ప్రియతమా!
ఆకాశంలోని ఇరులన్నిటినీ
గుప్పిట బంధించినట్టు
అలవోకగా నల్లనికురులను
వామహస్తమున మడచిపెట్టిన నాచెలీ!
నల్లకలువల కొలువులైన
కన్నుల చూపులను
నా స్పటికపుహృదయంపై
వారజేసిన నా చెలీ!
అరవిరిసిన వెన్నెల వదనమున
దరహాసము మెరియగ
ఎరుపెక్కిన చెక్కిలి సొగసు
కైపెక్కిస్తున్నది నా చెలీ!
జడులను సైతం చైతన్యపరిచెడు
భానూదయ కరస్పర్శ
చిగురించెడు చెంగల్వ సొగసుల
కౌముదీయుత కౌమారచందురిని
కిందజేయు దేవకన్యవై
నాకనుచూపుల కడ జేరితివి చెలీ!
అప్సరసాంగన వైన నీరూపం
నన్ను భావకవినిజేసింది!
మోహనమూర్తివైన నీరూపం
నన్ను నీ దాసుని జేసింది!
ప్రియా!
నాకనులలో నీరూపం చెరిగిపోనీయకు
నామదిని ముగ్ధ మనోహర
ప్రణయకావ్యమొనరించి
నీ సొగసున కంకితమిస్తాను చెలీ!
No comments:
Post a Comment