Thursday, January 3, 2019

తొలిపొద్దు


రాత్రి తొమ్మిది ఘడియల
పురిటినొప్పులనంతరం
పుడమి తల్లి
పండంటి పసిబిడ్డను
ప్రసవించింది
ఉదయభానుడికి పురుడుపోసింది

జగత్తంత వణికిస్తున్న
చలిపులికి
నులివెచ్చని కిరణాల
సూర్యోదయం
సింహస్వప్నమైైంంది

ప్రభాకరుడి
వాలుచూపులు వాలిన
పుడమి తల్లి
దేహముపై రాలిన
ముత్తెపు బిందువులు
స్రవించి యావిరులై
ఆకసమున కెగసె తరుణం

పశుపక్షాదుల
స్వాగత గీతికల మధ్య
పతంగుడి పదము
పల్లెకేసి కదిలె
పల్లెతల్లి దుప్పటితీసి
ప్రాతఃకాల విధులందు
పరితప్తమయ్యె

                రాజశేఖర్ పచ్చిమట్ల

No comments: