Monday, June 15, 2020

గతించని జ్ఞాపకాల ముల్లె

వత్సరాలు గతించిపోతున్నయి
ఏడుగుర్రాల రథమెక్కిన సూర్యుడు
ఎడతెరిపిలేకుండ తిరుగుతనే ఉన్నడు
ప్రకృతి పాతనుయెదలోతులో దాచుకొని
కొంగొత్త అందాలొలుకుతుంది

అయినా
నీ జ్ఞాపకాలు మమ్ముల్నొదిలడంలేదు
సిరంచకోట గుట్టల నడుమ
పచ్చనిపందిరిని మోస్తున్న తాడిచెట్లల్ల
పొందికగ పొందిచ్చి కట్టిన
తాటికమ్మల మండువ
చిలుకొయ్యకు తలిగేసిన మోకుముత్తాదు
యేళ్ల పొడువూత నువు గొట్టిన నెర్సుబండ
శరీరం వక్కలైన నీటిని మోస్తూ కత్తిమైలదీసే మొర్రిబింకి
నీకత్తులకు పదునువెట్టిన
తీడుగొల
మేఘాలనురుగులు నిండిన కుండలను
భుజంమోసిన కావడిబద్ద
అన్ని దిగులువడుతున్నయి
మమ్ముల్నెందుకు ముడుతలేరని!
నిండా శోకంల మునిగినయి
మాగౌడు గనవడ్తలేడని!
వనంల అడుగువెడ్తెజాలు
దినమంత ఎప్పుడు పిలిచినా
పలికే నీ ఆత్మీయపలుకులు
నన్ను స్పర్శిస్తు దోబూచులాడుతున్నయి
నీఅడుగుల గుర్తులు
కన్నీటి చెలిమలై
పాలిపోయిన నాప్రతిబింబాన్ని చూపుతున్నయి!
నీకునీడనిచ్చిన
మండువలో మర్రిచెట్టు నిలువునిత్తారం పడ్డది
జువ్విచెట్టు తన్నుతాను మార్చుకొని నాజూకయింది
భూబకాసురుల పారదెబ్బలకు
గడ్డంత గలిసిపోయి పొలమైంది
మండువ గూలి మొండెమైంది
మోకుముత్తాదు చీకిపోయింది
నీవు గలియదిరిగిన తాళ్లని
తలనరికిన సిపాయిలైనయి!

నీవులేక కళదప్పిన మనయిల్లోలె
మండువంత వెలవెలబోయింది!
నీవులేక ఆకులుపరుచుంది
యెల్లమ్మగుడినిండ!
నీ మడితానాలులేక
దేవతామూర్తులన్ని
మైలవట్టి గానరావట్టినయి!

ఊటచెలిమలైన కన్నీరెంత బారిన
తుడుచలేక పోతుంది
మనసులో పాతుకున్న నీబొమ్మను!
ఎంతమంది మావెంటున్నా
మమ్మల్ని వదలడంలేదు నీవులేని లోటు!

ఏ ఉడుతలకు చెట్లెక్క నేర్పుతున్నవో
ఏచిలుకలు తీయని పలకరింపు నేర్పుతున్నవో
ఏబాటసారులకు గుడిసెలేత్తున్నవో
ఏ తేనెటీగలకు కల్లంపుతున్నవో
ప్రకృతిలో లీనమైన నువు
సాల్లెన్ని గడిచినా
మరువలేకపోతున్నం నాన నిన్ను!
నీ తలపులు వీడి
మనలేకపోతున్న నాన!

(పదేండ్ల కింద దివికేగిన నాన్న యాదిలో)

No comments: