Sunday, October 18, 2020

బతుకమ్మ గోడు

 అడవిన తంగెళ్లు తలనిండపూలతో

సింగారించుకున్నా

ముత్యాలోలె జాలువారి 

గునుగుపూలు విస్తరించినా

రాచగుమ్ముళ్లు రాకుమారసొంటి 

గౌరమ్మను ఆకుపొత్తిళ్లలో ఊయలూపుతున్న

బీరపూపాదులు పసుపుపూతతో మెరిసిపోతున్న

చెరువంతా జోతులకాంతులోలె

తామరలు పరుచుకున్న

ఏఒక్కరూ పూలు దెంపలేకున్నరు

కరోనా పుణ్యమాయని

కాలుగడపదాటలేకున్నరు

సద్దులబతుకమ్మను మది నిలుపుకొని

యాడంత ఎదురుజూసిన జనం

గల్మముంగట కాచుకూసున్న 

మహమ్మారిని దాటి బతుకమ్మను పిలువ

భయపడుతున్నరు

ఈపీడను నిలదొక్కుకొని 

గౌరమ్మనాహ్వనించలేక

ముదితలంత మదనపడుతున్నరు


 గండుకోయిలలై గళమెత్తె పెద్దమనుషులు

మూతికట్టుతో ముడుచుకూసున్నరు

చప్పట్లతాళాలతో దరువేసే పడతులంత

గుమిగూడభయపడి లోగిల్లు వీడకున్నరు

వీధులన్నీ పూలవనాలై

పల్లెలన్నీ పూలబోనమెత్తే వేళ

గాలిసోకి గావరైన పల్లె

బతుకమ్మకు వాయినాలియ్య భయపడుతున్నది.


(కరోనా సోకిననాటి బతుకమ్మ)


No comments: