సర్రాసు వోతున్న
సాహితీ నావకు సెక్కలగుల జేసి
ప్రజల దిక్కు నిలవడి
ఉద్యమానికి ఊపిరిలూదిన చైతన్యమతడు
వరుగులైన బడుగుజీవుల
పిరికి గుండెల్లో పాతరేసుకున్న భయాన్నికడిగేసి
దైర్నం నింపి
గడ్డిపరకలతో కవాతు
జేయించిన జవానతడు
మొద్దు నిదుర వోతున్న మొగోళ్ళను
నా గొడవతో సోయికి దెచ్చి
కత్తులే కాదు కలాలూ
యుద్దం చేయగలవని ఛాటిన ధీరుడతడు!
ఎన్నంటిన డొక్కల జూసి ఏడ్సి
ఎగతట్టి
ఆకలికేకల దాపున
అన్నపు కుప్పలు వోసిన ఆప్తుడతడు!
నాజీలసొంటి నిజాముల
నిరంకుశానికి నిలువు నిత్తారం
దుఃఖంల మునిగిన
ప్రజలకన్నీళ్లు తుడిచే బంధువతడు!
స్వార్థమించుకలేని సన్యాసి
పదవులకూ పైసలకూ లొంగని బైరాగి
సాటిమనుషుల పాపాలుకడిగే జీవనది
నెర్రెలు గొట్టిన పేదల గుండెల
ఆర్తి దీర్సిన గుండెతడి
ఉద్యమమే ఊపిరిగా బతికిన వస్తాదు
అమ్మభాషకూతమిచ్చిన పలుకుబడి
ప్రజల గోడును
పాటలుగా పలికించే ప్రజాకవి!
ప్రజల మెదళ్ళను తొలిసే మొగిపురుగులు
తను రాల్చిన సిరాచుక్కలు !
ఫిరంగి కలం నుంచి
రాలిన అగ్గి పరాటలు
అతని అలోచనల జాలువారిన కవితలు!
వెైరుధ్యాలు, వైవిధ్యాలు లేని
తెలంగాణ స్వాప్నికుడతడూ!
దౌర్జన్యాలనూ, దోపిడీలను
నిరసించి నినదించిన ఆక్రోశమతడూ!
అవినీతి చీకట్లను
చీల్చిన పొద్దు పొడుపతడూ!
తెలంగాణీయుల గొడవను తనగొడవగా
తెలంగాణ ప్రజలనే తనబలుగంగా
సాటిమనుషుల సవాళ్లను
తననెత్తిన మోసిన ప్రజలమనిషి కాళోజీ !