుతో

వాణీవిలసిత ముఖవర్చస్సు

గర్వమించుక గానరాని

లక్ష్మీవిలసిత లలాట పలకము

స్నిగ్ధగంభీర ప్రసన్నమూర్తి మన పాములపర్తి!


కన్నవారిని చేకొన్నవారిని 

యశచ్ఛంద్రికల నలంకరించి

వంశప్రతిష్టను వెండికొండ

నడినెత్తిన నిలిపిన వంశోద్ధారకుడు!


కుంటుతున్న ఆర్థికవ్యవస్థకు

కట్టుగట్టి పట్టాలెక్కించి

పరుగులద్దిన అపర ఛాణక్యుడు

చుట్టలిరిగిన బండికి సారధియై

పడిపోకుండ ప్రభుతను నడిపిన

లౌక్యమెరిగిన లౌకికవాది

ఆపద్ధర్మంగా ప్రధానమంత్రిత్వం చేకొన్నా

ఆదర్శవంతంగా నలరించిన ధీశాలి!

దేశభవిష్యత్తును తీర్చుటలో

క్రియాశీల రాజకీయ కౌశలంజూపిన దార్శనికుడు!


సామాన్యపౌరునిగా శాసనసభ్యునిగా 

మంత్రి కేంద్రమంత్రి ప్రధానమంత్రిగా

పదవేదైనా ప్రతిభతో మెరుగులద్దిన మహామనీషి!


మాతృభాషాభిమానిగ మసలుతూనే

పలుభాషాపాండిత్య మార్జించిన బహుభాషావేత్త!

నిండుయవ్వనంలో నిజాం ఆజ్ఞలను దిక్కరించి

హైదరాబాద్ విముక్తిగోరి

వందేమాతరగేయమాలపించిన మాతృదేశాభిమాని!


బూర్గుల బుద్ధికుశలతానీడలో

 పండిన మేథస్సుతో

న్యాయవాదపటిమతో

భూస్వామ్య వర్గాల నెదురించి

భూసంస్కరణలు చేసిన సమసమాజస్థాపకుడు!


అవిరళంగా రాజకీయబాధ్యతలు మోస్తూనే

సాహిత్య పఠనాభిలాష

రచనావ్యాసంగాల పట్ల ఆసక్తివీడని సవ్యసాచి!


అబలాజీవితం లోపలిమనిషిని

సహస్రఫణముల సాక్షాత్కరించిన సాహితీవేత్త!

ఆర్థికసంస్కరణలతో అబ్బురపరిచిన ఆర్థికవేత్త!

పలురంగాల్లో ప్రతిభజూపిన

బహుముఖ ప్రజ్ఞాశాలి!

పలుకోణాల్లో ప్రకాశించిన

దక్షిణాది కోహినూరు పాములపర్తి నరసింహం!

No comments: