Wednesday, January 23, 2019

గజల్



క్షణక్షణం అనుక్షణం ఆగకుండ సాగాలి
ప్రతీక్షణం పరుగెడుతూ ప్రవాహమై సాగాలి

హోరుతోటి ప్రవహించే వాగులల్లే పొర్లకుండ
నింపాదిగ పయనించే నది నీవై సాగాలి

రాశులుగా సంపదుండే రత్నగర్భ చేరకుండ
జీవుల దాహార్తి తీర్చ చెరువువై సాగాలి

నిండా చీకటినిండిన ధీనమైన బతుకులలో
వెలుగులెన్నో నింపే నెలరాజువై సాగాలి

ఎండిన తరులతల జూసి ఎవ్వరినో నిందించక
నిండుగ చిగురింపజేయు  వసంతమై సాగాలి


స్వార్థపరత తొలగించి త్యాగశీలతను పెంచుతు
సమసమాజ స్థాపనలో సమిధలమై సాగాలి

సమాజ రుగ్మతలన్నిటి సంస్కరింపజేసుకుంటూ
మంచితనపు మారురూపు మనుజుడవై సాగాలి

అందరిలా నీవుంటే అర్థమేమి కవిశేఖర
చిరయశః కాముకులలో
 ఒక్కడివై సాగాలి

No comments: