చెట్టును కట్టెలా చూడకు నేస్తం!
చెట్టునూ మానని
మనసులేనిదని యెంచకు నేస్తం!
చెట్టు ఫలమిచ్చి కల్పవృక్షమై కనవడుతది
చెట్టు పూలనిచ్చి తత్వబోధిని తలపిస్తది
ఆకులపళ్లెమై అలరారినపుడు
అన్నపూర్ణైతది
నీడనిచ్చి సేదదీర్చినపుడు
కన్నతల్లైతది
చేతికర్రై ఊతమిచ్చిననాడు
నాన్నై నడిపిస్తది
పశుపక్షుల కాశ్రయమిచ్చినవేళ
తల్లిఒడిని తలపిస్తది!
ప్రాణవాయువునిచ్చి
ప్రాణికోటిని పరిరక్షించువేళ
అమృతమై అలరారుతది!
చెట్టుతనం కట్టెతనమై
అచేతనమగు కట్టెను కాలుస్తున్నపుడు
మోక్షమిచ్చే మార్గమైతది!
అయినా
నువుగొడ్డలితో నరుకుతుంటే
ఆనందంగ నేలకొరుగుతది!
త్యాగానికి నిలువెత్తు నిదర్శనమై
మంచితనానికి
మనసున్న తనానికి
తరువే గురువై తారసపడుతది!
No comments:
Post a Comment