Monday, November 27, 2023

ప్రజా పాశుపతం (ఓటు)

 

అందని ఆశలు రేపి

అమాయకప్రజల నాడించే

నయవంచక నాయకుల

నడ్డివిరిచే పాశుపతాస్త్రం


మద్యమాంసాల మత్తులమమరిపించి

నోట్లు చూపి నోరూరించినా

తాయిలాల గమ్మత్తులో చిత్తుగాక

గుండాల గుండెల్లో దింపే పోటు


ఉచిత పథకాలు ఉత్తుత్త హామీలు

అమలుకు నోచని ఆశల పలారానికై

 అహరహం ఎదురుచూపులు

సంక్షేమం అందనిద్రాక్షేనని తెలిసి

స్వక్షేమాన్ని గద్దెదించే ప్రజాతీర్పు


అయిదు రోజులు అందట్ల దిరిగి

కడుపులు గడ్డాలు వట్టుకొని

అయిదేండ్లు బానిసల్లా జూసి

ఎదురుతిరిగితే యెదలతన్నే

అణచివేతను తుణిచివేసే వజ్రాయుధం


ఓట్లపేరుతో వరదలుగ పారుతు

వంగివంగి దండంపెట్టి

గెలిచినం పంగనామాలు వెట్టే పాలకులను

మనీదప్ప మనుషి మర్మమెరుగని 

దగాకోరు నాయకదండును

పల్లెఅతీగతీ దెలువని మదపుటేనుగు

పెద్దమనుషుల మెడలువంచే అంకుశం


అహం నిండిన ధుర్యోధనాదుల

ధనాధికార మదమణిచే పరుశురామాస్త్రం

రాజకీయ వంచన చేసే

రాబందుల రెక్కలు నరికి

విచక్షణాయుత విలువలు దెలిసి

ప్రజారంజకపాలకుల నిర్ణయించే పెద్దరికం

అసలు సిసలు ప్రజాస్వామ్యం

No comments: