మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు
ఒళ్లో వాలాలనుంది తల్లిపేగుకు
మళ్లీపోవాలనుంది పల్లెటూరుకు
మళ్ళిమళ్ళీ పోవాలనుంది తల్లిచెంతకూ
అలలతీరు సుడులుతిరిగె జ్ఞాపకాలు నెమరేయుచూ
అనుభవాల దొంతరలను అహర్నిశలు తడిమేయుచూ
మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు
ఒళ్లో వాలాలనుంది తల్లిపేగుకు
వసివాడని పసిప్రాయం గాలమేసి లాగుతుంటే
ఆప్యాయత లొలికేలా అమ్మలాలి పాడుతుంటే
చిన్ననాటి జ్ఞాపకాలు గిలిగింతలు పెడుతుంటే
ఆవసంత తీరాలకు ఆగకుండ సాగిపోయి
ఒదగాలని వున్నది ఆమధురావని ఒడిలోనికి ॥మళ్లీ॥
పల్లెనిడిచి తల్లినిడిచి వెలగబెట్టినదియేమిటొ
పచ్చదనపు గుండెచీల్చి పాముకున్నదది యేమిటొ
నిలువనీడనిచ్చు తరుల కూలగొట్టె కుతంత్రాల
వాసనైన సోకనట్టి జనపదాల జాడవట్టి ॥మళ్లీ॥
ఎంతకాలమయ్యిందో యెదలనిండ శ్వాసించి
ఎన్నిరోజులయ్యిందో మనసారా భాషించి
ఆత్మీయతలడుగంటి అనురాగం కొడిగట్టి
ఎండినగుండెల లోతున ఆరని ఆతడినెతుకుతూ
ఒక్కసారి తనివి తీర మట్టిని ముద్దాడాలి
(తనివితీర తల్లియెదను తడిమి మురిసిపోయేందుకు )
వెక్కియేడ్చే తల్లి యెదశోకం బాపుటకు ॥మళ్లీ॥
ఆఘ్రానించాలనుంటే ఆమట్టి పరిమళం
ఆస్వాదించాలనుంటే ఆజీవనమాధుర్యం
తప్పదు మానవజాతి ఆత్మావలోకనం
ప్రగతిముసుగుదీసి మరల పల్లెసొగసు చూసేందుకు ॥మళ్లీ॥
మరబతుకులు మాకొద్దని మనసు మొత్తుకుంటుంటే
పచ్చనైన పల్లెసీమ స్వాగతాలు పలుకుతుంటే
సీతకోకలై మనస్సు గాలిలోన తేలియాడ
కలలు మరచి కన్నతల్లి కౌగిలిలో చేరేందుకు ॥మళ్లీ॥
తప్పటడుగు తెలుసు కోని తల్లి ఒడిని చేరుదాం
సాలెగూటి పోగులోలె పల్లెను కాపాడుదాం ॥మళ్లీ॥