Sunday, November 5, 2023

మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు (పాట)

మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు

ఒళ్లో వాలాలనుంది తల్లిపేగుకు

మళ్లీపోవాలనుంది పల్లెటూరుకు

మళ్ళిమళ్ళీ పోవాలనుంది తల్లిచెంతకూ

అలలతీరు సుడులుతిరిగె జ్ఞాపకాలు నెమరేయుచూ

అనుభవాల దొంతరలను అహర్నిశలు తడిమేయుచూ

మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు

ఒళ్లో వాలాలనుంది తల్లిపేగుకు

వసివాడని పసిప్రాయం గాలమేసి లాగుతుంటే

ఆప్యాయత లొలికేలా అమ్మలాలి పాడుతుంటే

చిన్ననాటి జ్ఞాపకాలు గిలిగింతలు పెడుతుంటే

ఆవసంత తీరాలకు ఆగకుండ సాగిపోయి

ఒదగాలని వున్నది ఆమధురావని ఒడిలోనికి  ॥మళ్లీ॥


పల్లెనిడిచి తల్లినిడిచి వెలగబెట్టినదియేమిటొ

పచ్చదనపు గుండెచీల్చి పాముకున్నదది యేమిటొ

నిలువనీడనిచ్చు తరుల కూలగొట్టె కుతంత్రాల

వాసనైన సోకనట్టి జనపదాల జాడవట్టి  ॥మళ్లీ॥


ఎంతకాలమయ్యిందో యెదలనిండ శ్వాసించి

 ఎన్నిరోజులయ్యిందో  మనసారా భాషించి

ఆత్మీయతలడుగంటి అనురాగం కొడిగట్టి

ఎండినగుండెల లోతున ఆరని ఆతడినెతుకుతూ

 ఒక్కసారి తనివి తీర మట్టిని ముద్దాడాలి

(తనివితీర తల్లియెదను తడిమి మురిసిపోయేందుకు )

వెక్కియేడ్చే తల్లి యెదశోకం బాపుటకు  ॥మళ్లీ॥

ఆఘ్రానించాలనుంటే ఆమట్టి పరిమళం

ఆస్వాదించాలనుంటే  ఆజీవనమాధుర్యం

తప్పదు మానవజాతి ఆత్మావలోకనం  

ప్రగతిముసుగుదీసి మరల పల్లెసొగసు చూసేందుకు ॥మళ్లీ॥ 

మరబతుకులు మాకొద్దని మనసు మొత్తుకుంటుంటే

పచ్చనైన పల్లెసీమ స్వాగతాలు పలుకుతుంటే

సీతకోకలై మనస్సు గాలిలోన తేలియాడ

కలలు మరచి కన్నతల్లి కౌగిలిలో చేరేందుకు ॥మళ్లీ॥

తప్పటడుగు తెలుసు కోని తల్లి ఒడిని చేరుదాం

సాలెగూటి పోగులోలె పల్లెను కాపాడుదాం ॥మళ్లీ॥



Sunday, October 29, 2023

యోగమందిన భోగి వేమన్న (సీస పద్యాలు)


1.సీసం.

కొండవీడు వంశ కొదమసింహపుఛాయ

వేమన్న జన్మించె వెలుగు బంచ

రాజ్యపా లనమందు రంజన మ్మొందక

వేశ్యలోలుడయ్యె వేమరెడ్డి

సరసాలు విరసాలు సాగించ నాయింతి

సర్వసం పదలెల్ల స్వాహజేసె

వదినెయా నతితోడ వలువలొ లిసిజూసి

భోగమ్ము లన్ రోసి యోగియయ్యె

ఆ.వె.

మౌన మాచ రించి యొనరించె సత్కృతుల్ 

సర్వ జనుల  మతిని చక్కజేయ

వేమనార్యు డొసగె వేలాది పద్యముల్ 

ధరణి జనుల కెల్ల దారి జూప

2.సీసం.

వేమన్న బెకిలించె వేవేల అంశముల్ 

లోకమం దున్నట్టి లోటుపాట్లు

విగ్రహా రాధనన్  మిగులవి మర్శించి

మూఢవిశ్వాసాల మొదలు త్రుంచె

కోటివి ద్దియలన్ని కూటికొ రకెయంచు

దొంగస న్యాసుల తూలనాడె

సామాన్య నీతులన్  చక్కగా జెప్పుచూ

అఖిలజ నులమది నాక్రమించె

ఆ.వె.

వేల వేల కొలది వెలయించె పద్యముల్ 

సంఘ జనుల రీతి సంస్కరించ

ధరణి పాడి దప్ప తనదైన రీతిలో

కలము కొరడ బట్టె కవిగ తాను


3.సీసం.

వేశ్యవా కిటనుంచి వేద్యుడై వెలుగొంది

జ్ఞాననే త్రమువిచ్చి జ్ఞాని యయ్యె

ప్రజబట్టి వేదించు పలుసమ స్యలనెల్ల

పరికించి దరిజేర్చ పరితపించె

హాస్యమ్ము వ్యంగ్యమ్ము ఆక్షేప మొనరించ

చతురత నాక్రోశ  సరస పరిచి

ఉపమాన దృష్టాంత సూక్తిప్రా యమ్ముగా

నీతుల బోధించె నేతులలర

ఆ.వె.

సానబెట్టెకవిత జనరంజ కములయ్యి

ఉపము గూర్చె వసుధ యోర్పు మెరియ

వెలది చెలిమి జేసి వేదవేద్యుండయ్యి

మూఢజనులకెల్ల మోక్షమొసగె


Monday, September 25, 2023

(తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ) సీసపద్యం


సీసం:

మందార మకరంద మాధుర్యములతోడ

మధురస మొలకించు మాతృభాష

నిర్మల మందాకి నీవీచి కలదూగు

హాయిగొ ల్పెడునట్టి యమృతభాష

లలితరసాల పల్లవ లాలిత్య విలసిత

నవనీత కోమలి నాదు భాష

పూర్ణేందు చంద్రికా స్పురిత యైసాగు

జ్ఞానసు ధలుబంచు జనుల భాష



పలుతె రగుల దెలివి ప్రపుల్ల మొందేల

పదస మూహ మున్న పసిడిభాష

మనసులోని భావ మాధుర్య ములతోడ

జనుల రంజ కమయి జగతి వెలుగు


రాజశేఖర్ పచ్చిమట్ల

తెలుగు భాషోపాధ్యాయులు

Monday, September 18, 2023

వినాయక చవితి (సీసం)

 నాకలో కమునందు నడయాడు గణపయ్య

ఎలుకవా హనమెక్కి యిలకు వచ్చె

అమ్మతో డమిగుల ఆటలా డెడువాడు

దాగుడు మూతల ధరణి జొచ్చె

భూలోక వాసుల పులకింప జేసేల

ఆదర మ్మునతాను అవతరించె

ఇహలోక వాసుల విఘ్నమ్ము లనుబాపి

విహరించ తానొచ్చె విఘ్నరాజు


పరవ శించె తాను బాలకు లగలిసి

బాల్య క్రీడ లాడి పులక రించె

అట్టి యతిథి రాక ఆశ్చర్య మునుగొల్పె

మనుజ లోక మంత మైమ రించె


పచ్చిమట్ల రాజశేఖర్

Saturday, August 26, 2023

తండ్రి సంరక్షణ పద్యం

సీసం:


తండ్రి గాచు మనల ధరణితో తుల్యమై 

    తండ్రి గాచు మనల దండిగాను 

తండ్రి గాచుమనల తగురీతి మెప్పించి 

     తండ్రి గాచు మనల తరువు వలెను 

తండ్రి గాచు మనల తాగురువుగనిల్చి

     తండ్రి గాచు మనల దండ నమున 

తండ్రి గాచు మనల తానెసర్వస్వమై

    తండ్రి గాచు మనల దాత వలెను 


తండ్రి కఠినాత్ముడై యుండు తమను దీర్చ 

తండ్రి పిసినారి యైయుండు తమనుబెంచ 

తండ్రి శ్రమజీవి యైయుండు తమను సాక 

తండ్రి గొడుగుతానైయుండు నీడనొసగ

Friday, August 11, 2023

గజల్ స్నేహపరిమళం


అందమైన బంధమయ్యి అవతరించు రా చెలిమి

అవరోధాలెరుగకుండ ఆగమించురా చెలిమి ॥2॥


పేద ధనిక భేదాలను యెంచబోదు ఆబంధం

స్వార్థమన్నదే యెరుగక కొనసాగించు రా చెలిమి


కులమతాలపట్టింపుల కొలతమరచి కలుపుకుంటు

మానవతే పునాదిగా అంకురించురా చెలిమి


కలిమిబలిమి రంగురూపు లెంచకుండ తోడుండి

మంచితనమె భూమికయై యలరించురా చెలిమి


కవిశేఖరు గుర్తించిన కండబలమురా చెలిమి

సంకుచితకు తావియ్యక ఉద్దరించురా చెలిమి

Monday, July 10, 2023

నీడైన నాన్న


నాన్న దూరమై వత్సరాలు గతించినా

నాన్నలేరను సత్యం గతించలే

కాలంచేసిన గాయాన్ని మాన్పుటకు

భగవంతుడెన్ని లేపనాలు పూస్తున్నా

మనసు లోతులున్న గాయం మానలే

మచ్చ వోలే

ఎన్ని అవకాశపు అంతురాలెక్కిచ్చినా

మూలం లేదనే యాది మరువలే

ఎంత మంది ఆప్తులు దరిజేరి దాపునిల్చినా

భుజం తట్టి బాసట నిల్చే నాన్నను మరిపించలే

భరోసా ఇచ్చే ఆ చేతి స్పర్శను తలపించలే


అయినా ఏదో ఆశ

ఎంతో ఊరట

భౌతికంగా నాన్న దూరమైనా

మమ్ము నీడలా కాస్తూ మావెంటున్నాడనీ. .!


పచ్చిమట్ల రాజశేఖర్