Tuesday, January 22, 2019

ఓటరు యువతీర్పు



తెలవార్చుతున్న
తొలికిరణాల నులివెచ్చని వెలుగులో పల్లె నిద్రలేచింది

నీడై నిలిచిన
నిశీదిని వీడి
ఉషోదయం వైపు
అడుగులేసింది

ఓటుకో కోటరన్న
నినాదం నిన్నటితో పాతిపెట్టి
తరతరాల లాలూచీని కనివిని
సిగ్గుతో తలదించుకొని యోచించింది

వీధులలో మద్యపు వైతరణీ
వరదలై పారినా
పానశాల పలుమార్లు
రమ్మని పిలిచినా
ఆత్మస్థైర్యంతో అడుగులేసారు

గతం తాలూకు గురుతులు
మచ్చలై హింసించిన వేధనలోంచి పల్లె
మెల్లమెల్లగ బయటపడింది
నాటి గడీల కర్కశపాలనలోంచి
బానిసత్వపు బంధిఖానా
ఊచలు వంచి
యువశక్తి ఉగ్రరూపమై కదిలింది!

స్వతంత్రమనః పతంగులై
వినువీధి కెగసింది!
యువత ఘనత తెలిపేలా
నూతన శకాన్నారంభించింది!
సామాన్యుడిని
సార్వభౌముడిని చేసి
సాధికారత చాటుకుంది!

No comments: