Tuesday, December 31, 2019

నడిచే దేవుళ్లు

అవనిపై నడయాడే అపర దేవతారూపాలు
మన ఆశలుదీర్చే అమృతభాండాలు
చెమటను చమురుగజేసి సత్తువంత వత్తిజేసి
మన బతుకున వెలుగునింప  కరిగిపోవు దీపాలు
వారిఆశల నణుచుకొని వారసుల భవితను కలగంటారు
నీ యెదుగుదలకు అట్టడుగున నిలిచి పునాదవుతారు
నీఓటమి తాలూకు వేదనకు బాసటవుతారు
నింగికెగసిన నిన్నుచూసి పొంగిపోతారు
భంగపాటును చూసివారు కుంగిపోతారు
జగతి నిన్ను ప్రశంసిస్తే హర్షిస్తారు
నీఉనికిని విమర్శిస్తే వర్షిస్తారు
రెక్కవిదిల్చి మనమెగిరిపోతే మదన పడుతారు
మళ్లీమళ్లీ త్యాగాలకు ఒడిగడుతారు!

రాజశేఖర్ పచ్చిమట్ల
31-12-19

Sunday, December 29, 2019

సీసపద్య సొగసు



సీసపద్యాలను ఛీదరిం చుటగాదు
సీసమే పద్యాల శిఖర మౌను
గాన యో గ్యములైన గమకమ్ము లనుగూడి
సంగీత ఝరిలాగ సాగి పోవు
పాల్కుర్కి సోమన్న పాండిత్య మునుదెల్ప
సీసము లనుగూర్చి రాశి వోసె
సరళప దాలలో సరసభా వమునిల్పి
సెలయేటి పరవళ్ల సేర దీసి
శ్రీనాథ కవిరాజు శ్రీపతు లొప్పేల
సీసము లనురాసి సిరుల నొందె

పద్య మందు మిగుల హృద్యమౌ సీసమ్ము
నవర సభరి తమయి నాట్య మాడె
పండి తులనె గాదు పామరు లునుమెచ్చె
సీస పద్య మిలలొ వాసి కెక్కె

Monday, December 23, 2019

శీర్షిక: మధురజ్ఞాపకం ఆరోజు


పేదవాని కడుపుమంట చల్లార్చే మెతుకులవర్షం కురిసిననాడు
బిచ్చెగాళ్ల జోళెలొదిలి కాయకష్టాన్ని నమ్ముకున్ననాడు
వృద్దాప్యంనిండిన వృత్తులన్ని నవయవ్వన సవ్వడి జేసిననాడు
స్వార్థపుమురికి నిండిన మనుషుల యెదల్లో త్యాగపరిమళాలు వెల్లివిరిసిననాడు
కులమతాలకుళ్లును వదిలించే
మానవతగంగా తరంగాలు మహిని వెల్లువెత్తిననాడు
అవుతుంది భువిలో అద్భుతమే ఆరోజు
నామదిని ఆనందడోలికల ఊయలలూపుతూ

Thursday, December 19, 2019

గజల్

నిండుచంద్రుని వెదకడంలో రాత్రులెన్నో గడిచిపాయె
నీకోసం నిరీక్షణలో దినములెన్నో గడిచిపాయె

మావరాకను మదిన తలచి హృదయద్వారము తెరిచివుంచితి
రాజకొమరుడు రాకలేకనే రాత్రులెన్నో గడిచిపాయె

నీటియద్దము తెరలమీదనీ
మోముచందురు గాంచజూచితి
అలల కదలిక లాగకుండనే
రాత్రులెన్నో గడిచిపాయె

పూలవనమును కలియదిరిగితి సీతకోక చిలుకనై
వదనారవిందం వెతుకుటలో వనములెన్నో దాటిపాయె

నిశికన్నెల నిజరూపం కవిరాజుకు గనపడకనే
ఊహలలో ఊగిసలతో రోజులెన్నో గడిచిపాయె

Sunday, December 15, 2019

శీర్షిక : సమ్మోహన రూపం


ప్రియతమా!
ఆకాశంలోని ఇరులన్నిటినీ
గుప్పిట బంధించినట్టు
అలవోకగా నల్లనికురులను
వామహస్తమున మడచిపెట్టిన నాచెలీ!

నల్లకలువల కొలువులైన
కన్నుల చూపులను
నా స్పటికపుహృదయంపై
వారజేసిన నా చెలీ!

అరవిరిసిన వెన్నెల వదనమున
దరహాసము మెరియగ
ఎరుపెక్కిన చెక్కిలి సొగసు
కైపెక్కిస్తున్నది నా చెలీ!

జడులను సైతం చైతన్యపరిచెడు
భానూదయ కరస్పర్శ
చిగురించెడు చెంగల్వ సొగసుల
కౌముదీయుత కౌమారచందురిని
కిందజేయు దేవకన్యవై
నాకనుచూపుల కడ జేరితివి చెలీ!

అప్సరసాంగన వైన నీరూపం
నన్ను భావకవినిజేసింది!
మోహనమూర్తివైన నీరూపం
నన్ను నీ దాసుని జేసింది!

ప్రియా!
నాకనులలో నీరూపం చెరిగిపోనీయకు
నామదిని ముగ్ధ మనోహర
ప్రణయకావ్యమొనరించి
నీ సొగసున కంకితమిస్తాను చెలీ!




Tuesday, December 3, 2019

చిగురించిన మోడు



బతికినన్నాళ్లు
పరులకొరకు పరితపించి
ఉల్లు కొరుకుతున్నా
ఊరకుండి
నీర గార్చి నీరసించి
త్యాగంతో తనువంతా
చిక్కి శల్యమై శుష్కమై

మోడుగ మారిన
ఈదుల మొరే
ఈశ్వరుని ముట్టిందో
ఎండిన తనువు చిగురించింది!
నిలువెల్లా లతావితానమై
విరులతో పరిమళాంచింది!

ఉట్టి


పూరి గుడిసెలో
పెంకుటింట్లో
నట్టనడుమ
ఉట్టిమీద బువ్వకుండ
ఊగుతుంది ఊయల!


కుక్క పిల్లులు
కాల్గాలిన పిల్లులై తిరుగుతూ
లొటపెట పెదాలకు నక్కాశపడ్డట్టు
ఊరిళ్లూరుతుంటయి!

ఆకాశంలో వేలాడే ఉట్టి
అందదు యెలుకకు పిల్లికి
భద్రతకు భరోసా ఉట్టి
నమ్మకానికి నమూనా ఉట్టి!

ఉట్టిమీది కూడు వట్టిపోదు
గాదెల్ల దిన్సుకు తెగుల్రాదు
మనతాత ముత్తాతల
మేథస్సు సజీవసాక్ష్యం!
పూరిగుడిసెల
ఒంటరిగా ఊగుతుంది ఉట్టి
మూడుకాళ్ల ముసలితీరు!

Monday, December 2, 2019

శీర్షిక: గగన విహారి గడ్డ



మట్టి పొరల్లో పురుడోసుకున్న మేలిమి ముత్యం
దుబ్బతో దోబూచులాడిన పగడం

యెల్లవారలకు తల్లైన ఉల్లి
తల్లికన్నా హితైషిగా తళూకులీలిన ఉల్లి

వారసంత పెద్దర్వాజ కటూఇటూ ఉండి
అందరినీ స్వాగతించిన ఉల్లి
ధనగర్వంతో అందరికీ దూరమైతున్నది
మట్టితో  మమైకము నెడవాసి
మనిషితో మమకారము నంటువాసి
పుడమి పొత్తిళ్ల నొదిలి
దినదిన ప్రవర్థమై
ఇంతింతై వటుడింతై
మబ్బుల కెగబాకి
గగన విహారియై గర్వపడుతున్నది ఉల్లి

తల్లితనాన్ని మరిచిన ఉల్లినిజూసి తల్లడిల్లుతుంది జనం!
చుక్కలకెగబాకిన సక్కనమ్మకై బిక్కుబిక్కుమంటూ బెంగటిల్లుతుంది జనం!

Wednesday, November 27, 2019

ఆలోచనల
సంకల్పం అంకురిస్తుంది
ఆచరణమున
సంకల్పం సిద్ది స్తుంది
అడుగడుగునా ఎగుడుదిగుడు లెన్నున్నా
ఆత్మస్థైర్యం
అన్నింటిని జయిస్తుంది

వారెవ్వా బసవన్నా
జగతికంత ఆదర్శమన్నా

Sunday, November 17, 2019

తెలుగు వెలుగేదెలా ?

తెలుగు భాష తెలుగుభాషని
వేదికల మీద గొంతు చించుకున్నంత మాత్రాన
భాష పూర్వ వైభవమొంది భాసిల్లుతుందా?

తేనెలొలికేటి తెలుగు భాషని
మకరందమోలె మధురమైందని
సభలల్ల సాటింపు చేసినంత మాత్రాన
భాషామాధుర్యం జనులకు బోధ పడుతుందా?

ఏళ్ల తరుబడి ఏలుబడిలుందని
గొప్ప పండితులెందరో కొలువుదీరి
ఉత్కృష్ట కావ్యాలు సృష్టించిందనీ
గతచరిత్ర చదివినంత మాత్రాన
తెలుగు గొప్పతనం ప్రజలకు తెలుస్తుందా?

నిద్రలేచింది మొదలు పడుకునేదాక
అవసరాలన్ని ఆంగ్లముల తీర్చుకొని
ఏడాదికోసారి సభలు జరిపినంత మాత్రాన
తెలుగు విరజాజై విరబూసి గుభాలిస్తుందా?

బడిలో గుడిలో తల్లి ఒడిలో
సందులో గొందులో వ్యవహారంలో
పరభాషను పలువిధాల అందళమెక్కించి
సభలల్ల సవతి ప్రేమ జూపినంత మాత్రాన
తెలుగు భాష జాబిల్లై వెలుగులీనుతుందా ?

బాహాటమైన బహిరంగ సభల వల్లనో
ప్రతిష్టాత్మక ప్రచారాల వల్లనో
సమావేశమై చేసే సంబురాల వల్లనో
హంగూఆర్భాటాలతో
అభిమానాన్ని ప్రకటిచడం వల్లనో
తెలుగు వెలుగదు సరిగదా భాష బతుకదు

విరిసీ విరియని పసిహృదయ క్షేత్రాల్లో
తేనెలొలుకు తెలుగు విత్తులు నాటి
అంకురించేల పెంచి పోషించి
ఎదుగుతున్న మొక్కల జూసి
ఎదకద్దుకొని ఎరువందించిన నాడు

తెలుగు మొక్కలు శాఖోపశాఖలై
వృక్షాలై . . .
మహా వృక్షాలై . . .
పుష్ప ఫల శోభితములై  విరాజిల్లుతుంది !
తేట తెలుగుతల్లి
సల్లని నీడనిచ్చి సేద దీర్చుతుంది !

Thursday, November 14, 2019

నాగరికత - కైైతికాలు


సింపుల గుడ్డలతోని
సిత్రమైన యేషాలు
పేషన్ దుస్తుల పేర
ప్రదర్శించు దేహాలు
వారెవ్వా ఆధునికత
అంగట్లో నేటి యువత

నాడు చినిగితె గరీబు
కూడుగుడ్డ లేనోడు
నేడు చినిగితె షరాబు
అన్ని హంంగులున్నోడు
వారెవ్వా నవసమాజం
అభివృద్ధికి అసలు రూపం

Friday, November 8, 2019

దీపావళి - రుబాయీలు



కోటి తారల కొంగొత్త వెలుగుల పండుగ
ఇలపై వెలచిన లక్ష్మీరూప సిరుల పండుగ
నోచిన నోములు ఫలము లొసగేలా
వెన్నెలలు విరబూయు దీపాళి పండుగ!

నింగిన  మెరిసిన చుక్కలనేరి
మిలమిల మెరిసే మెరుపులనేరి
పడతుల చేతిలో సౌరులు దీరి
ముంగిట వెలసెను ముగ్గుగ మారి!

అంజనమోలె పరుచుకున్నట్టి నిశిలో
అలలై ఎగిసిన అమవస తామసిలో
కందెన పులిమిన చీకటి చీల్చుతు
మిణుగురులై టపాసులు ఎగసె చీకటిలో

సమస్య: రతిమూలము సర్వధర్మ రక్షణ కొరకై



పతిలే నిసతులు జేసెడు
వ్రతత్యాగము ఫలమునీక వ్యర్థమ్మెయగున్
సతిపతు లిర్వురి త్యాగని
రతిమూలము సర్వధర్మ రక్షణ కొరకై


సతతము ధర్మాచరణము
గతితప్పకజేయువారు ఘనులే యగుదుర్
మతులగు జనుల త్యాగని
రతి మూలము సర్వ ధర్మరక్షణ కొరకై

Monday, November 4, 2019

గజల్ - చిరునగవుల చెలి

ఆజాబిలి నింగినిడిచి నేల జారెనేమో
ఆవెన్నెల చంద్రునిడిచి పుడమి చేరెనేమో

మరులుగొలుపు ఆచీకటి మబ్బులలో నిలువలేక
చెలిశిరమున సేదతీరి
ముంగురులుగ మారెనేమో

మింటమెరియు చుక్కలన్ని
అంటుబాసి యరుగుదెంచి
కనుదోయిని కరిగిపోయి
కంటివెలుగు లాయెనేమో

ఆమన్మద రూపమ్మగు
విరిచాపము విరిగిపోయి
చెలినుదుటన చేరిచెలువ
భృకుటములుగ మారెనేమో

ధరనువెలయు దానిమ్మల భీజమ్ములు
పడతిమోము విడిదిజేసి
పలువరుసగ మారెనేమో

తొలిసంధ్యల ధరజేరుచు
విరులనంటి విహరించు
అరుణకాంతి అదమరిచి
నగుమోమున అలరెనేమో

అమాయకపు ఆనవ్వులు
శేఖరుమది చెణుకుచుండ
ఆచూపులు మదిసంద్రపు
అలలై దరి జేరెనేమో

వేంకటేశ స్తవం


ఏడుకొండల వాడ ఓ వెంకటేశా
మూడునామాల వాడ ఓ శ్రీనివాసా
బహుదూరం పయనించి నిన్నుచేర వచ్చాము
నీచూపు మాపైనీ ప్రసరించవేమీ

అలవేలు మంగమ్మ యలకదీర్చుటే గాదు
పద్మావతి యొసగినట్టి
పలుకుదీర్చుటే గాదు
ఇష్టసతులనే గాదు
ఇలభక్తుల పాలించి
ఆదరించి బ్రోవుమయా ఓ శ్రీనివాసా   ॥ఏడుకొండల వాడ॥

లక్ష్మీశుడవై నీవు లాలసంగ దిరిగేవు
క్షీరసాగరములోనా ఖులాసాగ గడిపేవు
చీకుచింతలేకుండా శేషశాయి వైయుండక
మాచింతలు బాపరావ ఓ శ్రీనివాసా   ॥ఏడుకొండల వాడ॥

ఎత్తయిన కొండపైన  విలాసంగ నీవుంటివి
మలయమారుతములు గూర్చ
గమ్మత్తుగ నీవుంటివి
ఒడలసలే కందకుండ
ఒచ్చోరకు నిలిచిపోక
బడలిక దరిజేరకుండ పథము గూర్చవా శ్రీనివాసా  
॥ఏడుకొండల వాడ॥

గరువాహనుడవయ్యి గాలిలోన దిరిగేవు
ఆకాశపు మేడలలో హాయిగా ఒరిగేవు
నీదరిజేరుటలోన
నీరసించి కులబడితిని
మాపదముల మహిమనీయి ఓ శ్రీనివాసా

నీమహిమలు ఈ కనులతో గాంచలేని  దుర్బలులం
నీరూపును జూసినంత
నిలువలేని దరిద్రులం
మాబోటి భక్తులపై
 మమకారం చూపించి
నీఛాయను నిలువనీవ ఓ శ్రీనివాసా      ॥ఏడుకొండల వాడ॥

Thursday, October 31, 2019

గజల్ - వేంకటేశ స్తవం



ఏడుకొండల వాడ ఓ వెంకటేశా
మూడునామాల వాడ ఓ శ్రీనివాసా

అలవేలు మంగమ్మ యలకదీర్చుటే గాదు
ఆదరించి బ్రోవుమయా ఓ శ్రీనివాసా

చీకుచింతలేకుండా శేషశాయి వైనదేవ
మాచింతలు బాపరావ ఓ శ్రీనివాసా

ఎత్తయిన కొండపైన గమ్మత్తుగ నీవుంటివి
బడలిక దరిజేరకుండ పథము గూర్చు ఓశ్రీనివాసా

గరువాహనుడవై గాలిలోన దిరిగేవు
మాపదముల మహిమనీయి ఓ శ్రీనివాసా

నీమహిమలు ఈ కనులతో గాంచలేని  దుర్బలులం
నీఛాయను నిలువనీవ ఓ శ్రీనివాసా

నీపదముల కీర్తించెడు భక్త 'శేఖరు' లనుగని
కైవల్యపదము నొసగు ఓ శ్రీనివాసా

గజల్ - శివనివేదన

ధీనజనుల దరికిజేర్చి కరుణబ్రోవరా శివా
భక్తవరుల చెంతనిలిచి వరములీయవా శివా

అహర్నిశలు నీనామమె నామదిలో అలలాయె
నాహృదిసంద్రపు ఘోష దీర్చి మదినిలువవా శివా

తేజరిల్లు కనుదోయితో నీరూపము చూడనయితి
కలనైనా కనిపించి కలతబాపవా శివా

తల్లిదండ్రి నీవేనని నీసేవలొ మునిగితిని
మోక్షపథము నొనగూర్చి ముక్తినీయవా శివా

భవబంధపు జీవితాన 'శేఖరు' బాసటనిల్చి
నీతనువున విభూదిగా నిలుపుకోవా శివా

గజల్ - వలపుసమీరంం

వలపురాగ సమీరములు ప్రసరించవే నాహృదిలో
మరుమల్లెలు మకరందము కురిపించవే నాహృదిలో

పలకరింపు కానరాక మూగదైన  మనసుమీటి
సుస్వరాలగీతాలను పలికించవే నాహృదిలో

అనురాగపు జల్లులేక బీడువారు జీవితాన
నీచెలిమితో పసిడి సిరులు పండించవే నాహృదిలో

ఏబంధం దరిచేరక ఒంటరైన యీబతుకులో
నీరాకతో బంధాలను పూయించవే నాహృదిలో

నీతలపుల జాడలేక శిశిరమైన శేఖరు మది
నీపదముల వంతమును పూయించవే నాహృదిలో

Tuesday, October 29, 2019

నింగి నేల (మణిపూసలు )



చిటపట చినుకులు కురిసెను
సెలుకల మొలకలు మెలిసెను
సంభ్రమాశ్చర్యము రైతు
మనమున సింగిడి విరిసెను -13

మిన్ను  మెరిసి కురిసెను
మన్ను మురిసి తడిసెను
పుడమిన పయదారతొ
పచ్చదనము విరిసెను - 14

సినుకుసినుకు కలిసెను
అలుగు దుంకి పారెను
ఉరుకులతొ పరుగులతొ
సెర్లు కుంట నిండెను - 15

యేరులన్ని పారెను
వాగులన్ని బొరలెను
జలసిరులతొ సిత్రముగ
చెరువులన్ని నిండెను - 16

వరణుడు కరుణించెను
పుడమి కడుపు వండెను
ఉబికె క్షీర దారతొ
సేనుసెలక పండెను - 17

         పచ్చిమట్ల రాజశేఖర్

Friday, October 25, 2019

కైైతికాలు - ప్రకృృతి

కారుమబ్బు కానరాదు
వాగుపరుగు గానరాదు
సాగునీరు చేరరాదు
బతుకుదెరువు గానరాదు
వారెవ్వా ప్రకృతి
తలపించును ఎడారి -1

సాలువాన పడనెలేదు
పచ్చికేడ మొలువలేదు
పశువులకు మనుగడె లేదు
పాడిఊసు లేనెలేదు
వారెవ్వా ప్రకృతి
చేసెనంత వికృతి - 2

పుడమికి అందం తరువులు
జగతికి నందం తరువులు
ప్రగతికి మార్గం తరువులు
ప్రజలకు గురువులు తరువులు
వారెవ్వా తరువులు
సిరులు పొరలు దరువులు - 3

కైైతికాలు - కవులు

సామాజిక క్షేత్రంలో
అక్షరాలు జల్లుతారు
సమస్యలే ధ్యేయంగా
కవితలెన్నొ అల్లుతారు
వారెవ్వా పండితులు
జగతి మార్గదర్శకులు - 1

పరులెవ్వరు బాపలేని
చీకట్లను వారజూచి
రవిచూడని లొసుగులెన్నొ
మనోనేత్ర వారజూచి
కలము కరవాలమ్మున
చీల్చుతు చూండాడుతారు -2

విపరీతపు పోకడలతొ
సమాజ గతితప్పినపుడు
ప్రగతి పేరు జెప్పిజనులు
పతనమయి పోతున్నపుడు
చెంపజరిచి చెడునుబాపి
మంచిజూపు మహాత్ములు - 3

అభివృద్ధను పేరుజెప్పి
పాతాలము బాటవట్టి
విపరీతపు పోకడలతొ
విర్రవీగి  పోవునట్టి
వెర్రిమాన్పి వీపుచరిచి
మేలుకొలుపె మానధనులు - 4

మణిపూసలు - బుధులు

 వాణీ ఉపాసకులు
సరస్వతీ పుత్రులు
జ్ఞానపుంజముచేత
శోభిల్లే కవివరులు -11

 వాణీ ఉపాసకులు
సరస్వతీ పుత్రులు
దివ్య తేజముచేత
శోభిల్లే కవివరులు- 12

Thursday, October 17, 2019

సమస్య

సమస్యాపూరణం

పిడిగల్గిన నగ్గిబుట్టె పీతాంబరుడా

సుడిగా లికివన మందున
నిడివిగ తరువులవన్ని నిలకడ లేకన్
వడివడి గపలుమ రులురా
పిడిగల్గిన నగ్గిబుట్టె పీతాంబరుడా

  రాజశేఖర్ పచ్చిమట్ల

Wednesday, October 2, 2019

జనం మెచ్చిననేత గాంధీ


(గాంధీ 150 వ జయంతి సందర్భంగా గేయాంజలి)

పల్లవి.
బోసినవ్వులతొ వెలిగే తాత
సత్యాగ్రహముల శాంతిదూత ॥2॥
భారతఖండపు ప్రగతి విధాత
మానవలోకపు స్పూర్తి ప్రదాత॥2॥    ॥బోసి నవ్వులతొ ॥

1చ.
నిత్యము సత్యము పలకాలంటూ
మనిషిలొ మంచిని పెంచాలంటూ
విశ్వమానవత విరిసిలాగా
సమతామమతలు పంచిండు
సమాజ ప్రగతిని జూపిండు       ॥బోసి నవ్వులతొ ॥
     
2చ.
ఉప్పు సత్యాగ్రహమును బూని
సమరశంఖమును తా పూరించి
అఖండ విశ్వమ్మనుసరించేల
అహింసోద్యమము నడిపిండు
ఆంగ్లేయులను తరిమిండు ॥బోసి నవ్వులతొ ॥

3చ.
అసమానతలను అనుమతించక
మనుషులమధ్యన భేదాలెంచక
మానవత్వమనె పునాదిపైన
భారతజాతిని నడిపిండు
ప్రగతి బాటలు వేసిండు
॥బోసి నవ్వులతొ ॥

4చ.
నిరాడంబరతె నిత్యసూత్రమై
నిజాయితీయె నిజరూపమ్మై
సత్యాహింసలే సాయుధమ్ములని
శాంతిపథమ్మును జూపిండు
స్వాతంత్ర్యము సాధించిండు
॥బోసి నవ్వులతొ ॥

5చ.
జయహో జయహో గాంధీతాత
జగజ్జనావళి మెచ్చిన నేత
అందరి మనసుల ఆరాధ్యుడవై
అజరామరమై వెలిగే నేత  ॥బోసి నవ్వులతొ ॥

Friday, September 13, 2019

మణిపూసలు


మాటలతో మాయజేసి
మనుషులను గొర్రెలుజేసి
పాలించెదరు ప్రజలను
పశులకన్న కిందజేసి - 1

నిన్ననేది తిరిగిరాదు
రేపునీది కానేకాదు
భూతభావి చింతలతో
నేడు జార్చు కొనగరాదు - 2

చెరువుకు కలువలు రమ్యత
తనువు వలువలు రమ్యత
ప్రగతి కొరకు పరితపించు
మనిషికి విలువలు రమ్యత -3

 నేల నీకు అడుగైనది
నింగి నీకు గొడుగైనది
ప్రకృతి వికృతిగ మార్చితె
నీనెత్తిన పిడుగైతది - 4

పిల్లలకు సంచి బరువు
పెద్దలకు ఫీజు బరువు
నింగికెగసె తరువులకు
పండు టాకు లేబరువు - 5

 తీగెకు కాయలు భారం
పడుచుకు ప్రాయము భారం
ఆధారమైన అవనికీ
సోమరిపోతులు భారం - 6

 ముంగిట ముగ్గులు అందం
పెరటికి మొగ్గలు అందం
పడుచుదనపు పరువానికి
 వాడని సిగ్గులు అందం - 7

 ముంగిట ముగ్గులు నందం
పెరటికి మొగ్గలు నందం
పడుచుదనపు పరువానికి
 వాడని సిగ్గులు నందం - 8

ఇంటికి పిల్లలు అందం
పిల్లల కల్లరి అందం
ఇల్లాలి సవరించి ముడిసిన
కొప్పుకు మల్లెలు అందం - 9
[9/1, 10:10 PM]

 చెరువుకు కలువలు రమ్యత
తనువు వలువలు రమ్యత
ప్రగతి కొరకు పరితపించు
మనిషికి విలువలు రమ్యత - 10

Wednesday, September 11, 2019

చిత్రకవిత (ఫొటో )



సీసం:
నింగిని వేలాడు నిండుజా బిలితాను
చుక్కల న్నిటినేరి చక్క గూర్చి

వాలుజ డనుదిద్ది వలపుల మరజేసి
సౌరభమ్మువిరిసి సౌరులొలుక

కారుచీ కటిబట్టి కన్నులు గాదాల్చి
కాంతులీ నగజూచె గన్ను దోయి

మరలిచూ పులతోడ తరలిపోవుచుతాను
ఓరగ పలుమారు తిరిగి చూసె

చిరున గవుల నొలకు చిగురాకు చెక్కిళ్లు
పాల పుంత నొసగు పళ్ల వరుస
దొండపండు తీరు దొరిసేటి పెదవుల
మధులొ లుకగ పిలిచె వధువు తాను

Tuesday, September 10, 2019

శివతత్వం



ఆచ రమ్ము మిగుల యర్చకుం డుండినా
శిలలు తేజ మలరి శివుడె యౌను
ఆచరమ్మువిడిచి నర్చకుం డుండినా
శివుడు తేజ మిడిచి శిలయెయౌను

Monday, September 9, 2019

కాళోజీ కైైతికాలు

నిజాం నెదురించిండు
దొరలమెడలువంచిండు
అణగారిన వారినంత
అనకొండలు జేసిండు
వారెవ్వా తెలుగోడు
ప్రజలమనిషి కాళోజీ - 1

భాషతోనె బతుకన్నడు
యాసలోనె భవితన్నడు
భాషయాస మరచిపోతె
బతుకుదెరువు లేదన్నడు
వారెవ్వా కాళోజీ
తెలంగాణ హీరోజీ - 2

ఉద్యమంలో ముందుంటడు
అన్యాయాన్నె దురిస్తడు
ప్రజలబాధ లన్నింటిని
తనబాధగ భావిస్తడు
వారెవ్వా కాళోజీ
సామాన్యుల హీరోజీ -3

Thursday, September 5, 2019

గల్మల గంగ

13.

పల్లె పురాగ మారింది!
పరువుకొద్ది బతుకనేర్సింది!

నాటి చీదరింపుల్లేవు
చింతలు ఛీకాకుల్లేవు
దెప్పి పొడుపుల్లేవు
దెబ్బలాటలస్సల్లేవు!
పల్లె పురాగ మారింది!

మంచీళ్లకోసం పడిగాపుల్లేవు
పొంటెజాము నిలవడుల్లేదు
లైను గట్టుల్లేదు లడాయి వెట్టుల్లేదు!

కొళాయి కాడ కొట్లాటల్లేవు
బాయికాడ జవుడాల్లేవు
బోరింగు కాడ కారడ్డాల్లేవు!
నలుగుట్ల వడుల్లేదు!

నీళ్ల కోసం ఈడ్గిలవడుల్లేదు
కుండలు కుండలు గొట్లాడ్తలేవు
బిందెలు బిందెలు సిగెలు వడ్తలేవు
ఇజ్జత్ తక్క తిట్లులేవు!
ఈనందక్క మాటల్లేవు!
ఈదులల్ల ఇమ్మడిచ్చుల్లేదు!

చెర్లు కుంటల్లకెల్లి నీళ్లు
తెచ్చుడు తప్పింది!
పొరిగింట్ల నుంచి బిందెలు
మోసుడు వోయింది!
బోరింగుల కాడ బారులు దీరుడు బందైంది!

సర్కారు బాయి సుట్టు
సాగిలవడి సేదుల్లేదు
దూరంకెల్లి బానలు మోసుల్లేదు
రోగాల్లేవు నొప్పుల్లేవు!
పత్తెంగిత్తెం ఎవ్విలేవు!

ఆకాశ గంగ ఆకిట్ల కచ్చింది
ఇంటింటికి పారుకమచ్చింది
పాతాలగంగ పైకిలేసింది
గయిండ్ల నల్లచ్చింది!

కుండలు బిందెలు
జలదరించినయి
ఆకిట్ల గంగ అలుగు వారింది!
అంపులకాడ గోలెం నిండింది!

నీళ్లుమోసెటోళ్లు యాడ గండ్లవడ్తలేరు
సంకల బిందెలు అట్కెక్కినయి
కుండలు మూలగ్గూసున్నయి
ఆడోల్లు ఆత్మగర్వంతో బత్కుతుండ్రు!

గంగమ్మ కరుణించింది
అంటుముట్టనకుంట
 అందరింటికచ్చింది
అలాయ్ బలాయ్ దీసుకుంది
పల్లె పరవశించింది!
పల్లె మది పులకరించింది!

సకస: 2593 రాజశేఖర్ పచ్చిమట్ల(కవిశేఖర)
గోపులాపురం, జగిత్యాల.
9676666353
తేది: 18.08.2019

Monday, September 2, 2019

శీర్షిక: నింగిసొగసు



విశ్వమంతా వ్యాపించిన
వినీలాకాశంలో
పిండారబోసేటి
పండుముసలి జాబిల్లి
నింగిఅంచున వేలాడే
నీలిమబ్బుల
మేనివిరిసిన హరివిల్లు

నల్లని చీకటితెరలోంచి
తొంగిచూసె
నవనీతపుబొట్ల నక్షత్రాలు

అన్నీ ఆకర్షణే!
మనసంతా పరవశమే!

నిండాదిబ్బరిచ్చిన నీటిఅలలపై
తుళ్లిపడే తుంటరి తూడుపూలు
ఊరచెర్వుకట్టమీద గోధూళిలో
సాగిపోయే ఆలమందలు
నిటారుతోకలతో
నిండుసంతసంతో
గెంతుతూ రంకెలేసే
తుంటరి లేగదూడలు

అన్నీ ఆకర్షణే!
మనసంతా పరవశమే!

 రాజశేఖర్ పచ్చిమట్ల
03-09-19

Sunday, September 1, 2019

మడమతిప్పని యోధుడు (సర్వాయి పాపన్న) కైైతికాలు

గౌడకుల తిలకుండు
శైవభక్తి తత్పరుండు
ప్రజారక్షణె ధ్యేయంగ
ప్రభవించిన వీరుడు
సర్దారు (సర్వాయి) పాపన్న
గౌడకులంల నువు తోపన్న .1


అఖిలావని రక్షకుడై
అజ్ఙాతమె నివాసమై
పాలక దుశ్చర్యలు గని
విరుచుకుపడె పిరంగియై
వారెవ్వా పాపన్న
ప్రజాసేవకుడు నీవన్న .2


తురుష్కుల నెదురించి
ముసల్మాన్ల మట్టుబెట్టి
దొరల ఆగడాలు బాపి
గోల్కొండలొ ధ్వజమెత్తి
నాయకుడై నడిపించిన
పోరుబిడ్డ పాపన్న .3

బంధుజనుల పాలనకై
పరసేనల కెదురునిలిచె
మృత్యువునే జడిపించగ
అపరకాళియై నిలిచె
మడమతిప్పని యోధుడవన్న
మరువనెమరువం నిను పాపన్న . 4

సకలజనుల దండుగట్టి
నవాబుల మెడలువంచె
కురుబక్షకు చిక్కకుండ
తనకుతాను మరణించె
వారెవ్వా పాపన్న
స్వాభిమాని నీవన్న .5

నిజాం నెదురించిండు
దొరలమెడలువంచిండు
అణగారిన వారినంత
అనకొండలు జేసిండు
వారెవ్వా తెలుగోడు
ప్రజలమనిషి కాళోజీ - 1

భాషతోనె బతుకన్నడు
యాసలోనె భవితన్నడు
భాషయాస మరచిపోతె
బతుకుదెరువు లేదన్నడు
వారెవ్వా కాళోజీ
తెలంగాణ హీరోజీ - 2

ఉద్యమంలో ముందుంటడు
అన్యాయాన్నె దురిస్తడు
ప్రజలబాధ లన్నింటిని
తనబాధగ భావిస్తడు
వారెవ్వా కాళోజీ
సామాన్యుల హీరోజీ -3

Saturday, August 31, 2019

చిత్రభావన

సీ॥
కురులన్ని విరబోసి హరివిల్లు గాజేసి
చెలియతా నేగెనో చెరువు దరకు
కుండసం కనబెట్టి కోమలొ య్యారియై
పడుచుద నమ్మొప్ప పథము సాగె
పయ్యెద తొలగంగ పలుమారు సరిజేసి
నీరుతా ముంచెనో నీలవేణి
కులుకులొ లుకుచుండ కుంజర మయితాను
అడుగులు కదిపెనో హంస గమన

వెల్లి విరిసిన జాబిల్లి వెలుగు లమర
సాగు చుండెనా దారిలో మగువ తాను
కాలమునకేల గుట్టెనో గన్ను దోయి
కాలి లోతులో దిగెనోయి కంటకమ్ము


Friday, August 30, 2019

చిత్రభావన

సీ.
కురులను విరబూసి హరివిల్లు గాజేసి
చెలియ తా నేగెనో చెరువు దరకు
కుండసం కనబెట్టి కోమలొ య్యారియై
పడుచుత నముబెంచ పథము సాగె
పయ్యెద తొలగంగ పలుమారు సరిజేసి
నీరుతా ముంచెనో నీలవేణి
కులుకులొ లుకసాగు కుంజర మైతాను
అడుగులు కదిపెనో హంస గమన

వెల్లి విరిలిన జాబిల్లి వెలుగు లమర
సాగు పోచుండె దారిలో మగువ తాను
కాలమునకేల గుట్టెనో గన్ను దోయి
కాలి లోతులో దిగెనోయి కంటకమ్ము

Thursday, August 29, 2019

కైైతికాలు



గాడుదుల మోతలు
గంగిరెద్దు లాటలు
చిలుకల పలుకులకు
స్వేచ్ఛ లేని సదువులు
వారెవ్వా విద్యార్థులు
వెతల మోస్తుబతుకులు - 1

 మెతుకు రూపకర్తలు
జగతి జీవదాతలు
అహర్నిశలు శ్రమించినా
అప్పులపాలాయె బతుకు
వారెవ్వా రైతులు
గంజిమెతుకుల వ్యథలు -2

 తెలుపురంగు దుస్తులు
నలుపురంగు మనసులు
ప్రజాసేవకులని మరిచి
పలుకుబడిని జూపుడు
వారెవ్వా నాయకులు
మేకవన్నె పెద్దపులులు -3

 ధనవంతుల జేరలేరు
దరిద్రుల దరికి రారు
ఆశ చిక్క వలెనంచు
అనాదిగ ఆశువోసుడు
వారెవ్వా సామాన్యులు
ఎండమావి బతుకులు -4

 ధనవంతుల జేరలేరు
దరిద్రుల దరికి రారు
ఆశ చిక్క వలెనంచు
అనాదిగ ఆశువోసుడు
మధ్యతరగతి మనుషులు
ఎండమావి బతుకులు-5

సృష్టికి మూలం తరులు
జగతికి ప్రాణం తరులు
విధాత చెక్కిన ధరణి
జీవుల త్రాణం తరులు
తరులే మనిషికి మరులు
ప్రగతికి దారులె తరులు - 6

కైైతికాలు

1.
నింగిని నేలను నమ్మి
కాలంతో కలబడుతరు
నిద్రాహారాలు మాని
పరులకు తిండి బెడతరు
వారెవ్వా కర్షకులు
పరోపకారపు ప్రతిరూపాలు!

2.
మొగులు జూసి మోహంతో
కలల సేద్యం సాగిస్తరు
ఆశలు తీరు దారి లేక
బతుకాటను ముగించేస్తరు
వారెవ్వా కర్షకులు
నడుమంత్రపు బతుకులు!

Sunday, August 18, 2019

గల్మల గంగ

సకసం. 2593
క.పేరు. రాజశేఖర్ పచ్చిమట్ల
కలంపేరు. కవిశేఖర
అంశం. మిషన్ భగీరథ
ఊరు. గోపులాపురం
జగిత్యాల జిల్లా
చరవాణి.9676666353
తేది. 18-08-16
      ———————
శీర్షిక: ఆకిట్ల గంగ

పల్లె పురాగ మారింది!
పరువుకొద్ది బతుకనేర్సింది!

నాటి చీదరింపుల్లేవు
చింతలు ఛీకాకుల్లేవు
దెప్పి పొడుపుల్లేవు
దెబ్బలాటలస్సల్లేవు!
పల్లె పురాగ మారింది!

మంచీళ్లకోసం పడిగాపుల్లేవు
పొంటెజాము నిలవడుల్లేదు
లైను గట్టుల్లేదు లడాయి వెట్టుల్లేదు!

కుళాయి కాడ కొట్లాటల్లేవు
ఈధులల్ల ఇమ్మడిచ్చుల్లేదు
బాయికాడ జవుడాల్లేవు
బోరింగు కాడ కారడ్డాల్లేవు!

నీళ్ల కోసం ఈడ్గిలవడుల్లేదు
కుండలు కుండలు గొట్లాడ్తలేవు
బిందెలు బిందెలు సిగెలు వడ్తలేవు
ఇజ్జత్ తక్క తిట్లులేవు!
ఈనందక్క మాటల్లేవు!

చెర్లు కుంటల్లకెల్లి నీళ్లు
తెచ్చుడు తప్పింది!
పొరిగింట్ల నుంచి బిందెలు
మోసుడు వోయింది!
బోరింగుల కాడ బారులు దీరుడు బందైంది!


సర్కారు బాయి సుట్టు
సాగిలవడి సేదుల్లేదు
దూరంకెల్లి బానలు మోసుల్లేదు
రోగాల్లేవు నొప్పుల్లేవు!
పత్తెంగిత్తెం ఎవ్విలేవు!

ఆకాశ గంగ ఆకిట్ల కచ్చింది
ఇంటింటికి పారుకమచ్చింది
గయిండ్ల నల్లచ్చింది
కుండలు బిందెలు
జలదరించినయి
ఆకిట్ల గంగ అలుగు వారింది!
అంపులకాడ గోలెం నిండింది!

నీళ్లుమోసెటోళ్లు యాడ గండ్లవడ్తలేరు
సంకల బిందెలు అట్కెక్కినయి
కుండలు మూలగ్గూసున్నయి
ఆడోల్లు ఆత్మగార్వంతో బత్కుతుండ్రు!
పల్లె పరవశించింది!
పల్లె మది పులకరించింది!

Friday, August 16, 2019

కలికితురాయి

(ఆకాశపు అంచున ఆదర్శ పాఠశాల)


పచ్చని ప్రకృతి ఒడిలొ వెలసి
సువిశాల మైదానమై నిలిచి
గుట్టనే దిష్టిచుక్కగా దాల్చిన ఇంద్రభవనం!
రంగురంగుల పూలు
కొలువుదీరిన నందనవనం!
బొండుమల్లెల పరిమళాలు
అడవంతా పాకినట్లు
విద్యాపరిమళాలు దశదిశల వ్యాపింపజేసిన కీర్తిపతాక మన ఆదర్శ పాఠశాల!

చకోరకములకు శరత్కాంతులతీరు
మధుపములకు
పూగుత్తుల తీరు
హంసల విహారములకు
 స్వచ్ఛ నదీతరంగములతీరు
పరమ మౌక్తికములకు
సాగరగర్భము తీరు
క్రమశిక్షణ మొదలు విద్యా సంస్కృతి సామాజిక శ్రేయోది సర్వవిషయములందు ఆదర్శప్రాయమై
సకల జనామోదమై
నిండు జవ్వనియై నిలిచినది మన ఆదర్శ పాఠశాల!

 నిర్మల వినీలాకాశపు
అంచున విరిసిన ఇంద్రధనసు
అజ్ఞానాందకారపు జాడలు
రూపుమాపే తొలిఉషస్సు
విభిన్న సంస్కృతుల
విశిష్ట మేళవింపు
జ్ఙాన కోవిదులు కొలువైన
విజ్ఞాన బాంఢాగారం
వాఙ్మయీప్రసన్న వరప్రసాదం
గొల్లపెల్లి శిగలో తురిమిన
వెన్నెల విరిమాల
మన ఆదర్శ పాఠశాల!

శంకుస్థాపన మొదలు
శాఖోపశాఖలై విస్తరించి
విద్యావిహంగముల కాలవాలమై
సంస్కృతీసంప్రదాయముల కాధారభూతమై
దినదినప్రవర్దమానమౌతూ
నభోవీథి కెగసిన కీర్తిపతాక మన ఆదర్శపాఠశాల!

అవరోదాల నెదురించి
అభివృద్ధి పథాన నడిచి
నీలిమేఘపు శకునాలన్నింటిని
దాటుకుంటూ
తేజోదీప్తమై ఉదయించిన
శరత్చంద్రిక ఆదర్శ పాఠశాల!


వందలాది వలస పక్షులకాలవాలమై
విద్యాధికోపన్యాసకులకు
నెలవై
ఎందరికో  దిశానిర్దేశమై
ఇంకెందరికో వరప్రసాదమై
విద్యగోరిన వారికి కొంగుబంగారమై
 ఒదిగిన సారస్వతాలయం మన ఆదర్శ పాఠశాల!

గ్రామీణవిద్యార్థుల పాలిటి
కల్పతరువు
జ్ఞాన పిపాసులందరికీ
విద్యాసుధ సాగరం
తత్వమెరిగెడు వారలపట్ల
బోధివృక్షం ఆదర్శ పాఠశాల!



ప్రజాప్రతినిధులు
అధికారులందరి అండదండలతో
ఆటస్థలమై అలరారుతు
అన్నింటికి ఆధారమై నిగర్విగా నిలిచిన
ఏడు నిలువుల ఎత్తైన శిల్పం మన ఆదర్శ పాఠశాల!
చదువులమ్మ మెడలో కలికితురాయి మన ఆదర్శ పాఠశాల!

Tuesday, August 13, 2019

సమస్య

సమస్య:
మామకె మామగను నిల్చు మాన్యుని గొల్తున్


మామా యంచును పిలిచెడు
భూమీ శులచెం తజేరి పులకిత మొందీ
లేమం టికావ్య మొసగుతు
మామకె మామగను నిల్చు మాన్యుని గొల్తున్

(మనుమసిద్ది ఆస్థానకవి తిక్కన ప్రశంస)

Wednesday, August 7, 2019

చెట్టు - తోబుట్టు

శీర్షిక: చెట్టు - తోబుట్టు

1.సీసపద్యం:
పుడమి తనువుచీల్చి పుట్లుపుట్లుగ మొల్చి
ఆకుపచ్చనివస్త్ర మవని కొసగు

అహరహమ్ము వెరిగి యలరారి వనములై
పశుపక్ష్య ములకంత వసతి గూర్చు

మనుజలో కముకంత మలయమారుతమిచ్చి
కమనీయ ఫలముల కడుపు నింపు

అంబరమ్మునసాగు యభ్రమ్ము లనుబిల్చి
అవనిదాహము దీర్చ నంబువొసగు

ప్రాణవాయు వొసగి ఆయుర్దాయముబెంచి
కూడు గూడు నొసగు కూర్మి తోడ
అఖిల ప్రాణి కోటి కాధార భూతమౌ
మొక్క నాటవోయి ఒక్కటైన

2.సీసపద్యం:

సాళ్లుసాళ్లుగనిల్చి స్వాగతమ్ములు బల్కి
ఛాయనిచ్చి మిగుల హాయి గొల్పు

అలసి వచ్చినవారి బడలికన్ దీర్చేల
మలయమారుతమిచ్చి మరులు గొల్పు

ఆకొని దరిజేరు యతిథిసంతుష్టికై
మధురఫలములిచ్చి మమతబంచు

సకల రోగములకు  స్వాంతన మ్మొసగేల
ఔషధ మ్ములనిచ్చి స్వస్త తొసగు

కన్నతల్లి వలెను కడుపు నింపుడెగాక
కామితార్థమొసగు కల్పతరువు
మనిషి మనుగడూంచు మహిత శక్తి తరువు
మొక్కనాటవోయి ఒక్కటైన!

Tuesday, August 6, 2019

ఆరాధన



కనిపించని భగవంతునికి
పుట్టెడు సంపద
దారవోసెడి జనులు

కల్లెదుట నిరీక్షించెడు నిర్భాగ్యునికి
పట్టెడన్నం  పెట్టనోపరు

ఆచారపు ఆరాధనలో
ఎంతైనా త్యజించుదురుగాని
అన్నార్థుల నాదుకొనగ
నడుగు ముందుకేయలేరు

తాగుతుందో లేదో
తెలియని పాములకోసం
పట్టువాలుతెచ్చి
పుట్టలవోసేటి భక్తజనం

ఆపాలకొరకే నిరీక్షిస్తున్న
 పరమాత్మను పట్టించుకోని
సంప్రదాయ సమాజాన్ని
ఏమని ప్రశ్నించను!

సాటి మనిషికి సాయపడడమే
సాక్షాత్తు భగవత్ సేవయని
వారలకెలా ఉపదేశించనూ!

Saturday, August 3, 2019

వాడినమల్లె

నిండుగ విరబూసిన మల్లెతీగెనై
సౌరభాలద్దిన పిల్లగాలితో
రాగరంజిత రాయబారమంపి
విరహపుభరణినైై
తనువంంతా కనులు జేసి
పందిట్లో చూపులు పరిచి
శిశిరమైై శుష్కింంచిన హృృదిలో
వసంంతాగమమునకైై వేచిచూస్తున్న!



అపాత్రదానము



ఆక లెరుగ నోరి కన్నంబు వెట్టినా
ధనము గల్గు వాన్కి దానమొసగ
వార్థి నికురి సేటి వర్షమే యగునయా
పచ్చిమట్లమాట పసిడిమూట

Saturday, July 20, 2019

(గజల్) విలక్షణత




క్షణక్షణం అనుక్షణం అలలమై సాగాలి!
ప్రతీక్షణం పరుగెడుతూ ప్రవాహమై సాగాలి!

హోరుతోటి ప్రవహించే వాగులల్లె పొర్లకుండ
నింపాదిగ పయనించే వాహినివై సాగాలి!

రాశులుగా సంపదుండే రత్నగర్భ చేరకుండ
జీవుల దాహార్తి తీర్చగలిగె దారవై సాగాలి!

నిండా చీకటినిండిన ధీనమైన బతుకులలో
వెలుగులెన్నో మోసుకొచ్చె వెన్నెలవైై సాగాలి!

ఎండిన తరులతల జూసి ఎవ్వరినో నిందించక
నిండుగ చిగురింపజేయు  వసంతమై సాగాలి!


స్వార్థపరత తొలగించి త్యాగశీలతను పెంచుతు
సమసమాజ స్థాపనలో సమిధలమై సాగాలి!

సమాజ రుగ్మతలన్నిటి సంస్కరింపజేసుకుంటూ
మంచితనపు సారూపము మానవతై సాగాలి!

అందరిలా నీవుంటే అర్థమేమి 'కవిశేఖర'
లక్ష్యసాధకుల కోటిలొ ఒక్కడివై సాగాలి!

రాజశేఖర్ at 11:02 PM

విరహవేదన (గజల్)



నా కన్నులలో చీకట్లను కరిగించగ రావేమీ
నా చూపులలో దీపాలను వెలిగించగ రావేమీ!

ఆషాడపు విరహాగ్ని అణువణువూ కాల్చుతున్న
శ్రావణాభ్రమై ప్రేమను కురిపించగ రావేమీ!

నీవు నడచు దారిలోన గులాబినై నిలుచున్నా
నా తనువున పరిమళమ్ము విరియించగ రావేమీ!

అదిరిపడే పెదవులతో నీ పేరే జపిస్తున్న
అదును చూసి మధువులనూ సేవించగ రావేమీ!

నీ తలపుల మునకలలో నామది పరితపిస్తున్న
చెంత చేరి చెలి ఒడిలో శయనించగ రావేమీ!

సరసపు సంగీత ఝరుల రాగాలను ’కవి శేఖర’
తను వీణియ తంత్రులలో పలికించగ రావేమీ!




Thursday, July 18, 2019

పయోమృతధార




సీ.
నభమందు పయనించు అంబుధ మ్ముమురిసి
వర్షరూ పమునతా హర్ష మొసగ
నదులన్ని నిండుగా నడయాడు చుండగ
పుడమిపై జలధులు పొడము చుండె
చెరువులందున నీరు చేదబావు లనీరు
వాగువంకలు దుమికి యలుగు బారె
సెల్కలం దుననీరు సెలయేటి లోనీరు
ఊటచె లిమెలందు నుబుకె నీరు

జలధు లన్ని నిండి యలుగుదుంంకుతుపార
పారు జలము తోడ పంటబండె
పరవ శించి మురిసె పశుపక్ష్యు లన్నియు
జీవ రాశి కంత చేవ దక్కె

             - రాజశేఖర్ పచ్చిమట్ల

Wednesday, June 19, 2019

గజల్ మది నివేదన!




మదిలోని భావాలను విన్నవించనా చెలీ!
నామది నీయెదవాకిట పరిచివుంచనా చెలీ!

నీమనసున నాతలపులు అనునిత్యం పూచేలా
ప్రేమలతకు మధురాంబువు లోసి పెంచనా చెలీ!

నీ మనసును గ్రమ్మినట్టి కల్మషంపు కారుమబ్బు
తొలగించెడు పవనమ్ముల ప్రసరించనా చెలీ!

ముకులించిన వదనాంబుజము వికసింపజేసేలా
నీచూపుల కిరణమ్ములు సారించవా చెలీ!

చెలిమనసున యేమున్నదొ కవిశేఖరు కవగతమే
బిడియపు పరదలనుదాటి ప్రేమపంచవా చెలీ!


       - పచ్చిమట్ల రాజశేఖర్

Tuesday, June 11, 2019

చిరకీర్తి

(పాలకంటె పెరుగు పెరుగుకంటెను వెన్న, వెన్నకన్నను మిగుల నేయి శాశ్వతముగ నిలుచుతీరు మనుషులు నిత్య సంఘర్షనలతో మంచి మనుషులు మారి చిరకీర్తులందాలని ఆశిస్తూ - -)

సీసంం:
పాలవంటి మనసు పలుచనై దిగజారు
అచిరకా లమ్మునే అంత మౌను
పెరుగసొం టిమనసు పెంపునొం దునుగాని
మూడునా ళ్లకుతాను మురిగి పోవు
వెన్నలాం టిమనసు విసుగుచెం దకతాను
వారమ్ము కొలదిగా వరలుచుండు
నేయిలాం టిమనసు నిగనిగ లాడుతూ
నెలలువ త్సరములు నిలిచి యుండు

పాల నుండి పెరుగు వెలికివ చ్చినతీరు
పెరుగు నుండి వెన్న బరగు తీరు
వెన్న చిలుక నేయి వెలికి వచ్చినతీరు
మనిషి వెలయ వలెను మనల నుండి

Sunday, May 12, 2019

తల్లితీపి

నవ మాసాలు మోయడమే కాదు
నడక నేర్చే వరకు
బిడ్డ తన కాళ్లపై తాను నిలిచి నడిచేవరకు
తీగె కాయను మోస్తున్నంత
సునాయాసంగ
మక్కచేను సంకపాపను మోస్తున్నంత సుకుమారంగ
తల్లి బిడ్డను మోస్తూనే ఉంటుంది
బిడ్డే సర్వస్వంగా భావించి!
పెంట మీది కాకరచెట్టు
పగడాల్ల మెరిసే గింజల జూసి మురిసినట్టు
చింపిరిగుడ్డల సీతాఫలం
ఇంద్రనీలమణులసోంటి గింజలచూసి
సంబురపడ్డట్టు
తల్లి తన బిడ్డలను తనివిదీర ప్రేమిస్తుంది!
తనబిడ్డల దిగులుజూసి
తనువెల్ల తపనవడ్తది!

        -( తల్లికోరోజు తండ్రికోరోజు కెటాయించుకొని పూజించే దేశంలో మనం పుట్టలే. అనునిత్యం ఉదయాన్నే లేచి భగవద్సదృశులైన వారి పాదాలకు నమస్కరించే సాంప్రదాయికదేశంలో పుట్టిన మనమంతా ధన్యులం. మనలగన్న తల్లిదండ్రులు కడుధన్యులని భావిస్తూ )

Saturday, May 11, 2019

సమస్య: అడుక్క తినకున్న వాడు అధముంండయ్యెన్

కం.
బడిమా నినబా లుండును
గుడిమా నినవా డుమరియు గురుపీ ఠమ్మున్
ఎడబాసి తిరుగెడునతడు
అడుక్క తినకున్న వాడు నధముండయ్యెన్

Monday, May 6, 2019

కైైతికాలు

1.
నింగిని నేలను నమ్మి
కాలంతో కలబడుతరు
నిద్రాహారాలు మాని
పరులకు తిండి బెడతరు
వారెవ్వా కర్షకులు
పరోపకారపు ప్రతిరూపాలు!

2.
మొగులు జూసి మోహంతో
కలల సేద్యం సాగిస్తరు
ఆశలు తీరు దారి లేక
బతుకాటను ముగించేస్తరు
వారెవ్వా కర్షకులు
నడుమంత్రపు బతుకులు!

Monday, April 29, 2019

వర్షపుహర్షం



సీ.
ఆకము నవెలయు నంబుధ మ్ముమురిసి
వర్షరూ పమునతా హర్ష మొసగ
నదులన్ని నిండుగా నడయాడు చుండగ
పుడమిపై జలధులు పొడము చుండె
చెరువులందున నీరు చేదబావు లనీరు
వాగువంకలు దుమికి యలుగు బారె
చెలిమలం దుననీరు సెలయేటి లోనీరు
ఊటచె లిమెలందు నుబుకె నీరు

జలధు లన్ని నిండి యలుగుదుంంకుతుపార
పారు జలము తోడ పంటబండె
పరవ శించి మురిసె పశుపక్ష్యు లన్నియు
జీవ రాశి కంత చేవ దక్కె

             - రాజశేఖర్ పచ్చిమట్ల

Saturday, April 27, 2019

ఇల్లు చిన్నవోయింది




రోజు విరగబూసిన పూలతో
నందనవనమై అలరారిన ఇల్లు
పక్షుల కిలకిల రావాలతో
కోలాహలమై విలసిల్లే ఇల్లు
తొలిసంధ్య మలిసంధ్యల పర్యంతం
బోసి నవ్వులతో కలకల లాడే ఇల్లు
నేడు వెలవెలవోయింది

పూలనే గాదు
ఆకులు సైతంరాల్చుకొని
నీరసంగ నింగి వంక చూస్తూ
కాలమెల్లదీసే పూలమొక్కలు
వేసవి తాపానికి
వేగలేని సీతాకోకచిలుకలు
తడారిన గొంతులతో
విలపిస్తూ వలసబోయిన పక్షులతో
ఇల్లంతా మూగవోయింది

సుప్రభాతానికి ధీటుగా
ముద్దుగొలిపే మాటలతో
వేకువనే మేల్కొనే చిన్నారుల కోలాహలం
లేలేత చిగురుటాకు చేతులతో
పూలకుంండీలను
నీటితో నింంపుతూ
పైైరగాలికి తలలూపే
విరులతో జతగలిసి ఆడే
పసిహృృదయపు స్పంందనలేక
ఇల్లు నిశ్శబ్ధ మావహింంది!

వేసవి సెలవులతో పిల్లలంంతా
కాలఛక్రపు పరిదినిదాటి
విడిదులకైై వలసవోతూ
ఇంంటి తనువునంంటిన
ఆనంందాన్ని సర్దుకుపోయారు
పిల్లల అల్లరిలేని ఇల్లు
పక్షులిడిసిన గూడైై
పాడువడ్డట్టు గానస్తున్నది
పరిసరాలన్ని పంండ్లీల గరిసి
ఆకులన్నీ ఈనెల్దేలి బతుకీడుస్తున్నయి

తరలిపోయిన వసంంతంం
మరలెప్పుడు వచ్చునోయని
ఇల్లంంతా బెంంగటిల్లింంది
మనాదితో మంంచపట్టింంది!


Thursday, April 25, 2019

దత్తపది

రాగము- యోగము - భోగము - త్యాగము పదాలతో పద్యంం
 రాగము గలజను లందరు
యోగము నొందెద రి యోరిమి తోడన్
భోగము ఘటించి నపిదప
త్యాగము జేసెడు సుజనులు ధన్యులె యగుదుర్
[4/25, 9:16 PM] రాజశేఖర్ పచ్చిమట్ల: రాగము తోడుత నేప్రజ
భోగము నొందుతు మరిమరి భువిజి క్కకనే
యోగము బాటల నేగుచు
త్యాగము నలవ ర్చుకొన్న ధన్యులు గారే

Tuesday, April 23, 2019

విత్తుల పొత్తము (పద్యాలు )


(ప్రపంంచ పుస్తక దినోత్సవంం సంందర్భంంగా)

పొత్తపు పొలమున కలముతొ
విత్తిన పూర్వుల యనుభవ విత్తన గణసం
విత్తము గచదివి నయెడల
సత్తువ బెంచుట యెగాక సంపద లొసగున్

పుస్తక ములవిక సింంచును
మస్తక ములనింం డమంంచి యాలో చనముల్
పుస్తక మునుమింం చినదగు
నేస్తమ దిదొరక  దుతరచి యిలలో వెదకన్

విత్తులు నింండుగ గల్గిన
పొత్తము లనుబ ట్టితెచ్చి పొలుపుగ సదువన్
చిత్తము నింండుగ వెలుగును
యత్తప నుడికర ములగుచు యవనిని గ్రాచున్

              - రాజశేఖర్

Monday, April 22, 2019

నెత్తుటి రూపం



పచ్చని చెట్లు
పశుపక్షాలు
ఎత్తైన గుట్టలు
వాగులు వంకలు
ఏరులు సెలయేరులతో
నిండు ముత్తయిదువలా గుండే అడవి
అలమటించిన రోజు

వీరుల నెత్తుటి దారలను
వేరులకోరలతో జుర్రి
అడవి ఎరుపెక్కిన రోజు

మాయకుల కుట్రలకు
అమాయకులు బలైనరోజు
హక్కులడిగినవారిపై
హుకుం జూపినరోజు

జల్ జంగల్ జమీన్ మాటల తూటలు విని
పెద్ద మనుషులకు
నిద్దుర కరువైనరోజు

అడవితల్లి ఒడి నిమ్మని
ఆదివాసీ హక్కులడినరోజు
ప్రభుత్వ ప్రతాపానికీ
గుండెలనెదురొడ్డి
నేలకొరిగి నెత్తుటి మరకల తిలకమద్దినరోజు

ఇంద్రవెల్లి ఇప్పలన్ని
ఎరుపెక్కి
కొండకోనలు దండిగ
రోదించిన రోజు

మచ్చలేని అడవిమనషుల మనసుల్లో
చెరగని పుట్టమచ్చని నిలిపి
పదేపదే పరితపించేలా
ఆరనిమంటలు రేపి
ఇంద్రవెల్లి నడివనమున
నెత్తుటిరూపమై
వీరుల అమరత్వానికి
నిలువెత్తు నిదర్శనమైనది

విప్లవానికి
వీరుల త్యాగానికీ
ఆది వాసీ ఆక్రోశానికీ
ఆనవాలుగ మిగిలింది ఇంద్రవెల్లి!

Friday, April 19, 2019

ఇల్లాలు



సమాజంతో పోటీపడలేక
చెలరేగిన తరంగాలై
అతలకుతలం జేస్తున్న
సంసారపు బాధలనీదలేక
సతమతమౌతున్న పెనిమిటిజూచి
నిండ నీటితో భారంగా
కదులుతున్న మేఘమై తిరగాడుతూ
నిత్యం మోముపై చిరునవ్వుల నంటించుకొని
ధైర్యం సాకారమైనట్టు కనవడుతూ
ఆప్యాయత పవనముల కరిగి
భారం దించుకున్నట్లు
చాటుగా కన్నీరు కార్చి బాధను దించుకొని
మేకపోతు గాంభీర్యంతో
భర్తకు వెన్నుదన్నై నిలుస్తుంది భార్య!

నెలవంకలను నేర్పుతో అద్దిన
ఆరు గజాల అతుకుల చీరతో
తనువు మసక బారుతున్న
చిరుదరహాసము చితికి పోనీకుండ
వెన్నెలయి వెలుగుతుంది వెలది !

అంతఃపుర మంత ఖాళీయై
వంటింట్లో ఒంటరిగానున్న వేళ
తనో కన్నీటి చెలిమైతది
తన హృదయంసుడులు దిరిగే సంద్రమైతది
అయినా
భర్తకు బాసటగ నిల్చి భరోసానిచ్చి
సంసారనావకు తెరచాపై
దూరపు తీరాలు దరిజేర్చు
దారి జూపుతుంది దయిత !

మనసంత సమస్యల
నిలయమై కలవరపెడుతున్నా
ఆత్మాభిమానం అణువంతైన చేజారనీక
ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని
ఇంటిగుట్టు బయటపడకుండ
గుట్టుగా సంసారం సాగించే
     సహనమూర్తి ఇల్లాలు !

Thursday, April 4, 2019

ఉగాదికి స్వాగతంం !


ఉదయభానుడి ద్యుతికరాలింగనములో
పరవశమొందిన పంటపొలాలు
నిరంతరం నిలకడగ బారే
నిత్యయవ్వనులైన నదీతరంగాలు
అన్నపూర్ణయైై పరిఢవిల్లిన యవనిపైై
వత్సరకాలంం వర్దిల్లిన బతుకులో
ఫలింంచిన పలుఆశల నడుమ
నెరవేరని కలల నిట్టూర్పులతో
సంంభ్రమాశ్చర్యాల సాంంగత్యంంలో
విళంంభి వీగిపోతూ సాగిపోతూంంది.


ఎన్నో అనుభవాలు
ఎన్నెన్నో మధురానుభూతులు
అల్లుకున్న అనుబంంధపులతలు
మనోపలకంంపైై చెరుపలేని చేదు జ్ఞాపకాలు
ఎడబాసిన ఎంంటికలైై
ఎగిరిపోయిన గతస్మృృతుల నడుమ
నిరుడు నిశ్చలంంగా నింండుకుంంటూ

చిగురాశలు చిగురింంపజేస్తూ
తీరని అశలయానాన్ని
దరిజేర్చే ధైైర్యాన్ని
కలల సాధనలో
కలవరమెరుగని కార్యదక్షతనంందింంచి
కాలంంతో కాలుగలిపి
నిత్యనూతనమైై సాగే జీవితంంలో
ఎగురుతున్న పతంంగమైై
అంందరి మనసుల నలరింంపజేయ
సాకారమైై వస్తున్న వికారికి స్వాగతంం!


మోడుబారిన బతుకుమానులకు
ఆశలచిగురుల నకురింపజేసి
జీవితపుటెండమావి నేమార్చి
చలిచెలిమెలు పూయించి
భావిని బంగరుమయం జేసేలా
విశ్వజనాకాంక్షలు విరబూసేలా
మానవలోకపు మనప్రపుల్లమొనరించ
ఉత్తుంగ తరంగమై ఉరకలెత్తుతూ
విజృంభించి వస్తున్న వికారికి స్వాగతం!

తెలుగుతనపు తీయదనంంతోబాటు
సంస్కృతిసంప్రదాయాల సొగసును జూపే
అచ్చతెలుగు కొత్త యేడాది పండుగకు ఆహ్వానం
ప్రాకృృతిక మార్పులతో పరవశులనుజేసి
వత్సరమంంతా ఉత్సవమైై సాగేలా
ఉల్లముల నుల్లసింపజేసెడు ఉగాదికి స్వాగతం!!




Tuesday, March 12, 2019

సమస్యపూరణ

సమస్యాసాధన: క్రూరుని మార్గమ్మె మనకు గూర్చును ముక్తిన్

కోరిక లేవియు గోరక
యారా మునిగొ ల్చునట్టి యావర పురుషున్
వీరా వేశపు భక్తుండ
క్రూరుని మార్గమ్మె మనకు గూర్చును ముక్తిన్

Thursday, February 14, 2019

గజల్ : తీర్చలేనిది



 ఏతీరుగ సేవించిన అమ్మ ఋణం తీర్చలేము
కన్నీళ్లతో కాళ్లు గడుగ తల్లి ఋణం తీర్చలేము

నినుకడుపున మోసినపుడు నిదురలేని రాత్రులెన్నొ
గడిపుతు ప్రాణంపోసిన అమ్మ ఋణం తీర్చలేము


మరణశయ్యపై నిలిచి మనిషిరూపు నీకిచ్చి
ధరకు నిన్ను పంపినట్టి ధాత్రి ఋణం తీర్చలేము


పెరుగుతున్న నిన్ను జూసి నిలువెల్ల పరశించి
ముద్దులాడి మురిసిపోవు మాతృఋణం తీర్చలేము

రెక్కలిచ్చి రెపరెపమని నింగినంట నీవెదిగితే
యెదలోతుగ పొంగిపోవు జనని ఋణంతీర్చలేము

 కవిశేఖరు వంటి కలములెన్ని గలిసి వర్ణించిన
త్యాగమయిగ నిలిచినట్టి తల్లిఋణం తీర్చలేము
                         
                                                - కవిశేఖర

Sunday, February 10, 2019

వాణీస్తుతిపద్యంం

కం.

సరసిజ పీఠా రూడిని
చిరుదర హాసము విలసిత కరకమ లములన్
వరవీ ణాధరి వాగీ
శ్వరిచిర యశముల నొసగెడు సదువుల నీవే

Saturday, February 2, 2019

సమస్య: వనముల్ దగ్దంంబులయ్యె భాగ్యనగరిలో

కంం.

కనుదో యినిరం జింపెడు
వినువీ ధినితా కునట్టి వేలగృ హములన్
మనుజులు నివసిం చేటిభ
వనముల్ దగ్దంబులయ్యె భాగ్యనగరిలో

Thursday, January 31, 2019

పాతివ్రత్యం

సంసారపు బాధల నీదలేక
సతమతమవుతున్న భర్తను జూసి
దిగులు పడుతు దినం గడువక
బాధనంత దిగమింగి
హదయాంతరాలలో పదిల పరిచి
మేకపోతు గాంభీర్యంతో
వెన్నుదన్నుగ నిలుస్తుంది గృహిణి !

అంతః పురమంతా ఖాళియై
వంటశాలలో ఒంటరిగ నున్న వేళ
తాను కన్నీటి చెలిమైతది
తన హదయం
సుడులు దిరిగే సంద్రమైతది
దుఃఖపు ముత్తెపు సరులను
కొంగున ముడేసుకొని
వర్షించిన మేఘమై
యెదతాపము చల్లార్చుకుంటుంది

అత్తెసరు పైకంతో
అవసరాలు తీరక
కుంటుతున్న కుటుంబానికి
మూడోకాలయి
భర్తకు బాసటగ నిల్చి
భరోసా నిచ్చి
సంసార నావకు తెరచాపయి
దూరాల తీరాలను
దరిజేర్చు దారి జూపుతుంది!

వేణుగానామృతం

వేణుమాధవమోవి వేణుగానమువిని
వనమయూరమ్ములు వలచి యాడె
మురళిలోలుడుజేయు మురళీరవమువిని
కోయిలల్ మారుగా కూత వెట్టె
పిల్లనగ్రోవితో నల్లనయ్యనుజూసి
రాయంచ నర్తించె రమ్యమలర
వంశనాళముబూని వాయించు రాగాల
గోపినాథునిగూడె గోప జనులు

వేణుగానపుటలలలో మేను మరచి
తన్మయత్వము తోడయ త్తన్వి మురిసె
నింగిలోనుండి కన్నయ్య తొంగి చూడ
శిరము దాచెను గోపికా సిగ్గు లొలుక

Monday, January 28, 2019

చిత్రగీతం : కడవెత్తిన పడతి

సీసం:
కడవనె త్తినబెట్టి కదిలివ చ్చినటుల
గనిపించె నొకయింతి కనుల ముందు
భుజముపై ఘటమును బొందిక గాయెత్తి
నడిచివె ళ్తున్నట్టి నారి యొకతి
ఒడుపుతో నొకకుండ నడుముపై మోయుచు
కైపుచూ పులతోడి కాంత యొకతి
కడవయొ క్కటెగాని గనిపించు మూడుగా
ముదితలం దరిచెంత యొప్పు నటుల

సరసి జవిలసి తమ్మగు సరసు తీరు
చెరువు చెంతకు జేరిన చెలువ లలరె
కడుర మణియంపు దృశ్యమై గాని పించి
మైమ రిచిమురి సేట్టుల మాయ జేసె

సాద్వి (పద్యాలు )

కౌమార దశలోన కౌతుక ములుదీర్చ
అప్సర సేయౌను ఆలి తాను
మధ్యవ యసులోని మంతన ములలోన
మంత్రియై తగినట్టి మాట జెప్పు
ముదిమిజొ చ్చినవేళ మూడొకా ళుగమారి
పతులగ మ్యమునకు పదము లౌను
అవసాన దశయందు అతిథిసే వలుజేసి
ఆలంభ నగనిల్చి యాస రౌను
వేలు బట్టిన దాదిగా వెంట నడిచి
కష్ట సుఖముల నన్నింట కలిసి మెదిలి
పేగుబం ధముతోడ పెనిమిటి ప్రేమ బంచి
అమ్మ లకుమారు సేవలో యాలి యగును

Thursday, January 24, 2019

మధుపానం



అన్నాది కాలాన ఆదిదే వులకంత
సురపాన మైనిల్చి సుధను గొల్పె

ప్రభువులున్ బ్రజలంత ప్రమధులై తిరుగాడ
ద్రాక్షాస వమ్మయి దార వారె

కాలగ మనమందు గౌడన్న చేతిలో
తాటిక ల్లుగరూపు దాల్చె నదియె

ఆధునీ కములోన బ్రాందివి స్కీపేర
నానావి ధమ్ముల నవత రించె

కల్లు దాగు నోళ్లు లొల్లిజే యుటెగాదు
చిక్కు లవిడ దీసి చక్క జేయు
మద్య మేది యైన మత్తెక్కు టేగాదు
దిగులు బాపి మనసు ధీమ నింపు

Wednesday, January 23, 2019

శీర్షిక. సంక్రాంతి శోభ



కారుమబ్బులు దూదిపింజలై
కళ్లాపి జల్లినట్టు
తెలుగు వాకిళ్లన్ని తలకోసుకున్నయి..

నింగి లోని చుక్కలన్ని
సుతారంంగ మునివేళ్లతో తెంపి
ముద్దుగుమ్మలు నేలకద్దినట్లు

ఆకసపుటాలంభనగ వేలాడే
ఇంద్రధనుసు నిలకుచేర్చి
వాకిల్లపరిచిన ముగ్గుల తివాచీకి
రంగులు పులిమినట్టు
రాగరంంజితమొనర్చే రంంగవల్లు

సప్తాశ్వ రథారూఢుడై
రయమున భూలోకావలోకముకై
కెంజాయ చూపులతో
యేగుదెంచెడు శుభకరుడి
నులివెచ్చని రాగకిరణాల స్పర్శ
చెలియల చెక్కిల్లను
ఎర్రబరుస్తున్న భాస్కరుడి ధీటుగ
చిమ్మ చీకటిని చీల్చుతూ
నులివెచ్చని ఆఛ్ఛాదనను
పంచుతున్న భోగిమంటలతో

పల్లెతనువుపయి
కొత్త చిగురులు తొడిగి
పల్లెవొడిజేరి
రంగులవిరులై విరిసిన
వలసపక్షులతో
పిల్లాపాపలతో
తెలుగు లోగిళ్లన్ని
మురిసినయి!
పల్లెలన్ని పండుగ
సంబరాలలో మునిగినయి!

గజల్ - చెలివలపు



చెలి నీచూపుల దారంతో నను కట్టేస్తావు
సఖి నీవలపుల సారంతో నను చుట్టేస్తావు

నీలాలను తలపించే నీకనుదోయి దాటి
జాలువారు వెలుగులతో నను చుట్టేస్తావు

నిరంతరం రగిలే సంఘర్షిత సమాజమును
చిరునగవుల చిట్కాలతో నను గెలిచేస్తావు

విరోదంతొ విహరించే వైరుధ్యపు లోకములో
మధురమైన మాటలతో నను దోచేస్తావు

పడతిని మించిన అందం ప్రకృతిలో లేదంటూ
పలుమరు పలువిధముల నను మురిపిస్తావు

చెలి వలపుల తావుల మునకలేల కవిశేఖర
చేయిసాచి చేరదీసి బిగికౌగిలిలో నను చుట్టేస్తావు

మధువు (సీసం )

అన్నాది కాలాన ఆదిదే వులకంత
సురపాన మైనిల్చి సుధను గొల్పె

ప్రభువులున్ బ్రజలంత ప్రమధులై తిరుగాడ
ద్రాక్షాస వమ్మయి దార వారె

కాలగ మనమందు గౌడన్న చేతిలో
తాటిక ల్లుగరూపు దాల్చె నదియె

ఆధుని కాలాన బ్రాందివి స్కీపేర
నానావి ధమ్ముల నవత రించె

మద్య మేది యైన మత్థెక్కు టేగాదు
పిల్లి పులిగ మారి లొల్లి జేయు
నాటి తరము నుండి నేటివ రకుజూడ
కల్లు దాగ నోడు ఖలుడె సుమ్ము (గాదె)

లక్ష్మీకటాక్షం

నిత్యసం తుష్టులై నిగనిగలాడేటి
సంపన్ను లనువిడ్చి సంయ మమున

ధనవంతు లుగనిల తలలునిం గికియెత్తి
గర్వహి తులబాసి కదము దొక్కి

ఐశ్వర్య ములతోడ అలరారు చుండేటి
విలసిత మ్మొనరించు విభుల విడిచి

స్వర్గభూ యిష్టమై సరసాల నిలయమౌ
కూబరు లకొలువు కూట మొదిలి

నీదురాక కొరకు నిత్యత పముజేయు
వాని కరుణ జూడు వారి జాక్షి
ధనమ దులను వీడి దారిద్ర్య దారుల
కదిలి రావె తల్లి కమల పీఠి

తృప్తి

ఆకల య్యెడువేళ అన్నముం డినజాలు
ధాన్యరా శులనింట తనరుటేల

అవసర మ్ములుదీర పైకముం డినజిలు
ధనరాశు లనుదాయ తలచు టేల

అంగము లనుగప్ప వస్త్రముం డినజాలు
బట్టల న్నిటిమూట గట్టనేల

తలదాచు టకుతగు తలముం డినజాలు
పెద్దభ వంతుల పేర్చ నేల



సీసం. మానవనైజం

సంపద లనుజూసి సంబుర పడువాడు
ధనమద మ్ముననిల దనరు వాడు

అధికార దాహాన అంగలా ర్చెడువాడు
అన్నద మ్ములతోడు బాపు వాడు

జగతిజ నులనెల్ల సమముజూ చుటగాక
తనపర భావంబు తలచు వాడు

పేదవా రినిజూసి ఛీదరిం చెటెగాక
ధీనస్థి తినిజూసి తిట్టు వాడు

మనసు గల్గి నట్టి మానవుం డవలేడు
అవని వెలసి నట్టి రాయి గాక
అట్టి వార మనుషు లనుటకం టెమిగుల
ధరణి పుట్టి నట్టి ధాన వుండు

సీసం: లక్ష్మీ కటాక్షం



సకలసం పదలతో వికసించు వారల
చెంతనుం డిననేమి చిద్విలాసి

భోగభా గ్యములతో పరివసిం చెడివారి
పంచజే రిననేమి పంక జాక్షి

బొడ్లెవ రములతో పురుడువో సుకునేటి
వరపుత్రు వలపేల వనజ నేత్రి

పలపూప పాయస పంచభ క్ష్యములతో
డలరినన్  ఫలమేమి యంబు జాక్షి

గడియొక గండమై గడుపువా రనొదిలి
గర్వోన్న తులనేల కమల నయని

అన్నపాన ములక కంగలా ర్చెడివారు
అనుది నమొక యుగము  బతుకు వారు
నీదు రాక కొరకు నిత్యత పముజేయు
వారి జేరు కంటె వాసి గలదె
(వారి జేర నీకు పరము దక్కు)

లక్ష్మిస్తుతి

నిత్యసం తుష్టులై నిగనిగలాడేటి
సంపన్ను లనువిడ్చి సంయ మమున

ధనవంతు లుగనిల తలలునిం గికియెత్తి
గర్వహి తులబాసి కదము దొక్కి

ఐశ్వర్య ములతోడ అలరారు చుండేటి
విలసిత మ్మొనరించు విభుల విడిచి

స్వర్గభూ యిష్టమై సరసాల నిలయమౌ
కూబరు లకొలువు కూట మొదిలి

నీదురాక కొరకు నిత్యత పముజేయు
వాని కరుణ జూడు వారి జాక్షి
ధనమ దులను వీడి దారిద్ర్య దారుల
కదిలి రావె తల్లి కమల పీఠి

మధువు

అన్నాది కాలాన ఆదిదే వులకంత
సురపాన మైనిల్చి సుధను గొల్పె

ప్రభువులున్ బ్రజలంత ప్రమధులై తిరుగాడ
ద్రాక్షాస వమ్మయి దార వారె

కాలగ మనమందు గౌడన్న చేతిలో
తాటిక ల్లుగరూపు దాల్చె నదియె

ఆధుని కాలాన బ్రాందివి స్కీపేర
నానావి ధమ్ముల నవత రించె

మద్య మేది యైన మత్థెక్కు టేగాదు
పిల్లి పులిగ మారి లొల్లి జేయు
నాటి తరము నుండి నేటివ రకుజూడ
కల్లు దాగ నోడు ఖలుడె సుమ్ము (గాదె)

గజల్



క్షణక్షణం అనుక్షణం ఆగకుండ సాగాలి
ప్రతీక్షణం పరుగెడుతూ ప్రవాహమై సాగాలి

హోరుతోటి ప్రవహించే వాగులల్లే పొర్లకుండ
నింపాదిగ పయనించే నది నీవై సాగాలి

రాశులుగా సంపదుండే రత్నగర్భ చేరకుండ
జీవుల దాహార్తి తీర్చ చెరువువై సాగాలి

నిండా చీకటినిండిన ధీనమైన బతుకులలో
వెలుగులెన్నో నింపే నెలరాజువై సాగాలి

ఎండిన తరులతల జూసి ఎవ్వరినో నిందించక
నిండుగ చిగురింపజేయు  వసంతమై సాగాలి


స్వార్థపరత తొలగించి త్యాగశీలతను పెంచుతు
సమసమాజ స్థాపనలో సమిధలమై సాగాలి

సమాజ రుగ్మతలన్నిటి సంస్కరింపజేసుకుంటూ
మంచితనపు మారురూపు మనుజుడవై సాగాలి

అందరిలా నీవుంటే అర్థమేమి కవిశేఖర
చిరయశః కాముకులలో
 ఒక్కడివై సాగాలి

Tuesday, January 22, 2019

ఓటరు యువతీర్పు



తెలవార్చుతున్న
తొలికిరణాల నులివెచ్చని వెలుగులో పల్లె నిద్రలేచింది

నీడై నిలిచిన
నిశీదిని వీడి
ఉషోదయం వైపు
అడుగులేసింది

ఓటుకో కోటరన్న
నినాదం నిన్నటితో పాతిపెట్టి
తరతరాల లాలూచీని కనివిని
సిగ్గుతో తలదించుకొని యోచించింది

వీధులలో మద్యపు వైతరణీ
వరదలై పారినా
పానశాల పలుమార్లు
రమ్మని పిలిచినా
ఆత్మస్థైర్యంతో అడుగులేసారు

గతం తాలూకు గురుతులు
మచ్చలై హింసించిన వేధనలోంచి పల్లె
మెల్లమెల్లగ బయటపడింది
నాటి గడీల కర్కశపాలనలోంచి
బానిసత్వపు బంధిఖానా
ఊచలు వంచి
యువశక్తి ఉగ్రరూపమై కదిలింది!

స్వతంత్రమనః పతంగులై
వినువీధి కెగసింది!
యువత ఘనత తెలిపేలా
నూతన శకాన్నారంభించింది!
సామాన్యుడిని
సార్వభౌముడిని చేసి
సాధికారత చాటుకుంది!

సమస్యాపూరణం: కొట్టు కొనిపోయె గాలికి కొండ లెల్ల

నరుని మనసెరి నట్టివా నరులు గూడి
శంక లేకవా రధిగట్టి లంక జేరి
రాము నాజ్ఞతో డత్రుంచె  రాక్ష సులను
కొట్టు కొనిపోయె గాలికి కొండ లెల్ల

Sunday, January 20, 2019

సాహ సమున గల్గు సౌఖ్యమిం చుకెగాని
ఓర్మి గల్గు సౌఖ్య ముడుగ వశమె
సహన శీలి కన్న సాహసిం కనులేడు
పచ్చిమట్లమాట పసిడిమూట

Wednesday, January 16, 2019

కపటవటువు

పూటగడుపుటకు
నానా పాట్లుపడే

గంజిమెతుకులకై
నిరంతరం శ్రమించే!

కష్టించడం
కనికరించడం తప్ప
వంచించడ మసలే యెరుగని
మట్టిమనుషుల ముందు
 పుట్టమన్నలికిన
పూరి పాకల ముంగిట
కొత్త బిచ్చెగాళ్లు
కొలువుదీరిండ్రు!

నీతులు వల్లిస్తూ
నిన్ను ధనవంతుని జేసి
నీముందు కపట వటువై
 కైైమోడ్చి నిలుచుండ్రు!

అంంతలోని పొంంగిపోయి
అడిగినవన్నీ ఇచ్చేయకు,
పైని తెలుపును వొలిచి
లోపలి నలుపును కనిపెట్టు
నడతను పుటంబెట్టి
సొక్కమును గుర్తెరిగి

ఆచితూచి అడుగేయ్ !
ఆలోచించి ఓటేయ్ !
మంచివాడిలా వంచించే
నాయకుల యెదలో
ప్రజాస్వామ్య తూటాను దించేయ్!  

విద్య

తనివినొం దుటబాగు సంపద
గనితృప్తి నొందక మనుజులు కాలేరు సుజనుల్
తనివినొం దతగదు విజ్ఞన
మునుగ్రోలు టందువి భువర్యు ముదిమిప ర్యంతమ్

Tuesday, January 15, 2019

నానీలు

ఏ నిఘంటువు
వివరించలేనిది
బ్రహ్మరాత
వైద్యుడి రాత

హరిదాసులు
లేరు నేడు
వీధులంతా
సురదాసులే

హరివిల్లు
భ్రాంతి చెందింది
రంగులద్దిన
ముగ్గులను జూసి

దూడ పొదుగేసి
చూస్తుంది
గొల్లలు పిండిన
సంగతి తెలియక

Monday, January 14, 2019

శీర్షిక. సంక్రాంతి శోభ





కారుమబ్బులు దూదిపింజలై
కళ్లాపి జల్లినట్టు
వాకిళ్లన్ని తలకోసుకున్నయి

నింగి లోని చుక్కలన్ని
పడతుల మునివేళ్లతో తెంపి
నేలకద్దినట్లు

ఆకసపుటాలంభనగ వేలాడే
ఇంద్రధనుసు ఇలకుచేరి
వాకిల్లపరిచిన ముగ్గుల తివాచీకి
రంగులు రంగరించినట్టు

సప్తాశ్వ రథారూఢుడై
రయమున భూలోకావలోకముకై కెంజాయ చూపులతో
యేగుదెంచెడు శుభకరుడి
రాగకిరణాల స్పర్శ
చెలియల చెక్కిలను
ఎర్రబరుస్తున్న భాస్కరుడి ధీటుగ

చిమ్మ చీకటిని చీల్చుతూ నులావెచ్చని ఆఛ్ఛాదనను పంచుతున్న భోగిమంటలతో


పల్లెతల్లి కొమ్మలు కొత్త చిగురులు తొడిగి రంగులవిరులై విరిసిన
వలసపక్షులతో

పిల్లాపాపలతో
తెలుగు లోగిళ్లన్ని
మురిసినయి!
పల్లెలన్ని పండుగ సంబరాలలో మునిగినయి!

                   -  కవిశేఖర

సంక్రాంతి పర్వం (పద్యం)

సీసపద్యం
ఉదయసం ధ్యపువేళ  ఉత్తేజ పూరితై
వాకిళ్ల నలికెనో వారి జాక్షి

చిరుదర హాసమ్ము చెక్కిళ్ల చిగురించ
ముగ్గులు పరిచెనో ముద్దుగుమ్మ

పిల్లసం తునుజూసి ప్రేమపూ రితయయ్యి
రాగమె త్తునుభక్తి రాగరమణి

సకలభో గములను సాధించు కాంక్షతో
గౌరిదే వినివేడె కంభుకంఠి

మమత లువిరిసి యుప్పొంగు మనసు లన్ని
ఆత్మ సంతృప్తి తోజేరి యాటలాడ
సకల భోగము లీయంగ సంత సమున
ఉర్వి నలరారె సంక్రాంతి పర్వదినము

Wednesday, January 9, 2019

మంచి బతుకు(పద్యాలు )

ఆకల య్యెడువేళ అన్నముం డినజాలు
ధాన్యరా శులనింట తనరుటేల

అవసర మ్ములుదీర పైకముం డినజిలు
ధనరాశు లనుదాయ తలచు టేల

అంగము లనుగప్ప వస్త్రముం డినజాలు
గుడ్డల న్నిటిమూట గట్టనేల

తలదాచు టకుతగు తలముం డినజాలు
పెద్దభ వంతుల పేర్చ నేల

కూడు గూడు గుడ్డ కూర్చుకొ నినజాలు
అతిగ నాశ పడిన ఫలమ దేమి
పాప చింత బాపు పరమశి వునివేడు
అదియు గాక మోక్ష మార్గ మేది

దానవశీలం(పద్యాలు )

సంపద లనుజూసి సంబుర పడువాడు
ధనమద మ్ముననిల దనరు వాడు

అధికార దాహాన అంగలా ర్చెడువాడు
అన్నద మ్ములతోడు బాపు వాడు

జగతిజ నులనెల్ల సమముజూ చుటగాక
తనపర భావంబు తలచు వాడు

పేదవా రినిజూసి ఛీదరిం చెటెగాక
ధీనస్థి తినిజూసి తిట్టు వాడు

మనసు గల్గి నట్టి మానవుం డవలేడు
అవని వెలసి నట్టి రాయి గాక
అట్టి వార మనుషు లనుటకం టెమిగుల
ధరణి పుట్టి నట్టి ధాన వుండు

లక్ష్మీ కటాక్షం



సకలసం పదలతో వికసించు వారల
చెంతనుం డిననేమి చిద్విలాసి

భోగభా గ్యములతో పరివసిం చెడివారి
పంచజే రిననేమి పంక జాక్షి

బొడ్లెవ రములతో పురుడువో సుకునేటి
వరపుత్రు వలపేల వనజ నేత్రి

పలపూప పాయస పంచభ క్ష్యములతో
డలరినన్  ఫలమేమి యంబు జాక్షి

గడియొక గండమై గడుపువా రనొదిలి
గర్వోన్న తులనేల కమల నయని

అన్నపాన ములక కంగలా ర్చెడివారు
అనుది నమొక యుగము  బతుకు వారు
నీదు రాక కొరకు నిత్యత పముజేయు
వారి జేరు కంటె వాసి గలదె
(వారి జేర నీకు పరము దక్కు)

పరిశీలన



అలరించే పూలనుగాదు
అట్టడుగున దాగిన వేళ్లను జూడు

అగుపించే ఆకారముగాదు
ఆలంబనైన రాయినిజూడు!

అందమైన తోటను గాదు
తోటమాలి శ్రమను జూడు!

మిరుమిట్లుగొలిపె మెరుపులుగాదు
దానిమాటు సంఘర్షణ జూడు!

వెలుగులీను వజ్రమును గాదు
సానరాయి సత్తువ జూడు!

పండంటి బిడ్డను గాదు
తల్లి ప్రసవవేదనను జూడు!

గజల్

గజల్

చెలి నీచూపుల దారంతో నను కట్టేస్తావు
సఖి నీవలపుల సారంతో నను చుట్టేస్తావు

నీలాలను తలపించే నీకనుదోయి మెరిసి
జాలువారు వెలుగులతో నను చుట్టేస్తావు

ఆవేశంతో రగిలే సమాజ రణరంగమును
చిరునగవుల చిట్కాలతో నువు గెలిచేస్తావు

విరోదంతొ రగిలే వైరుధ్యపు భావాలను
మధురమైన మాటల నువు అణిచేస్తావు

పడతిని మించిన అందం ప్రకృతిలో లేదంటూ
సుందరజగత్తుకంత  చాటేస్తావు

పొలతుల హృదయపు లోతులు  కొలిచిన కవిశేఖరుడిని
బిగికౌగిట బంధించి చుట్టేస్తావు

Friday, January 4, 2019

మళ్లీరావాలి

ఒకరికొకరు
చేదోడు వాదోడయ్యే రోజు

పైసలకుగాక
మనుషులకు విలువిచ్చేరోజు

ఆహార్యముల నొదిలి
అసలు మనిషిని గౌరవించే రోజు

అంతస్తులనుదిగి
అంతరంగాలలో ఒదిగేరోజు
మళ్లీరావాలి
ఆపాత మధురాలను
మోసుకొని రావాలి

కవితాంకురం

కవిప్రసవవేదనానంతరం
కవితాప్రభ ప్రభవించినది

శిల్పి మనోచింతనమున
శిలకడుపున శిల్ప ముద్భవించినది

కర్షకుని స్వేదము సేద్యపునీరైతేగాని
పుడమి సస్యములతో పులకరించదు

పరిశీలన

శీర్షిక: పరిశీలన

అలరించే పూలనుగాదు
అట్టడుగున దాగిన వేళ్లను జూడు

అగుపించే ఆకారముగాదు
ఆలంబనైన రాయినిజూడు!

అందమైన తోటను గాదు
తోటమాలి శ్రమను జూడు!

మిరుమిట్లుగొలిపె మెరుపులుగాదు
దానిమాటు సంఘర్షణ జూడు!

హొయలొలు శిల్పసౌందర్యం గాదు
శిల్పి కళావైధుష్యమును జూడు

వెలుగులీను విద్యార్థిని గాదు
సానరాయి సత్తువ జూడు!

పండంటి బిడ్డను గాదు
తల్లి ప్రసవవేదనను జూడు

క 'వికలం'

శీర్షిక: క 'వికలం'

నాలోని భావాలు
నను వేదించిన క్షణాలు

అక్షరాలుగ అంకురించి
పదకవితా లతలుగ
పాటల సెలయేళ్లుగ
అలంకారపు టలలుగ
వినువీధిని విహరించక


మనిషితో మమైకమై
సంఘంతో సంఘటితమై
ప్రజాపక్షం నిలిచిననాడు
       నా కలానికో శక్తి!
              నా గళానికో రక్తి!!

గాలింపు

శీర్షిక: గాలింపు

పూల పరిమళాల నాస్వాదించు చాలు
శాఖా భేదాలను శోధించకు

మధురజలాలు స్వీకరించు చాలు
నదులలోతులు వెతికుచూడకు

చల్లని నీడను స్వస్తత బొందు చాలు
తరువుల యంతరువు లెంచకు

సద్వీక్షణం

శీర్షిక: కరుణావీక్షణం

నిండు వేసవిలో
చలికాలపు చల్లని
వీచికల నానందించే

ఎముకలు కొరికే చలిలో
రగ్గుల వెచ్చని కౌగిట్లో ఒదిగే

నిడుజడిలో నింపాదిగా
ఒళ్లు తడవకుండా
ఒడ్డునజేరే
ఆగర్భ శ్రీమంతులనొదిలి
దినదిన గండమై బ్రతికే
దినసరి కూలీల దైన్యమును జూడు
కవిహృదయం కకావికలమవుతుంది

Thursday, January 3, 2019

గాలింపు(పద్యాలు )

శీర్షిక: గాలింపు

పూల పరిమళాల నాస్వాదించు చాలు
శాఖా భేదాలను శోధించకు

మధురజలాలు స్వీకరించు చాలు
నదులలోతులు వెతికుచూడకు

చల్లని నీడను స్వస్తత బొందు చాలు
తరువుల యంతరువు లెంచకు

మనిషి మనిషిగ భావించు చాలు
కూకటి వేళ్లు పరికింపకు !

శీర్షిక: క'వికలం'

శీర్షిక: క'వికలం'

నిండు వేసవిలో
చలికాలపు చల్లని
వీచికల నానందించే

ఎముకలు కొరికే చలిలో
రగ్గుల వెచ్చని కౌగిట్లో ఒదిగే

నిడుజడిలో నింపాదిగా
ఒళ్లు తడవకుండా ఒడ్డునజేరే
ఆగర్భ శ్రీమంతులనొదిలి

దినదిన గండమై బ్రతికే
దినసరి కూలీల దైన్యమును జూడు
కవిహృదయం కకావికలమవుతుంది

తొలిపొద్దు


రాత్రి తొమ్మిది ఘడియల
పురిటినొప్పులనంతరం
పుడమి తల్లి
పండంటి పసిబిడ్డను
ప్రసవించింది
ఉదయభానుడికి పురుడుపోసింది

జగత్తంత వణికిస్తున్న
చలిపులికి
నులివెచ్చని కిరణాల
సూర్యోదయం
సింహస్వప్నమైైంంది

ప్రభాకరుడి
వాలుచూపులు వాలిన
పుడమి తల్లి
దేహముపై రాలిన
ముత్తెపు బిందువులు
స్రవించి యావిరులై
ఆకసమున కెగసె తరుణం

పశుపక్షాదుల
స్వాగత గీతికల మధ్య
పతంగుడి పదము
పల్లెకేసి కదిలె
పల్లెతల్లి దుప్పటితీసి
ప్రాతఃకాల విధులందు
పరితప్తమయ్యె

                రాజశేఖర్ పచ్చిమట్ల

Wednesday, January 2, 2019

సమస్యాపూరణం

సమస్య:
పతియే దిక్కంచు భామ పతితగ మారెన్

కం.
పతినొల్లయంచు విదపర
పతులన్ గూడుచు నవరస భరిత మ్మొందన్
అతిరథు లందరు దూరగ
పతియే దిక్కం చుభామ పతితగ మారెన్
                                      రాజశేఖర్