Thursday, September 17, 2020

మబ్బులు తొలగిన పొద్దు (సాయుధపోరాటవీరులు)


మువ్వన్నెలజెండతీరు మూడుభాషలప్రజలు మురిసియాడిననేల

కుడుమంటే పండుగని కులమతాలుమరిచి సంబురాలాడేనేల

అజ్ఞానానికి తోడు అమాయకత్వం కలగలిసి మానవత్వం పరిమళించిననేల తెలంగాణ!

నైజాముల పాలనలో నాజీల అరాచకాల్లో రజాకార్ల దోపిడిలో దొరలఏలుబడిలో చతికిలవడిన నేల 

ప్రభువర్గపు అమానవీయ అకృత్యాలతో తనువుపుండైన నేల

మతోన్మాదం వేవేలనాల్కల విషంగక్కిననేల తెలంగాణ!

దోచుకున్న రైతుల పంటలు దిగంబరంగ బతుకమ్మలాడిన మహిళలు

గోళ్లకింద వొడిసిన గుండుసూదులు చెవులకుగట్టిన బరువుల మోతలు

ముక్కువిండి వసూలుజేసే పన్నులు 

దౌర్జన్యాన్ని దాష్టీకాన్ని తప్పించుకొని ఉప్పొంగిన అలలు తెలంగాణపల్లెలు!

పల్లెల దశనూ దిశనూ మార్చి తెలంగాణను పునీతగావించ 

ఉద్యమించిన ఉద్యమకవలలు హింసాహింసలు!

సాయుధరైతాంగపోరాటం మోకుతాడులో పోగులైన

ప్రజలు ప్రజాస్వామికవాదులు కవులు రచయితలు కళాకారులు

అట్టడుగువర్గాలే గాదుఉన్నతవర్గాల ఉద్యమకారులు

ప్రజాశ్రేయస్సుకోరి పోరుజేసి 

ఉరకలెత్తె ఉడుకునెత్తురు పులిమి పోరుపతాకకు అరుణవర్ణపు అత్తరుపూసి

నైజాంపాలనకు చరమగీతం పాడి తెలంగాణ బంధనాలు తెంపి

స్వేచ్ఛావాయువులందించి శాంతినిపండించిన వీరులు

మోదుగుచెట్టుకు పూసిన అగ్గిపూవులు

అమరులై ఆకాశాన మొలిసిన చుక్కలు సాయుధపోరాట యోధులు

No comments: