పచ్చనిపంటలు
మొలిపించిన నాగలి
ఊయలూగుతుంది నేడు
మోడుబారిన చెట్టుకు -1
పల్లెతనం
డొల్లతన మయింది
పట్నపు హంగులు
పులుముకొంది - 2
పక్షులన్నీ
వలస వోయినయి
వట్టివోయిన
చెరువుల నిలువలేక-3
తాజ్ మహల్
తలదించుకుంది
గిజిగాడు అల్లిన
ఊయల మేడను జూసి -4
ఎడారి ఆకలికి
ఒయాసిస్సు బియ్యపుగింజ
పేదోడి ఆకలి దీర్చ
ప్రభుత్వ పథకాలు తీరు -5
పుస్తకం అలిగింది
తలుపు దెరువని బడుల జూసి
బడిమొకంజూడని
పిల్లల జూసి -6
మనసు పీకి
గడీయారపు కొయ్యకు
తగిలించిండు మనిషి
గంటల నడుమ ఊగిసలాటే -7
చేపలు నీటికి
ఎదురీదుతున్నయి
ఆటవిడుపుకు గాదు
ఆకలి వేటకు - 8
బువ్వ
బురదయింది
ప్రకృతి
వికృతచేష్టలతో - 9
కృషీవలుడు
బయటపడకుండు
విత్తనకంపెనీ
వలనుండి- 10
అలసిన
రైతు కదలలేకుండు
ధరణి
పొత్తిళ్ల సేదదీరిండేమో -11
నాయకులు
జమచేస్తుండ్రు మనీ
ఓటరుకు
ఎరేయడానికనీ- 12
పెద్దమనిషి
ఏషం మార్చిండు
ఖద్దరేసి
గద్దెనెక్కిండు - 13
మనిషి
పరాధీనుడైండు
పైసల
మోహం వీడలేక -14
మనిషి
పరుగులువెడుతుండు
గడియారపు
ముళ్లుపొడుస్తుంటే -15
రోగం
భోగాన్ని మరిపించింది
మనిషిలోని
మనసు చిగురించింది -16
No comments:
Post a Comment