(గాంధీ 150 వ జయంతి సందర్భంగా గేయాంజలి)
పల్లవి.
బోసినవ్వులతొ వెలిగే తాత
సత్యాగ్రహముల శాంతిదూత ॥2॥
భారతఖండపు ప్రగతి విధాత
మానవలోకపు స్పూర్తి ప్రదాత॥2॥ ॥బోసి నవ్వులతొ ॥
1చ.
నిత్యము సత్యము పలకాలంటూ
మనిషిలొ మంచిని పెంచాలంటూ
విశ్వమానవత విరిసిలాగా
సమతామమతలు పంచిండు
సమాజ ప్రగతిని జూపిండు ॥బోసి నవ్వులతొ ॥
2చ.
ఉప్పు సత్యాగ్రహమును బూని
సమరశంఖమును తా పూరించి
అఖండ విశ్వమ్మనుసరించేల
అహింసోద్యమము నడిపిండు
ఆంగ్లేయులను తరిమిండు ॥బోసి నవ్వులతొ ॥
3చ.
అసమానతలను అనుమతించక
మనుషులమధ్యన భేదాలెంచక
మానవత్వమనె పునాదిపైన
భారతజాతిని నడిపిండు
ప్రగతి బాటలు వేసిండు
॥బోసి నవ్వులతొ ॥
4చ.
నిరాడంబరతె నిత్యసూత్రమై
నిజాయితీయె నిజరూపమ్మై
సత్యాహింసలే సాయుధమ్ములని
శాంతిపథమ్మును జూపిండు
స్వాతంత్ర్యము సాధించిండు
॥బోసి నవ్వులతొ ॥
5చ.
జయహో జయహో గాంధీతాత
జగజ్జనావళి మెచ్చిన నేత
అందరి మనసుల ఆరాధ్యుడవై
అజరామరమై వెలిగే నేత ॥బోసి నవ్వులతొ ॥
No comments:
Post a Comment