కారుమబ్బులు దూదిపింజలై
కళ్లాపి జల్లినట్టు
వాకిళ్లన్ని తలకోసుకున్నయి
నింగి లోని చుక్కలన్ని
పడతుల మునివేళ్లతో తెంపి
నేలకద్దినట్లు
ఆకసపుటాలంభనగ వేలాడే
ఇంద్రధనుసు ఇలకుచేరి
వాకిల్లపరిచిన ముగ్గుల తివాచీకి
రంగులు రంగరించినట్టు
సప్తాశ్వ రథారూఢుడై
రయమున భూలోకావలోకముకై కెంజాయ చూపులతో
యేగుదెంచెడు శుభకరుడి
రాగకిరణాల స్పర్శ
చెలియల చెక్కిలను
ఎర్రబరుస్తున్న భాస్కరుడి ధీటుగ
చిమ్మ చీకటిని చీల్చుతూ నులావెచ్చని ఆఛ్ఛాదనను పంచుతున్న భోగిమంటలతో
పల్లెతల్లి కొమ్మలు కొత్త చిగురులు తొడిగి రంగులవిరులై విరిసిన
వలసపక్షులతో
పిల్లాపాపలతో
తెలుగు లోగిళ్లన్ని
మురిసినయి!
పల్లెలన్ని పండుగ సంబరాలలో మునిగినయి!
- కవిశేఖర
No comments:
Post a Comment