Wednesday, September 2, 2020

శీర్షిక: అమూల్య వార్ధక్యం

పేరు: పచ్చిమట్ల రాజశేఖర్
ఊరు: గోపులాపూర్
జిల్లా: జగిత్యాల
9676666353

శీర్షిక: అమూల్య వార్ధక్యం

కాలంతో కాలుకదిపి
సామాజిక స్పృహనెరిగి
శైశవబాల్యాది క్రీడల
జీవన్నాటకాన్ని రక్తికట్టించి  సమర్ధత
యవ్వనవార్ధక్యాది జ్ఞాపకాలు 
పోగుజేసుకున్న అపురూపదశ వార్ధక్యం!
తేనెలో ముంచిదాచిన మగ్గినమామిళ్లు ముసలోల్లు!

గతం తాలూకు ఆటుపోటులు
వర్తమానపు ఎదురీతలు
అనుభవపాఠాల నధ్యయనం చేసి
గతుకుల బాటలో కుంపుకుదింపు నెరుగక
సునాయాసంగ కాలమెల్లదీయు
ఉపాయాలెన్నో గ్రంథస్తంచేసిన 
నడిచేపుస్తకం వార్ధక్యం!
అసలుకన్న వడ్డీముద్దన్న నానుడికి నిర్వచనమై
నీతికథలు ఇంపైనపద్యాలు 
పొడుపుకథలు పొందికైనసూక్తులు
మానవజీవితాంబుధి లోతుల్లో వెదికితెచ్చిన
మేలిమిముత్యాల వెలుగులద్ది
భావిపౌరులకు సౌరులద్దే 
మంచిగంధపు కల్పతరులు వయోధికులు!
పాతతరం మనుషులేగాని
పాతవస్తువులుకాదు
పాతసంస్కృతి వారసులు
కొత్తసంస్కృతి వారధులు 
ఆపాతమధురానుభూత 
ఫలభారయుత తరువులు వయోధికులు!
కష్టాలకెదురీది నిగర్వంగా నిలచి
గతంభూమికగా భావినిపసిగట్టే యోచనతో
కార్యదక్షతా కుశలురై
అనుభవాల భారంతో వంగిన
ఇంద్రధనుసులు వయోధికులు!

సుకుమార కుసుమకోమల
పల్లవారుణ పసిడివన్నెల పసిబిడ్డను
ప్రపంచానికి పరిచయంజేసి
అంచెలంచెల నీయెదుగుదలకు ఆలంభనై
అందని నీశిఖరోన్నతికి గర్విస్తూ
ఆకాశమందే నీగమనానికి అడ్డుతగలక 
విరబూసిన రంగుపూల చెట్టుకు
మూలం తామని ఈసృష్టికి తెల్వనీయక
నిత్యనూతనమై చిగురించే జవసత్వాలనందించ
మట్టిలో కూరుకుపోయిన వేళ్లు వయోధికులు!

తుమ్మెదలు అనురాగోపేతమగు ఆలింగనమున
పూవుకందకుండా పుప్పొడి గొనిపోయినట్టు
తోటమాలి చిలికిన పన్నీటపురుడువోసిన తరుల
శాఖను నొప్పించకుండా పూలుగోసినట్టు
కొమ్మవిరుగకుండ పళ్లుతెంపినట్టు
అనుభవాలనందిపుచ్చుకోవాలే 
నీళ్లువోసి నీడనుపొందాలే గాని
మనకురెక్కలు మొలిపించడంలో 
రెక్కలుడిగిన పక్షులను 
కుక్కిమంచంల కూలదోసి
గూటికి కుక్క కావలుంచి
స్వేచ్ఛాపతంగమై దూదిపింజల 
తెలిమేఘాలు దాటి తేలిపోయి
నింగిన విహరించినంత చుక్కలే చుట్టాలనుకోకు
నీఉనికికి ఆధారమైన 
వృద్ధుల అనుభవాలు నేసిన దారం తెగిననాడు
అథఃపాతాళానికి పడిపోగలవని యెరుగు!

No comments: