పచ్చని చెట్లు
పశుపక్షాలు
ఎత్తైన గుట్టలు
వాగులు వంకలు
ఏరులు సెలయేరులతో
నిండు ముత్తయిదువలా గుండే అడవి
అలమటించిన రోజు
వీరుల నెత్తుటి దారలను
వేరులకోరలతో జుర్రి
అడవి ఎరుపెక్కిన రోజు
మాయకుల కుట్రలకు
అమాయకులు బలైనరోజు
హక్కులడిగినవారిపై
హుకుం జూపినరోజు
జల్ జంగల్ జమీన్ మాటల తూటలు విని
పెద్ద మనుషులకు
నిద్దుర కరువైనరోజు
అడవితల్లి ఒడి నిమ్మని
ఆదివాసీ హక్కులడినరోజు
ప్రభుత్వ ప్రతాపానికీ
గుండెలనెదురొడ్డి
నేలకొరిగి నెత్తుటి మరకల తిలకమద్దినరోజు
ఇంద్రవెల్లి ఇప్పలన్ని
ఎరుపెక్కి
కొండకోనలు దండిగ
రోదించిన రోజు
మచ్చలేని అడవిమనషుల మనసుల్లో
చెరగని పుట్టమచ్చని నిలిపి
పదేపదే పరితపించేలా
ఆరనిమంటలు రేపి
ఇంద్రవెల్లి నడివనమున
నెత్తుటిరూపమై
వీరుల అమరత్వానికి
నిలువెత్తు నిదర్శనమైనది
విప్లవానికి
వీరుల త్యాగానికీ
ఆది వాసీ ఆక్రోశానికీ
ఆనవాలుగ మిగిలింది ఇంద్రవెల్లి!
No comments:
Post a Comment