Thursday, March 11, 2021

నిర్మలహృదయమే నీలకంఠనిలయం (శివతత్వం)

  

నీమది మనోహర దేవాలయమైనవేళ

ఆశివుడు నీహృద్యంతపురమున కొలువుండడా


నీవర్తనము నిర్మలమైన తరి

ఆహరి వర్తనము సాకారమై సాగిలపడదా


పశుల చిత్తముల వశము చేసుకొను పరమశివుడు

పసిహృదయాల కొలువై పరవశించడా


నిండుమనసున వినిర్మలభక్తి పరిపూర్ణమైన వేళ

వెండికొండవీడి భక్తుల ముందర ప్రత్యక్ష మవడా?


దూరాబారాన రాళ్లలో కొలువైన శివుడు

ఆత్మీయంగా పేర్చిన అమూల్యశైకత రేణువుల 

అణువణువూ సాక్షాత్కార మొందలేడా

భగవంతుని దర్శించ  నిరీక్షిస్తున్న పసిబిడ్డల ముందర

మాతృకర స్పర్శాయుత లింగరూపుడై ఉద్భవించకుండునా


ఆత్మ పరతత్వాన్ని పొందినవేళ

చింతన శివైక్యమైన వేళ

శివశివాయంటూ విలపించినా

హరహరాయంటూ ఆలపించినా

పరమశివుడు పరవశిస్తాడు

మనోవేదిక ఆనందతాండవ మొనరిస్తాడు!


No comments: