Tuesday, September 8, 2020

రైతు - కైతికాలు

 బండబారిన నేలలను

చెమటచుక్కల తడుపువాడు

బక్కటెద్దుల అరకతో

దుక్కిదున్నె సేద్యకాడు

వారెవ్వా! శ్రమజీవి

యెల్లలోకపు పుణ్యజీవి! - 45


అహర్నిశలు శ్రమిస్తూనె

మెతుకులెన్నొ మొలిపిస్తవు

కడుపునిండ కుడువకనే

పలారమని పంచిస్తవు

వారెవ్వా! హలధారి

తిండిగింజల సూత్రధారి-46


పగలురాత్రి పంటకాపు

నాగటెడ్లె నీకుతోడు

అలుపెరగని సేద్యకాడ

అన్నపూర్ణె నీకుజోడు

పుణ్యజీవి రైతన్నా

ధన్యజీవి రైతన్నా! -47



నారువోసి నీరువోసి

అనుదినమ్ము కాపుగాసె

పంటగోసి ఫలమునూర్చి

అన్నమురాశులుగవోసె

వారెవ్వా! కృషీవలా

నీత్యాగనిరతి భళాభళా! - 48


ఉడుతనెమలి ఒకరికొకరు

ఆప్యాయత కనబరిచెను

జాతివైర ములనుమాని

స్నేహకొలను విహరించెను

వారెవ్వా! చెలిమిజూడు

క్రొంజివురులు తొడిగెనేడు! - 49

No comments: